నేటి నుంచి బంగ్లాదేశ్‌తో భారత్ రెండో టెస్టు
సమరోత్సాహంతో టీమిండియా
ఉదయం గం. 9:30 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
కాన్పూర్: వరసగా మూడోసారి ప్రపంచ టెస్టు చాంపియన్íÙప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు చేరాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న భారత క్రికెట్ జట్టు మరో సమరానికి సన్నద్ధమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘనవిజయం సాధించిన టీమిండియా అదే జోరు కొనసాగించాలనే లక్ష్యంతో నేటి నుంచి జరిగే రెండో టెస్టులో బరిలోకి దిగనుంది.
డబ్ల్యూటీసీ 2023–25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న రోహిత్ శర్మ బృందం దాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉండగా... టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు విజయాన్ని కానుకగా ఇవ్వాలని బంగ్లాదేశ్ జట్టు భావిస్తోంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 14 మ్యాచ్‌లు జరగగా... అందులో టీమిండియా 12 విజయాలు సాధించింది.
మిగిలిన రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ఇటీవల పాకిస్తాన్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన బంగ్లాదేశ్ జట్టు భారత గడ్డపై కూడా సంచలన ప్రదర్శన కొనసాగించాలని భావించినా... రోహిత్ జట్టు దూకుడు ముందు నిలవలేకపోయింది. చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టు ఆరంభంలో కాస్త ప్రభావం చూపగలిగిన ఆ జట్టు ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఇప్పటి వరకు స్వదేశంలో వరుసగా 17 టెస్టు సిరీస్ విజయాలు సాధించిన టీమిండియా.. ఇది కూడా గెలిస్తే ఆ సంఖ్య 18కి పెరగనుంది.
ప్రపంచ క్రికెట్‌లో ఒక జట్టు స్వదేశంలో వరసగా అత్యధిక సిరీస్ విజయాలు సాధించిన జాబితాలో టీమిండియా అగ్రస్థానంలో ఉండగా... ఆ్రస్టేలియా రెండుసార్లు స్వదేశంలో వరసగా పదేసి సిరీస్‌లు గెలిచి రెండో స్థానంలో ఉంది. 2012లో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిన అనంతరం స్వదేశంలో టీమిండియా ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు.
రోహిత్, కోహ్లి కూడా రాణిస్తే...
తొలి మ్యాచ్‌లో భారత జట్టు అదరగొట్టింది. ముఖ్యంగా ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశి్వన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతడికి రవీంద్ర జడేజా అండగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ సెంచరీలతో సత్తా చాటారు. అయితే స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి మాత్రమే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. దీంతో ఈ ఇద్దరు కూడా కదంతొక్కాలని టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది.
గత మ్యాచ్‌లో ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగిన భారత్... ఈసారి ఒక పేసర్‌ను తగ్గించి స్పిన్నర్‌ను తీసుకునే అవకాశం ఉంది. దీంతో ఆకాశ్‌దీప్ స్థానంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌లో ఒకరు తుది జట్టులోకి రానున్నారు. కాన్పూర్‌లో చివరిసారిగా 2021లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు ఐదు రోజులు సాగి చివరకు ‘డ్రా’గా ముగిసింది.
ప్రస్తుతం టీమిండియాకు బ్యాటింగ్‌లో పెద్దగా సమస్యలు లేకపోయినా... మున్ముందు న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో కీలక సిరీస్‌లు ఆడనున్న నేపథ్యంలో ప్లేయర్లంతా ఫామ్ అందుకునేందుకు ఈ మ్యాచ్ ఉపయోగపడనుంది.
బంగ్లాదేశ్ పోటీనిచ్చేనా...
పాకిస్తాన్‌పై టెస్టు సిరీస్ విజయంతో భారత్‌లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్ ఇక్కడ మాత్రం అదే జోరు కొనసాగించలేకపోయింది. తొలి మ్యాచ్‌లో సాధారణ ప్రదర్శనతో టీమిండియాకు కనీస పోటీనివ్వలేకపోయింది.
ఇక ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. ఇప్పటి వరకు భారత్‌పై ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవని బంగ్లాదేశ్ ఆ రికార్డును తిరగరాయాలంటే శక్తికి మించి పోరాడక తప్పదు.
11 మరొక్క వికెట్ తీస్తే భారత ఆల్‌రౌండర్ జడేజా టెస్టు క్రికెట్‌లో 300 వికెట్లు తీయడంతోపాటు 3000 పరుగులు చేసిన 11వ క్రికెటర్‌గా గుర్తింపు పొందుతాడు. భారత్ నుంచి కపిల్‌దేవ్, అశ్విన్ ఈ ఘనత సాధించారు.
23 కాన్పూర్‌లో భారత జట్టు ఇప్పటి వరకు 23 టెస్టులు ఆడింది. 7 విజయాలు సాధించి, మూడింటిలో ఓడిపో
యింది. మరో 13 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.
129 మరో 129 పరుగులు సాధిస్తే విరాట్ కోహ్లి టెస్టుల్లో 9000 పరుగులు పూర్తి చేసుకుంటాడు. ఈ ఘనత సాధించిన 18వ క్రికెటర్‌గా నిలుస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment