
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా టోర్నీ సగం మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో తొడ కండరాల గాయానికి చాహర్ గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అతడు గాయం నుంచి కోలుకోవడానికి కనీసం ఎనిమిది వారాలు పట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ సాధించేందుకు దీపక్ చాహర్ ప్రయత్నిస్తున్నాడు. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో 14 కోట్లకు దీపక్ చాహర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2021 సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన చాహర్ 14 వికెట్లు పడగొట్టాడు. ఇక చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు ఇప్పటికే సీఎస్కే కసరత్తు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక ఐపీఎల్-2022లో అమ్ముడుపోని టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మను చాహర్ స్ధానంలో భర్తీ చేసేందుకు చెన్నై మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో సీఎస్కే విజయంలో చాహర్ కీలకపాత్ర పోషించాడు. తన పేస్‌తో పవర్ ప్లేలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టేవాడు. ఇక చాహర్ పేస్ బౌలింగ్ బాధ్యతలను ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, డ్వైన్ ప్రిటోరియస్, డ్వేన్ బ్రావోలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment