వడోదరా వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 211 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది.
సెంచరీ చేజార్చుకున్న మంధన
ఓపెనర్ స్మృతి మంధన (91) తృటిలో సెంచరీ చేజార్చుకుంది. మరో ఓపెనర్ ప్రతీక రావల్ (40), హర్లీన్ డియోల్ (44), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (34), రిచా ఘోష్ (26), జెమీమా రోడ్రిగెజ్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. విండీస్ స్పిన్నర్ జైదా జేమ్స్ ఐదు వికెట్లు తీసి సత్తా చాటింది. హేలీ మాథ్యూస్ 2, డియోండ్రా డొట్టిన్ ఓ వికెట్ పడగొట్టింది.
నిప్పులు చెరిగిన రేణుకా సింగ్.. తొలి ఐదు వికెట్ల ఘనత
315 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్.. రేణుకా సింగ్ (10-1-29-5) ధాటికి 26.2 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. రేణుకా సింగ్‌కు కెరీర్‌లో ఇది తొలి ఐదు వికెట్ల ఘనత.
భారత్ బౌలర్లలో రేణుకా సింగ్‌తో పాటు టైటాస్ సాధు (7-2-24-1), ప్రియా మిశ్రా (4.2-0-22-2), దీప్తి శర్మ (3-0-19-1) కూడా రాణించారు. విండీస్ ఇన్నింగ్స్‌లో క్యాంప్‌బెల్ (21), అఫీ ఫ్లెచర్ (24 నాటౌట్), ఆలియా ఎలెన్ (13), కరిష్మా (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.
తొలి వన్డేలో గెలుపుతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే డిసెంబర్ 24న వడోదరా వేదికగానే జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment