రెండో రోజు ఆట రద్దు
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టుకు నేడూ వర్షం ముప్పు
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టును వరుణుడు వదిలేలా లేడు. భారీ వర్షానికి తోడు వెలుతురులేమి కారణంగా తొలి రోజు 35 ఓవర్ల ఆటే సాధ్యం కాగా... శనివారం రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయింది.
ఉదయంనుంచి భారీ వర్షం కురుస్తుండటంతో ఆట నిర్ణీత సమయానికి ప్రారంభం కాకపోగా... లంచ్ విరామ సయమంలో వరుణుడు కాస్త శాంతించాడు. దీంతో గ్రౌండ్స్‌మెన్ మైదానాన్ని సిద్ధం చేసే పనిలో పడగా... మరోసారి వర్షం ముంచెత్తింది. ఫలితంగా అంపైర్లు రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం కూడా వర్ష సూచన ఉండటం అభిమానులను కలవరపెట్టే అంశం!
కాన్పూర్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కొనసాగుతోంది. న్యూజిలాండ్, ఆ్రస్టేలియాతో సిరీస్‌లకు ముందు బంగ్లాదేశ్‌పై పూర్తి ఆధిపత్యం కనబరుస్తూ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకోవాలని భావించిన టీమిండియాను కాన్పూర్‌లో వరుణుడు అడ్డుకున్నాడు.
తొలి రోజు భారీ వర్షం కారణంగా కేవలం 35 ఓవర్ల ఆట సాధ్యం కాగా... శనివారం ఆ కాస్త కూడా తెరిపినివ్వలేదు. అసలు ఆటగాళ్లు మైదానంలోకి వచ్చే అవకాశమే లేకుండా వర్షం ముంచెత్తడంతో పలు సమీక్షల అనంతరం రెండో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. చిరుజల్లులుగా మొదలైన వర్షం ఆ తర్వాత మైదానాన్ని ముంచెత్తింది. మధ్యలో కాసేపు వరుణుడు శాంతించడంతో గ్రౌండ్స్‌మెన్ సూపర్ సాపర్‌లతో మైదానాన్ని సిద్ధం చేసే ప్రయత్నాలు ప్రారంభించగా... మరోసారి భారీ వాన దంచి కొట్టింది. దీంతో ఆట సాధ్యపడలేదు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆదివారం, సోమవారం కూడా కాన్పూర్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఇదే జరిగితే మ్యాచ్ ‘డ్రా’గా ముగియడం లాంఛనమే. తొలి రోజు ఆటలో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. కెప్టెన్ నజ్ముల్ హసన్ (31; 6 ఫోర్లు), షాద్‌మన్ ఇస్లామ్ (24; 4 ఫోర్లు), జాకీర్ హసన్ (0) ఔట్ కాగా... మోమినుల్ హక్ (81 బంతుల్లో 40 బ్యాటింగ్; 7 ఫోర్లు), ముషి్ఫకర్ రహీమ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టారు. డబ్ల్యూటీసీ 2023–25 సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన భారత్ అందులో 7 విజయాలు, 2 పరాజయాలు, ఒక ‘డ్రా’తో మొత్తం 71.67 విజయ శాతంతో ‘టాప్’లో కొనసాగుతోంది. 12 మ్యాచ్‌లాడిన ఆస్ట్రేలియా (62.50 విజయ శాతం) ఎనిమిది విజయాలతో రెండో స్థానంలో ఉంది.
బంగ్లాదేశ్‌తో సిరీస్ అనంతరం భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు, ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియాతో 5 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ రెండింట్లో కూడా ఇదే జోరు కొనసాగిస్తే... టీమిండియా వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం ఖాయమే!
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు వర్షం కారణంగా చివరకు ‘డ్రా’గా ముగిస్తే అది రోహిత్ బృందం డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరే మార్గంపై స్వల్ప ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో ఆట సాగితే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment