భారత మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు సాధించి, పలు రికార్డులు బద్దలు కొట్టింది. స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మంధన తొలి రెండు వన్డేల్లో శతక్కొట్టి, అరుదైన రికార్డులు నెలకొల్పింది.
బెంగళూరు వేదికగా జరిగిన తొలి వన్డేలో సెంచరీ (127 బంతుల్లో 117; 12 ఫోర్లు, సిక్స్) సాధించిన మంధన.. తాజాగా అదే బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ మెరుపు సెంచరీతో (120 బంతుల్లో 136; 18 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిసింది.
SMRITI MANDHANA - THE QUEEN. 👑 pic.twitter.com/jsadqWhYlr
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 19, 2024
మంధన మెరుపు శతకంతో విజృంభించడంతో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతుంది. మంధనతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (87 నాటౌట్) కూడా చెలరేగి ఆడుతుండటంతో 48 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 3 వికెట్ల నష్టానికి 302గా ఉంది. భారత ఇన్నింగ్స్‌లో మంధన, షఫాలీ వర్మ (20), దయాలన్ హేమలత (24) ఔట్ కాగా.. హర్మన్‌కు జతగా రిచా ఘెష్ (18) క్రీజ్‌లో ఉంది.
తొలి భారత క్రికెటర్‌గా రికార్డు
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేయడంతో మంధన ఖాతాలో పలు రికార్డులు చేరాయి. మహిళల వన్డే క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్‌గా మంధన రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌లో సెంచరీతో మంధన మరో రికార్డును సమం చేసింది.
భారత్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. మిథాలీ, మంధన ఇద్దరు వన్డేల్లో 7 సెంచరీలు చేశారు. మంధన 7 వన్డే సెంచరీలను కేవలం 84 ఇన్నింగ్స్‌ల్లో చేస్తే.. మిథాలీ రాజ్‌కు 7 సెంచరీలు సాధించేందుకు 211 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment