స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు మ్యాచ్ వన్డే సిరీస్‌ను భారత మహిళా క్రికెట్ జట్టు మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా ఇవాళ (జూన్ 19) జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా చివరి బంతి వరకు పోరాడి ఓడింది. లారా వోల్వార్డ్ట్, మారిజన్ కాప్ సెంచరీలతో సత్తా చాటినప్పటికీ సౌతాఫ్రికాను గెలిపించుకోలేకపోయారు.
పూజా వస్త్రాకర్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి సఫారీల విజయాన్ని అడ్డుకుంది. ఆఖరి ఓవర్‌లో సౌతాఫ్రికా గెలుపుకు 11 పరుగులు అవసరం కాగా.. వస్త్రాకర్ 2 కీలక వికెట్లు తీసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చింది.
అంతకుముందు భారత్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 325 పరుగుల స్కోర్ చేసింది. కెప్టెన్ హార్మన్‌ప్రీత్ కౌర్ (103 నాటౌట్), వైస్ కెప్టెన్ స్మృతి మంధన (136) సెంచరీలతో కదంతొక్కారు.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సౌతాఫ్రికా.. లారా వోల్వార్డ్ట్ (135 నాటౌట్), మారిజన్ కాప్ (114) శతక్కొట్టినప్పటికీ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ మ్యాచ్‌లో మెరుపు సెంచరీతో మెరిసిన మంధన ఓ వికెట్ కూడా పడగొట్టింది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ తలో 2 వికెట్లు, అరుంధతి రెడ్డి, మంధన చెరో వికెట్ పడగొట్టారు. ఈ సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే జూన్ 23న జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment