
బార్సిలోనా: స్పెయిన్ హాకీ సమాఖ్య శతాబ్ది ఉత్స వాలను పురస్కరించుకొని నిర్వహించిన మూడు దేశాల మహిళల టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీ లో భారత జట్టు రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకొని ఎనిమిది పాయింట్లతో అజేయంగా నిలిచి టైటిల్ సాధించింది. ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 3–0తో స్పెయిన్‌పై గెలిచింది. భారత్ తరఫున వందన కటారియా (22వ ని.లో), మోనిక (48వ ని.లో), ఉదిత (58వ ని.లో) ఒక్కో గోల్ చేశారు.
పురుషుల జట్టుకు కాంస్యం
ఇదే టోర్నీ పురుషుల విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 2–1 గోల్స్ తేడాతో నెదర్లాండ్స్‌పై గెలిచింది. భారత్ తరఫున హర్మన్‌ప్రీత్ సింగ్ (15వ ని.లో), దిల్‌ప్రీత్ సింగ్ (50వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... నెదర్లాండ్స్ జట్టుకు థియరీ బ్రింక్‌మన్ (25వ ని.లో) ఏకైక గోల్ అందించాడు.