డిసెంబర్ 19.. భారత క్రికెట్ చరిత్రలో ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. టెస్ట్ క్రికెట్‌లో ఇవాల్టి దినాన టీమిండియా రెండు భిన్నమైన రికార్డులు నమోదు చేసింది. 2016లో ఈ రోజున భారత్ టెస్ట్ క్రికెట్‌లో తమ అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత (2020లో) మళ్లీ ఇదే రోజున భారత్ టెస్ట్ క్రికెట్‌లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది.
2016, డిసెంబర్ 19న విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌పై 7 వికెట్ల నష్టానికి 759 పరుగులు స్కోర్ చేసింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో నేటికీ ఇదే అత్యధిక స్కోర్. చెన్నై వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో కరుణ్ నాయర్ అజేయమైన ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఒకే ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసింది. నాటి మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్‌పై ఇన్నింగ్స్ 75 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
సరిగ్గా నాలుగేళ్ల తర్వాత 2020, డిసెంబర్ 19న భారత్ టెస్ట్‌ల్లో తమ అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా 36 పరుగులకే ఆలౌటైంది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే అత్యల్ప స్కోర్. నాటి మ్యాచ్‌లో భారత ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. మయాంక్ అగర్వాల్ చేసిన 9 పరుగులే టాప్ స్కోర్‌గా ఉంది. టెస్ట్‌ల్లో భారత అత్యధిక స్కోర్, అత్యల్ప స్కోర్ విరాట్ కోహ్లి నేతృత్వంలో వచ్చినవే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment