సొంతగడ్డపై తిరుగులేని టీమిండియాకు న్యూజిలాండ్ భయాన్ని పరిచయం చేసింది. గత 12 ఏళ్లగా టెస్టు క్రికెట్‌లో స్వదేశంలో ఏక ఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్న భారత్ దూకుడుకు కివీస్ కళ్లెం వేసింది. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత్ ఘోర ఓటమి చవిచూసింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కోల్పోయింది.
స్వదేశంలో చివరగా 2012లో ఇంగ్లండ్‌పై టెస్టు సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా.. మళ్లీ ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత రెడ్ బాల్ సిరీస్‌ను ప్రత్యర్ధికి సమర్పించుకుంది. ఈ సిరీస్ ఓటమితో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటీసీ) ఫైనల్‌కు చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఈ క్రమంలో సొంత గడ్డపై ప్రత్యర్ధులను చిత్తుచేసే భారత్‌కు ఇప్పుడు ఏమైందన్న చర్చ క్రీడావర్గాల్లో మొదలైంది. పుష్కర కాలం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ టీమిండియా కోల్పోవడానికి గల కారణాలను ఓ సారి పరిశీలిద్దాం. ఓటమి కారణాలు ఇవే..
బ్యాటింగ్ ఫెయిల్..
టీమిండియా సిరీస్‌ను కోల్పోవడానికి ప్రధాన కారణం బ్యాటింగ్ వైఫలమ్యనే చెప్పుకోవాలి. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టులో ఒక్క సర్ఫరాజ్ ఖాన్,రిషబ్ పంత్ మినహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఇప్పుడు పుణే టెస్టులో కూడా అదే పరిస్థితి. రెండు ఇన్నింగ్స్‌లలో యశస్వీ జైశ్వాల్ మినహా కనీసం హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకులేకపోయారు.
మొదటి టెస్టులో కివీస్ పేసర్ల దాటికి 46 పరుగులకే కుప్పకూలిన టీమిండియా.. ఇప్పుడు రెండో టెస్టులో స్పిన్నర్ల ముందు బ్యాట్లెత్తేశారు. న్యూజిలాండ్ స్పిన్నర్ల వలలో చిక్కుకుని భారత్ విల్లాడింది. విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు సైతం చెత్త షాట్లు ఆడి తమ వికెట్లను కోల్పోయారు.
కనీసం ఒక్కరు కూడా కివీస్ బౌలర్లను అడ్డుకుని భాగస్వామ్యం నెలకొల్పే ప్రయత్నం చేయలేదు. ఈ క్రమంలోనే మొదటి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకు కుప్పకూలిన భారత జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. కివీస్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ 13 వికెట్లు పడగొట్టి టీమిండియా ఓటమిని శాసించాడు.
నో డిఫెన్స్, ఓన్లీ హిట్టింగ్..
ముఖ్యంగా ప్రస్తుత భాత జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఒక్కరికి కూడా టెస్టు క్రికెట్ ఆడే సహనం లేదు. ఒకప్పుడు సంప్రదాయ క్రికెట్ అంటే రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్, పుజారా వంటి ఆటగాళ్లు గంటల కొద్దీ క్రీజులో పాతుకుపోయేవారు. వారిని పెవిలియన్‌కు పంపేందుకు ప్రత్యర్థి బౌలర్లు తీవ్రంగా శ్రమించే వారు.
కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. క్రీజులోకి వచ్చామా వన్డే, టీ20 తరహాలో ఆడామా అన్నట్లు భారత బ్యాటర్ల తీరు ఉంది. హిట్టింగ్ చేసే ప్రయత్నంలో తమ వికెట్లను కోల్పోతున్నారు. అంతేకాకుండా భారత బ్యాటర్లు స్పిన్నర్లను ఎదుర్కోవడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భవిష్యత్తులో టెస్టు క్రికెట్‌లో రాణించాలంటే భారత జట్టు కచ్చితంగా స్పిన్ బలహీనతను అధిగిమించాలి.
కొంపముంచిన పిచ్..
పుణే టెస్టులో భారత్ ఓటమికి మరో కారణం పిచ్. సాధారణంగా పుణే పిచ్ అటు పేస్ బౌలింగ్‌కు, స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కానీ భారత జట్టు మెనెజ్‌మెంట్ కివీస్‌పై పూర్తిగా స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించాలని చూసింది. పుణే వికెట్‌ను స్పిన్‌కు అనుకూలించేలా తయారు చేశారు.
కానీ భారత్ అనుకున్నది ఒక్కటి.. అయింది ఒక్కటి. కివీస్‌ను స్పిన్‌తో దెబ్బకొట్టాలని భావించిన టీమిండియా.. అదే స్పిన్ ట్రాప్‌లో చిక్కుకుని విల్లవిల్లాడింది. భారత బ్యాటర్లకంటే న్యూజిలాండ్ ప్లేయర్లే స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఫలితంగా భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని కివీస్ అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment