Ranji cricketer
-
మాజీ రంజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అరెస్ట్
చీటింగ్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ ప్లేయర్ నాగరాజు బుడుమూరు అరెస్టయ్యాడు. ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారికి ఫోన్ చేసి వర్ధమాన క్రికెటర్, ఆంధ్రప్రదేశ్ రంజీ ఆటగాడు రికీ భుయ్‌కు రూ.12 లక్షల స్పాన్సర్షిప్ కావాలని కోరిన కేసులో నాగరాజును ముంబై సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడినంటూ వ్యాపారిని బురిడీ కొట్టించిన నాగరాజు.. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ), ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ), రికీ భుయ్ల పేర్లు వాడుకుని సొమ్మును కాజేశాడు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన నాగరాజు.. గతంలో ఓ రాజకీయ నాయకుడు చేసిన మోసం వల్ల తాను ఈ తరహా మోసాలకు అలవాటు పడినట్లు తెలిపాడు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన 28 ఏళ్ల నాగరాజు.. 2021లో తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ వ్యక్తిగత కార్యదర్శినంటూ పలు కార్పొరేట్ కంపెనీలను రూ. 40 లక్షలు వరకు మోసగించినందుకు అరెస్టయ్యాడు. నాగరాజు 2018 నుంచి ఇప్పటి వరకు స్పాన్సర్షిప్ పేరిట ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని 60కిపైగా కంపెనీలను రూ.3 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఎంబీఏ చదువుకున్న నాగరాజు 2014-2016 మధ్యలో ఆంధ్రప్రదేశ్ జట్టుకు (రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో), 2016-2018 మధ్యలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఇండియా-బి జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. నాగరాజు.. 2016లో క్రికెట్‌కు సంబంధించి గిన్నిస్ రికార్డుకు కూడా ప్రయత్నించాడు. సుదీర్ఘ సమయం నెట్ సెషన్లో పాల్గొన్న బ్యాటర్ విభాగంలో నాగరాజు గిన్నిస్ రికార్డుల్లోకెక్కేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. -
గుజరాత్ మాజీ వికెట్ కీపర్ కన్ను మూత..
సౌరాష్ట్ర, గుజరాత్ మాజీ వికెట్ కీపర్ జస్వంత్ బక్రానియా(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడాదృవీకరించింది. 'జస్వంత్ భాయ్ మృతి పట్ల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తుంది. అతని ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాము" అని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. 1970 నుంచి 1983 మధ్య బక్రానియా సౌరాష్ట్ర, గుజరాత్ తరపున 56 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. అతని కెరీర్లో 3137 పరుగులతో పాటు ఐదు సెంచరీలు కూడా సాధించారు. అదే విధంగా కూడా 51 క్యాచ్‌లు, 12 స్టంఫౌట్లు కూడా తన కెరీర్లో ఉన్నాయి. చదవండి: Shahid Afridi: 'కోహ్లి రిటైర్మెంట్కు ఇదే సరైన సమయం'.. మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
'14 ఏళ్ల వయసులో క్యాన్సర్‌ను జయించి.. అరంగేట్రంలోనే సెంచరీతో'
క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్‌కు పెట్టింది పేరు. పుట్టినప్పుడే ఎవరు పైకి రారు.. జీవితంలో ఎన్నో కష్టాలనుభవించిన క్రికెటర్లు ఉన్నారు.. చావును జయించిన క్రికెటర్లు ఉన్నారు. వారి జీవితాలు అందరికి ఆదర్శంగా నిలుస్తాయి. మనకు తెలిసిన క్రికెటర్లలో యువరాజ్ సింగ్, మైకెల్ క్లార్క్, మాథ్యూ వేడ్ వంటివారు ఏదో ఒక దశలో క్యాన్సర్‌ను జయించినవారే. ఇక క్రికెట్‌ను ఆరాధించే భారత్ లాంటి దేశాల్లో ఇలాంటి కథలు కోకొల్లలు. తాజాగా అలాంటి మహమ్మారిని 14 ఏళ్ల వయసులోనే జయించి క్రికెట్లో అడుగుపెట్టాడు. రంజీల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతనే ఉత్తరాఖండ్‌కు చెందిన రంజీ క్రికెటర్ కమల్ సింగ్. 21 ఏళ్ల కమల్ సింగ్ గతేడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ తరపున అరంగేట్రం చేశాడు. అరంగేట్రం చేసిన డెబ్యూ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లోనే శతకంతో అదరగొట్టాడు. అంతేకాదు 2020-21 విజయ్ హజారే ట్రోపీలో కమల్ సింగ్ ఉత్తరాఖండ్ తరపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు సమా తొమ్మిది లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సీజన్లో ఉత్తరాఖండ్ క్వార్టర్స్‌కే పరిమితమైన సంగతి తెలిసిందే. ముంబై చేతిలో 725 పరుగుల భారీ తేడాతో ఓటమి చవిచూసిన ఉత్తరాఖండ్ రంజీ చరిత్రలోనే అతి పెద్ద ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో కమల్ సింగ్ డకౌట్ అయ్యాడు. అలా డకౌట్‌తో రంజీ సీజన్‌ను ముగించిన కమల్ సింగ్.. నిజ జీవితంలోనూ క్యాన్సర్ మహమ్మారికి డకౌట్ కావాల్సి వచ్చింది. కమల్ సింగ్ 14 ఏళ్ల వయసులో స్టేజ్ 2 క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలియగానే కుంగిపోకుండా క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని.. క్యాన్సర్ మహమ్మారిని జయించి తిరిగి వస్తా అంటూ పేర్కొన్నాడు. 2014 సంవత్సరంలో కమల్ సింగ్ తన కెరీర్, చదువును పక్కనబెట్టి క్యాన్సర్‌కు చికిత్స తీసుకున్నాడు. వీలైనంత తొందరగా క్యాన్సర్‌ను నయం చేయాలని తాను కలిసిన డాక్టర్లకు తెలిపాడు. అందుకు సంబంధించిన ఖర్చులను తండ్రి చూసుకున్నాడు. కొడుకు అంత ధైర్యంగా ఉంటే తాను ఎందుకు బాధపడాలని అనుకున్న తండ్రి.. ఎంత కష్టమైన సరే కొడుకును కాపాడుకుంటా అని పేర్కొనేవాడు. కాగా స్టేజ్-2 క్యాన్సర్ కారణంగా కమల్‌కు ప్లేట్లెట్స్ కౌంట్ చాలా తక్కువగా ఉండేది. ఒక సందర్భంలో ప్లేట్లెట్స్ దొరకకపోవడంతో దాదాపు 700 కిమీ దూరం ప్రయాణించి ప్లేట్లెట్స్ తెచ్చామంటూ కమల్ తండ్రి పేర్కొన్నాడు. దాదాపు ఆరు నెలల పాటు కీమోథెరపీ సహా ఇతర చికిత్సలు తీసుకున్న కమల్ సింగ్ చిట్టచివరకు క్యాన్సర్‌ను జయించాడు. కమల్ సింగ్ ఇటీవలే ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. ''ముందే చెప్పానుగా క్యాన్సర్‌ను జయిస్తానని.. ఎందుకుంటే నేను క్రికెట్ ఆడాలి'' అని ఆత్మవిశ్వాసంతో పేర్కొన్నాడు. చదవండి: ENG vs NZ 2nd Test: విజయానందంలో ఉన్న ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్.. Ranji Trophy 2022: మరో శతకం దిశగా దూసుకెళ్తున్న బెంగాల్ క్రీడా మంత్రి -
దీనస్థితిలో అక్కడి రంజీ ఆటగాళ్లు .. రోజూవారి వేతనం తెలిస్తే షాకే!
రంజీ ట్రోపీ 2022లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముంబై జట్టు ఉత్తరాఖండ్‌పై 725 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఫస్ట్‌క్లాస్ చరిత్రలోనే ఉత్తరాఖండ్‌కు ఇది అతిపెద్ద ఓటమిగా నిలిచిపోయింది. ఈ ఓటమి ఉత్తరాఖండ్ జట్టును ఎంతలా బాధపెట్టిందో తెలియదు కానీ.. తాజాగా ఆ జట్టు ఆటగాళ్లకు ఇస్తున్న రోజువారీ వేతనం విషయంలో కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గత 12 నెలలుగా ఉత్తరాఖండ్ రంజీ జట్టులో ఆటగాళ్లు అందుకుంటున్న రోజువారీ వేతనం ఎంతో తెలుసా.. కేవలం వంద రూపాయలు మాత్రమే. ఒక రంజీ ఆటగాడికి ఇచ్చే రోజువారీ వేతనంలో ఇది ఎనిమిదో వంతు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో. ఒక న్యూస్ చానెల్ ఇచ్చిన నివేదిక ద్వారా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. ఒక రంజీ క్రికెటర్‌కు రోజువారీ వేతనంలో ఒక క్రికెటర్‌కు రూ. 1000-1500 నుంచి అందుకుంటారు. అదే ఒక సీనియర్ క్రికెటర్‌కు రూ. 2వేల వరకు పొందుతారు. కానీ ఈ నిబంధనలను గాలికొదిలేసిన ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ గత 12 నెలలుగా సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా కేవలం వంద రూపాయాలను మాత్రమే రోజూవారీ వేతనంగా ఇస్తుండడం శోచనీయం. అయితే ఇటీవలే 'టోర్నమెంట్ అండ్ ట్రయల్ క్యాంప్ ఎక్స్పెన్సెస్' పేరిట తయారు చేసిన ఆడిట్ రిపోర్టులో మాత్రం సదరు క్రికెట్ అసోసియేషన్ ఘనంగానే లెక్కలు చూపించింది. ఆటగాళ్ల జీతభత్యాలు, ఇతరత్రా ఖర్చులతో కలిపి రూ.1,74,07,346 ఖర్చు చేస్తున్నట్లు చూపించింది. ఇందులో రూ.49,58,750లను ఆటగాళ్లకిస్తున్న రోజువారీ వేతనం కింద లెక్క చూపించింది. అంతేగాక మరో 35 లక్షలతో ఆటగాళ్లకు అరటిపండ్లు, రూ.22 లక్షలతో వాటర్ బాటిల్స్ అందిస్తున్నట్లుగా రిపోర్ట్‌లో చూపించింది. అయితే ఆటగాళ్లకు ఆ సౌకర్యాలేవీ అందట్లేదు. సరికదా.. డబ్బులు లేవనే సాకుతో కేవలం వంద రూపాయలనే రోజువారీ వేతనంగా ఇస్తున్నారు. ఇదే విషయమై ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక సీనియర్ క్రికెటర్, క్రికెట్ అసోసియేషన్‌ను..'పెండింగ్ బిల్లులను ఎప్పుడు చెల్లిస్తారు'అంటూ నిలదీశాడు. దానికి సదరు అధికారి ‘అరె.. ఇదే ప్రశ్న ఎన్నిసార్లు అడుగుతావయ్యా?.. మీ డబ్బులు మీకు వచ్చేవరకు ఏ స్విగ్గీ, జొమాటోలోనే ఆర్డర్ చేసుకోండి’ అంటూ పెడసరిగా సమాధానం ఇచ్చాడు.అంతేకాదు ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అధికారులు ఆటగాళ్లను మానసికంగానూ ఒత్తిడికి గురిచేస్తున్నట్లు సదరు కథనం ద్వారా వెలుగు చూసింది. మరి ఇప్పటికైనా బీసీసీఐ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ట్విటర్లో పలువురు అభిప్రాయపడుతున్నారు. చదవండి: తెగ బాధపడిపోతున్నాడు.. ఎవరీ క్రికెటర్? రంజీలో సెంచరీ బాదిన క్రీడా మంత్రి.. సెమీఫైనల్‌కు బెంగాల్ The BCCI has now modified the minimum incremental bid amount to 1cr. — Mufaddal Vohra (@mufaddal_vohra) June 10, 2022 BCCI is considered to be richest cricket board with millions of dollars involved in IPL. However the other side of indian cricket is shocking. Uttarakhand is a firstclass team of Ranji Trophy and it's professional cricketers get 100 INR (250 PKR) per day allowance. Sad affairs!! — Ameeq Ur Rehman (@ameequrrahman) June 10, 2022 -
అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం.. రంజీ క్రికెటర్‌పై చీటింగ్ కేసు
ఛత్తీస్గడ్ రంజీ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న హర్‌ప్రీత్ సింగ్ భాటియాపై ఆ రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నకిలీ ధృవపత్రాలతో అతడు అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాడనే ఆరోపణలతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని బలోద్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్ ప్రస్తుతం ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఆడిటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 2014లో భాటియా ఆకట్టుకునే ప్రదర్శనతో రంజీ జట్టులో రాణించి తద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. అయితే ఆ క్రమంలో తనకు డిగ్రీ ఉన్నదని, అందుకు సంబంధించిన మార్కుల మెమో, ఇతర ధ్రువపత్రాలను సమర్పించాడు. తాను బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ (ఝాన్సీ, మధ్యప్రదేశ్) లో బీకామ్ డిగ్రీ చదివానని, అందుకు సంబంధించిన మార్కుల షీట్ ను కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందేప్పుడు జతపరిచాడు. అయితే ప్రభుత్వ అధికారులు.. అతడి డిగ్రీ పై అనుమానాలు వచ్చి బుందేల్‌ఖండ్ యూనివర్సిటీని సంప్రదించగా అసలు బండారం బయటపడింది. భాటియా ఆ వర్సిటీలో చదవనేలేదని తేలింది. దీంతో నకిలీ పత్రాలను సమర్పించినందుకు గాను భాటియాపై ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 467 (ఫోర్జరీ) ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తయ్యాక నేరం రుజువైతే అతడు ఉద్యోగాన్ని కోల్పోవడమే గాక జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది. భారత్ తరఫున 2010లో అండర్-19 ప్రపంచకప్ ఆడిన భాటియా.. అదే ఏడాది కేకేఆర్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. 2011 లో పూణే వారియర్స్ లో, 2017లో విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ పెద్దగా రాణించలేదు. ఇక ఈ ఏడాది రంజీ సీజన్ లో ఛత్తీస్గడ్ లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది. చదవండి: ఇలాంటి బౌలింగ్ అరుదు.. దిగ్గజ ఆటగాడు గుర్తురావడం పక్కా! -
హైదరాబాద్: భారత జట్టు మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేత
సాక్షి, హైదరాబాద్: తుకారాంగేట్ పరిధి(సికింద్రాబాద్)లో మహిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు మహిళల రంజీ జట్టు క్రికెటర్ భోగి శ్రావణి ఇల్లును కూల్చివేశారు. కాగా, ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని గతంలో ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే తాము ఇంటికి మరమ్మత్తులు చేసినట్టు తెలిపారు. అదేమీ పట్టించుకోకుండా జీహెచ్ఎంసీ అధికారులు ఈరోజు.. తమ ఇంటికి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే మహిళల టీ20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉందన్న శ్రావణి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ఆడాలా..? లేక ఇంటి కోసం పోరాడాలా..? అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, శ్రావణి ఇండియా తరఫున మ్యాచ్‌లను ఆడుతోంది. -
కేటీఆర్ పీఏనంటూ మోసాలు.. నాగరాజుపై పీడీ యాక్ట్
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పీఏనని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డ మాజీ రంజీ క్రికెటర్ నాగరాజుపై బంజారాహిల్స్ పోలీసులు శుక్రవారం పీడీ యాక్ట్ నమోదు చేశారు. మంత్రి కేటీఆర్ పేరు చెప్పి నాగరాజు నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వసూళ్లకు పాల్పడ్డాడు. పలువురు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని పీడీ యాక్ట్ నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన నాగరాజు గతంలో ఆంధ్రప్రదేశ్ రంజీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2014– 16 మధ్య ఏపీ రంజీ జట్టుకు ఎంపికైన బుడుమూరు నాగరాజు.. గతంలోనూ అనేక మంది ప్రముఖుల పేర్లు చెప్పుకొని మోసాలకు పాల్పడ్డాడు. బీసీసీఐ మాజీ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌గా పలువురికి ఫోన్లు చేసి వసూళ్లకు పాల్పడ్డాడు. కాగా, గతేడాది ఫిబ్రవరిలో కేటీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడంటూ నాగరాజు పలు మోసాలకు పాల్పడ్డాడు. దాదాపు తొమ్మిది కార్పొరేట్ కంపెనీల నుంచి భారీగా దండుకున్నాడు. ఈ ఘరానా నేరగాడు నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. గతేడాది నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి రూ.3.3 లక్షలు వసూలు చేసి.. మరో రూ.2 లక్షలు దండుకోవడానికి స్కెచ్ వేసి సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఇటీవల ఓ ఫార్మా కంపెనీకి ఫోన్ చేసిన కేటీఆర్ పేరు చెప్పి రూ.15 లక్షలు వసూలు చేయడానికి ప్రయత్నించాడు. దీనిపై జూబ్లీహిల్స్ ఠాణాలో కేసు నమోదైంది. ఇలా నాగరాజు నేరాల చిట్టా చాంతాండంత ఉంది. ఇతనిపై బంజారాహిల్స్, ఓయూ, సనత్‌నగర్, మాదాపూర్, బాచుపల్లి, కూకట్పల్లి పోలీస్స్టేషన్లతోపాటు విశాఖపట్నం, నెల్లూరు, మాచవరం, గుంటూరు, న్యూఢిల్లీలలో కేసులు నమోదై ఉన్నాయి. చదవండి: Wrestler Sushil Kumar: తీహార్ జైలుకు తరలింపు.. -
రంజీ క్రికెటర్ నకిలీ ఆటలు
నెల్లూరు (క్రైమ్): రంజీ క్రికెటర్ జల్సాలకు, వ్యసనాలకు బానిసై మోసాలబాట పట్టాడు. ప్రముఖులు, మంత్రుల పీఏల పేరుతో రాష్ట్రంలోని పలు కార్పొరేట్ సంస్థల నిర్వాహకులకు ఫోన్లు చేసి డబ్బులు వసూళ్లుకు పాల్పడి పలుసార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్) పేరు చెప్పి ఓ కార్పొరేట్ హాస్పిటల్‌ను మోసగించబోయి పోలీసులకు చిక్కాడు. నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్లో మంగళవారం రూరల్ డీఎస్పీ కె.వి.