ముంబై: మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టు కొత్త రికార్డును నమోదు చేసింది. పరుగులపరంగా అతి పెద్ద విజయాన్ని నమోదు చేసి సొంతగడ్డపై సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో భారత్ 347 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలింగ్ ధాటికి మూడు రోజుల్లోపే ఈ మ్యాచ్ ముగియడం విశేషం. తొలి ఇన్నింగ్స్‌లో 35.3 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో మరీ పేలవంగా 27.3 ఓవర్లకే కుప్పకూలింది. 479 పరుగుల విజయలక్ష్యంతో శనివారం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 131 పరుగులకే ఆలౌటైంది.
హీతర్ నైట్ (21)దే అత్యధిక స్కోరు కావడం ఆ జట్టు పరిస్థితిని చూపిస్తోంది. మిగిలిన బ్యాటర్లలో ఎవరూ కూడా భారత బౌలర్లను కనీసం ప్రతిఘటించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లుతో చెలరేగిన ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ రెండో ఇన్నింగ్స్‌లోనూ (4/32) ప్రత్యరి్థని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించింది. పేసర్ పూజ వస్త్రకర్ ఆరంభంలో 3 కీలక వికెట్లు పడగొట్టగా, లెఫ్టార్మ్ స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్‌కు 2 వికెట్లు దక్కాయి. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 186/6 వద్దనే భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో 292 పరుగుల ఆధిక్యం సాధించిన జట్టు ఇంగ్లండ్ ముందు 479 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. మ్యాచ్‌లో మొత్తం 39 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టడంతో పాటు 87 పరుగులు సాధించిన దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. సొంతగడ్డపై భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌ను ఓడించడం ఇదే మొదటిసారి (ఆరు టెస్టుల్లో) కావడం విశేషం. తాజా విజయం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.
గురువారంనుంచి వాంఖెడే స్టేడియంలో ఆ్రస్టేలియాతో ఏకైక టెస్టులో తలపడనున్న నేపథ్యంలో తాజా గెలుపు మరింత ప్రేరణ అందించడం ఖాయం. మరో వైపు ఇంగ్లండ్‌తో టెస్టులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టి అర్ధ సెంచరీ సాధించిన శుభ సతీశ్ ఆసీస్‌తో మ్యాచ్‌కు దూరం కానుంది. ఎడమచేతికి ఫ్రాక్చర్ కావడంతో ఆమె కోలుకునే అవకాశాలు దాదాపుగా లేవు.
347 మహిళల టెస్టుల్లో పరుగులపరంగా అతి పెద్ద విజయం. గతంలో శ్రీలంక (309 పరుగులు) పేరిట ఉన్న రికార్డును భారత్ సవరించింది. ఈ రెండూ మినహా ఇతర టెస్టు విజయాలన్నీ 200 పరుగుల లోపు తేడాతోనే వచ్చాయి.
3 ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇది మూడో విజయం. 15 టెస్టుల్లో భారత్ 1 మ్యాచ్ ఓడగా 11 ‘డ్రా’గా ముగిశాయి. మిగిలిన రెండు సార్లు ఇంగ్లండ్‌లోనే భారత్ గెలిచింది. 27.3 రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆడిన ఓవర్లు. ఆలౌట్ అయిన సమయంలో ఏ జట్టుకైనా ఇదే అతి చిన్న ఇన్నింగ్స్.
స్కోరు వివరాలు:
భారత్ తొలి ఇన్నింగ్స్: 428, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 136,
భారత్ రెండో ఇన్నింగ్స్ 186/6 డిక్లేర్డ్, ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: డంక్లీ (సి) (సబ్) హర్లీన్ 15; బీమాంట్ (బి) రేణుక 17; నైట్ (సి) యస్తిక (బి) పూజ 21; నాట్ సివర్ (బి) పూజ 0; వైట్ (సి) రాణా (బి) దీప్తి 12; జోన్స్ (సి) షఫాలీ (బి) దీప్తి 5; ఎకెల్‌స్టోన్ (బి) రాజేశ్వరి 10; డీన్ (నాటౌట్) 20; క్రాస్ (బి) దీప్తి 16; ఫైలర్ (బి) దీప్తి 0; బెల్ (సి) జెమీమా (బి) రాజేశ్వరి 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (27.3 ఓవర్లలో ఆలౌట్) 131. వికెట్ల పతనం: 1–27, 2–37, 3–37, 4–68, 5–68, 6–83, 7–83, 8–108, 9–108, 10–131. బౌలింగ్: రేణుకా సింగ్ 6–1–30–1, స్నేహ్ రాణా 4–0–19–0, పూజ వస్త్రకర్ 4–1–23–3, దీప్తి శర్మ 8–2–32–4, రాజేశ్వరి 5.3–1–20–2.
Comments
Please login to add a commentAdd a comment