క్రికెట్ అంటే జెంటిల్‌మెన్ గేమ్‌కు పెట్టింది పేరు. పుట్టినప్పుడే ఎవరు పైకి రారు.. జీవితంలో ఎన్నో కష్టాలనుభవించిన క్రికెటర్లు ఉన్నారు.. చావును జయించిన క్రికెటర్లు ఉన్నారు. వారి జీవితాలు అందరికి ఆదర్శంగా నిలుస్తాయి. మనకు తెలిసిన క్రికెటర్లలో యువరాజ్ సింగ్, మైకెల్ క్లార్క్, మాథ్యూ వేడ్ వంటివారు ఏదో ఒక దశలో క్యాన్సర్‌ను జయించినవారే. ఇక క్రికెట్‌ను ఆరాధించే భారత్ లాంటి దేశాల్లో ఇలాంటి కథలు కోకొల్లలు. తాజాగా అలాంటి మహమ్మారిని 14 ఏళ్ల వయసులోనే జయించి క్రికెట్‌లో అడుగుపెట్టాడు. రంజీల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతనే ఉత్తరాఖండ్‌కు చెందిన రంజీ క్రికెటర్ కమల్ సింగ్.
21 ఏళ్ల కమల్ సింగ్ గతేడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ తరపున అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేసిన డెబ్యూ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే శతకంతో అదరగొట్టాడు. అంతేకాదు 2020-21 విజయ్ హజారే ట్రోపీలో కమల్ సింగ్ ఉత్తరాఖండ్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు సమా తొమ్మిది లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సీజన్‌లో ఉత్తరాఖండ్ క్వార్టర్స్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. ముంబై చేతిలో 725 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసిన ఉత్తరాఖండ్ రంజీ చరిత్రలోనే అతి పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కమల్ సింగ్ డకౌట్ అయ్యాడు.
అలా డకౌట్‌తో రంజీ సీజన్‌ను ముగించిన కమల్ సింగ్.. నిజ జీవితంలోనూ క్యాన్సర్ మహమ్మారికి డకౌట్ కావాల్సి వచ్చింది. కమల్ సింగ్ 14 ఏళ్ల వయసులో స్టేజ్ 2 క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలియగానే కుంగిపోకుండా క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని.. క్యాన్సర్ మహమ్మారిని జయించి తిరిగి వస్తా అంటూ పేర్కొన్నాడు. 2014 సంవత్సరంలో కమల్ సింగ్ తన కెరీర్, చదువును పక్కనబెట్టి క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాడు. వీలైనంత తొందరగా క్యాన్సర్‌ను నయం చేయాలని తాను కలిసిన డాక్టర్లకు తెలిపాడు. అందుకు సంబంధించిన ఖర్చులను తండ్రి చూసుకున్నాడు.
కొడుకు అంత ధైర్యంగా ఉంటే తాను ఎందుకు బాధపడాలని అనుకున్న తండ్రి.. ఎంత కష్టమైన సరే కొడుకును కాపాడుకుంటా అని పేర్కొనేవాడు. కాగా స్టేజ్-2 క్యాన్సర్ కారణంగా కమల్‌కు ప్లేట్‌లెట్స్ కౌంట్ చాలా తక్కువగా ఉండేది. ఒక సందర్భంలో ప్లేట్‌లెట్స్ దొరకకపోవడంతో దాదాపు 700 కిమీ దూరం ప్రయాణించి ప్లేట్‌లెట్స్ తెచ్చామంటూ కమల్ తండ్రి పేర్కొన్నాడు. దాదాపు ఆరు నెలల పాటు కీమోథెరపీ సహా ఇతర చికిత్సలు తీసుకున్న కమల్ సింగ్ చిట్టచివరకు క్యాన్సర్‌ను జయించాడు. కమల్ సింగ్ ఇటీవలే ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ''ముందే చెప్పానుగా క్యాన్సర్‌ను జయిస్తానని.. ఎందుకుంటే నేను క్రికెట్ ఆడాలి'' అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నాడు.
చదవండి: ENG vs NZ 2nd Test: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్..
Ranji Trophy 2022: మరో శతకం దిశగా దూసుకెళ్తున్న బెంగాల్ క్రీడా మంత్రి
Comments
Please login to add a commentAdd a comment