
న్యూఢిల్లీ: ఏటీపీ చాలెంజర్ 75 టోర్నీ ఢిల్లీ ఓపెన్‌లో భారత టెన్నిస్ ఆటగాడు నికీ పునాచా రన్నరప్‌గా నిలిచాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన నికీ పునాచా–కోర్ట్‌నీ జాన్ లాక్ (జింబాబ్వే) జంట చేతిలో ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. శనివారం జరిగిన తుదిపోరులో అన్‌సీడెడ్ మసమిచి ఇమామురా–రియో నొగుచి (జపాన్) ద్వయం 6–4, 6–3తో నికీ–జాన్ లాక్ జోడీపై విజయం సాధించింది.
తొలి సెట్ ఆరంభం నుంచే విజృంభించిన జపాన్ జోడీ... 4–1తో ముందంజ వేసింది. ఈ దశలో పుంజుకున్న పునాచా జంట 3–4తో ఆధిక్యాన్ని తగ్గించగలిగిందే తప్ప... చివరి వరకు అదే జోరు కొనసాగించలేక తొలి సెట్ కోల్పోయింది. రెండో సెట్‌లోనూ రాణించిన జపాన్ ద్వయం సునాయాసంగా సెట్‌తో పాటు టైటిల్ గెలుచుకుంది.
మరో వైపు సింగిల్స్ విభాగంలో కైరియాన్ జాక్వెట్ (ఫ్రాన్స్), బిల్లీ హారిస్ (బ్రిటన్) ఫైనల్లోకి ప్రవేశించారు. తొలి సెమీస్‌లో జాక్వెట్ 6–3, 6–1తో విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్)పై...రెండో సెమీస్‌లో హారిస్ 4–6, 7–6 (7/4), 6–2తో ట్రిస్టన్ స్కూల్‌కేట్ (ఆ్రస్టేలియా)పై గెలుపొందారు.