రెండో టెస్టుకు వర్షం అడ్డంకి
బంగ్లాదేశ్ 107/3
రాణించిన భారత బౌలర్లు
వర్షం, వెలుతురులేమి కలగలిసి భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు తొలి రోజు ఆటను అర్ధాంతరంగా ముగించాయి. తక్కువ వ్యవధిలో మూడు బంగ్లాదేశ్ వికెట్లు తీసి ఆధిక్యం ప్రదర్శించిన టీమిండియా వాన కారణంగా దానిని కొనసాగించలేకపోయింది.
ఆట సాగిన 35 ఓవర్లలోనే భారత బౌలర్లను ఎదుర్కోవడంలో తమ బలహీనతను ప్రదర్శించిన పర్యాటక జట్టుకు ఆట ఆగిపోవడం తెరిపినిచ్చింది. 11 బంతుల తేడాలోనే రెండు కీలక వికెట్లు తీసిన పేసర్ ఆకాశ్‌దీప్ బౌలింగ్ ఈ సంక్షిప్త ఆటలోహైలైట్‌గా నిలవగా... మ్యాచ్ రెండో రోజు కూడా వర్షసూచన ఉండటం భారత అభిమానులకు నిరాశకలిగించే విషయం.
కాన్పూర్: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్టు వాన అంతరాయాలతో మొదలైంది. వర్షం కారణంగా ఉదయం ఆట గంట ఆలస్యంగా మొదలు కాగా... చివర్లో వెలుతురు మందగించడంతో నిర్ణీత సమయం కంటే గంటన్నర ముందుగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ మొదటి రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. మోమినుల్ హక్ (40 బ్యాటింగ్; 7 ఫోర్లు), నజు్మల్ హసన్ ( 31; 6 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ప్రస్తుతం మోమినుల్‌తో పాటు ముషి్ఫకర్ (6 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు.
ఆకాశ్‌దీప్‌కు 2 వికెట్లు దక్కాయి. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని టీమిండియా గత టెస్టు తుది జట్టునే కొనసాగిస్తూ ముగ్గురు పేసర్లను ఎంచుకుంది. దాంతో కాన్పూర్ కే చెందిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు సొంతగడ్డపై టెస్టు మ్యాచ్ ఆడే అవకాశం దక్కలేదు.
రాణించిన మోమినుల్...
పరిస్థితులు పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ను జాకీర్ (0), షాద్‌మన్ జాగ్రత్తగా ప్రారంభించారు. బుమ్రా తన తొలి 3 ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వలేదు. మరీ ఇబ్బంది పడిన జాకీర్ 23 బంతుల్లో సింగిల్ కూడా తీయలేకపోయాడు. ఆపై ఆకాశ్‌దీప్ తన తొలి ఓవర్లోనే అతడిని సాగనంపి భారత్‌కు తొలి వికెట్ అందించాడు.
జైస్వాల్ పట్టిన క్యాచ్‌పై కాస్త సందేహం కనిపించినా... వరుస రీప్లేల తర్వాత అంపైర్లు జాకీర్‌ను అవుట్‌గా ప్రకటించారు. ఆ తర్వాత ఆకాశ్‌దీప్ మూడో ఓవర్ తొలి బంతికే షాద్‌మన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూ కోరిన భారత్ ఫలితం పొందింది. ఈ దశలో నజు్మల్, మోమినుల్ కలిసి జట్టుకు ఆదుకునే ప్రయత్నం చేశారు.
సిరాజ్ ఓవర్లో నజు్మల్ ఎల్బీ కోసం రివ్యూ కోరిన భారత్ ఈసారి మాత్రం ప్రతికూల ఫలితం రావడంతో ఒక రివ్యూను కోల్పోయింది. ఇద్దరు బ్యాటర్లూ కొన్ని చక్కటి షాట్లతో పరుగులు రాబట్టి సెషన్‌ను ముగించారు. లంచ్ తర్వాత తన రెండో ఓవర్లో అశ్విన్ బంగ్లాదేశ్‌ను దెబ్బ తీశాడు. చక్కటి బంతితో నజు్మల్‌ను ఎల్బీగా వెనక్కి పంపించాడు. బంగ్లా కెప్టెన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది.
నజు్మల్, మోమినుల్ మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత బౌలర్లు మరింత ఒత్తిడి పెంచారు. దాంతో మరో 6.1 ఓవర్ల పాటు మోమినుల్, ముష్ఫికర్ కొన్ని ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు అనూహ్య ముగింపుతో వారికి కాస్త ఉపశమనం లభించింది. ముందుగా వెలుతురులేమితో ఆటను నిలిపివేసిన అంపైర్లు గంట పాటు వేచి చూసి తుది నిర్ణయం తీసుకున్నారు.
స్కోరు వివరాలు
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: జాకీర్ (సి) యశస్వి జైస్వాల్ (బి) ఆకాశ్‌దీప్ 0; షాద్‌మన్ (ఎల్బీ) (బి) ఆకాశ్‌దీప్ 24; మోమినుల్ (బ్యాటింగ్) 40; నజు్మల్ (ఎల్బీ) (బి) అశ్విన్ 31; ముష్ఫికర్ రహీమ్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (35 ఓవర్లలో 3 వికెట్లకు) 107. వికెట్ల పతనం: 1–26, 2–29, 3–80. బౌలింగ్: బుమ్రా 9–4–19–0, సిరాజ్ 7–0–27–0, అశ్విన్ 9–0–22–1, ఆకాశ్‌దీప్ 10–4–34–2.
Comments
Please login to add a commentAdd a comment