రాఘవరెడ్డి నిందితుని వివరాలను విలేకరులకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు కుటుంబం విశాఖపట్నంలోని మధురవాడలో స్థిరపడ్డారు. ఎంబీఏ వరకు చదివిన నాగరాజు 2014–16 కాలంలో రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉండేవాడు. స్పాన్సర్ల నుంచి అధిక మొత్తంలో నగదు రావడంతో మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. అనంతరం నాగరాజుకు క్రికెట్ మ్యాచ్‌ల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోయాడు. ఈజీగా మనీ సంపాదించేందుకు మార్గాలు వెతికాడు. మంత్రుల పీఏలు, ప్రముఖుల పీఏలు, రాష్ట్ర అధికారుల పర్సనల్ సెక్రటరీగా పలు కార్పొరేట్ సంస్థలకు తానే ఫోను చేసేవాడు. రంజీ ప్లేయర్ నాగరాజుకు రూ.3 లక్షలు స్పాన్సర్ చేయాలనీ, భవిష్యత్‌లో అతని వల్ల మీకు ఉపయోగం ఉంటుందనీ, మీ సంస్థ లోగోను అతని బ్యాట్‌పై వేసుకుని ప్రచారం కల్పిస్తాడని నమ్మించేవాడు. ఇలా ఇప్పటికే పలువుర్ని మోసగించాడు. ఈనెల 23న నెల్లూరులోని సింహపురి ఆస్పత్రి నిర్వాహకులకు సీఎం పీఏ కేఎన్ఆర్ పేరిట ఫోను చేశాడు. క్రికెట్ ప్లేయర్ నాగరాజుకు రూ.3 లక్షలు స్పాన్సర్ చేయాలనీ, ఏడాదిపాటు అతను ఆడే బ్యాట్‌పై హాస్పిటల్ లోగోను ముద్రించి ప్రచారం చేస్తాడని సూచించాడు. దీనిపై అనుమానం రావడంతో ఆస్పత్రి ఎండీ రవీంద్రరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు సోమవారం రాత్రి నగదు తీసుకునేందుకు సింహపురి హాస్పిటల్ వద్దకు వస్తుండగా ఎస్ఐ సాంబశివరావు అతన్ని అరెస్ట్ చేశారు. -
సీఎం సెక్రటరీనంటూ మాజీ క్రికెటర్ డబ్బులు డిమాండ్
నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ పేరుతో మాజీ క్రికెటర్ నెల్లూరులోని కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంజీ స్థాయిలో ఆడిన మాజీ క్రికెటర్ నాగరాజు సీఎం పేరు చెప్పి రూ.3.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనపై ఇప్పటికే ఆరు కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారి గ్రామానికి చెందిన బుడమూరు నాగరాజు 2014లో నాన్‌స్టాప్‌గా 82 గంటల పాటు క్రికెట్ ఆడి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. ఆతర్వాత విలాసవంత జీవితానికి అలవాటు పడి ప్రముఖల పేర్లను ఉపయోగించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే నెల్లూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. -
సీఎం పీఏ పేరుతో మోసానికి యత్నం
పట్నంబజారు (గుంటూరు): జల్సాలకు అలవాటుపడ్డ ఓ రంజీ క్రికెట్ ఆటగాడు.. నకిలీ ‘ఆటలు’ ఆడబోయి అడ్డంగా బుక్కయ్యాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్ఆర్) పేరు చెప్పి ఓ సెల్‌ఫోన్ విక్రయ కంపెనీని మోసం చేయబోయి పోలీసులకు చిక్కాడు. గుంటూరు వెస్ట్ సబ్‌డివిజన్ ఆఫీసర్ జె.కులశేఖర్, అరండల్‌పేట ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు రంజీ క్రికెట్ ప్లేయర్. ఇటీవల నిందితుడు సీఎం వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి పేరుతో గుంటూరు బ్రాడీపేటలోని హ్యాపీ మొబైల్స్ సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేసి.. నాగరాజు అనే రంజీ క్రికెటర్ వస్తాడని, అతనికి రూ. 3 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అయితే కేఎన్‌ఆర్‌తో పరిచయం ఉన్న వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి అడగటంతో తాను ఎవరినీ పంపలేదని స్పష్టం చేశారు. దీంతో గుంటూరు హ్యాపీ మొబైల్స్ మేనేజర్ కందుల సతీష్ ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టి చివరికి హైదరాబాద్‌లో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే నాగరాజుపై విశాఖపట్నం, విజయవాడతో పాటు తెలంగాణలో సైతం మరో నాలుగు కేసులు నమోదైనట్లు తేలింది. గతంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు వాడుకుని డబ్బులు దండుకున్న ఘటనల్లో నాగరాజు అరెస్టు అయినట్లు వెల్లడైంది. -
రంజీ క్రికెటర్‌ను మోసగించిన కోడెల కుమారుడు
సాక్షి, గుంటూరు: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు కోడెల శివరామ్ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక క్రీడాకారుడి వద్ద శివరామ్ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేసిన వైనం తాజాగా వెలుగుచూసింది. బాధితుడైన ఆంధ్రా రంజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు శుక్రవారం గుంటూరు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన అప్పలస్వామి కుమారుడు నాగరాజు ఆంధ్రా రంజీ జట్టు తరఫున గత ఐదేళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడు. రెండేళ్ల కిందట విజయవాడకు చెందిన భరత్‌చంద్ర ద్వారా నాగరాజుకు కోడెల శివరామ్ పరిచయమయ్యాడు. ఆ సమయంలో తనకు రైల్వే ఉద్యోగంపై మక్కువ ఉందని కోడెల శివరామ్‌కు చెప్పాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న శివరామ్ స్పోర్ట్స్ కోటాలో రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్పీ) ఉద్యోగం ఇప్పిస్తానని రూ.15 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో గతేడాది ఫిబ్రవరి 27న నరసరావుపేటలోని కోడెల నివాసానికెళ్లి రూ.15 లక్షలను నాగరాజు ఇచ్చాడు. అప్పుడు డబ్బు తీసుకున్నట్టు ఓ బాండ్, ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాలని శివరామ్ చెప్పాడు. అతడు చెప్పినట్టే నాగరాజు ఉద్యోగ నియామక పత్రాలు తీసుకుని మరుసటి రోజు కాన్పూర్ వెళ్లాడు. అక్కడ కోడెల శివరామ్‌కు చెందిన ఓ వ్యక్తి నాగరాజును కలిసి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీ చేసేటప్పుడు కబురు చేస్తామని నమ్మబలికాడు. దీంతో నాగరాజు తిరిగొచ్చేశాడు. మే 23 తర్వాత అసలు విషయం తెలుసుకుని.. మే 23న ఎన్నికల ఫలితాల అనంతరం కోడెల కుటుంబం అక్రమంగా వసూళ్లు చేసిన కేట్యాక్స్, ఉద్యోగాలిస్తామని మోసగించిన సంఘటనలపై వరుసగా నమోదవుతున్న కేసుల విషయం తెలుసుకుని తాను కూడా మోసపోయానని నాగరాజు నిర్ధారించుకున్నాడు. కోడెల శివప్రసాదరావుకు ఫోన్లో జరిగిన విషయాన్ని వివరించగా డబ్బులు తిరిగి ఇప్పిస్తానని ఆయన చెప్పడంతో ఈ నెల 2న నాగరాజు నరసరావుపేటలోని కోడెల నివాసానికి వెళ్లాడు. అయితే.. నాగరాజును బెదిరించి కోడెల అనుచరులు బాండ్ పేపరును చించేశారు. దీంతో తాను పోలీసులను ఆశ్రయిస్తానని నాగరాజు హెచ్చరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే విషయం బయటకు తెలుస్తుందని, శుక్రవారం డబ్బు ఇస్తానని నరసరావుపేట రావాలని కోడెల పిలిపించాడు. అక్కడ నాగరాజు చాలాసేపు వేచి చూశాక గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి దగ్గరకు వెళితే డబ్బులు ఇస్తారని అక్కడకు పంపారు. గుంటూరుకు వచ్చి కోడెలకు పలుమార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ ఎస్పీకి నాగరాజు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని కోరాడు. చదవండి: కోడెలపై లారీ ఓనర్ల ఫైర్..! ‘కోడెల ట్యాక్స్ పుట్ట బద్దలవుతోంది’ ‘కే’ ట్యాక్స్ బాధితుల క్యూ అజ్ఞాతంలో కోడెల కుమారుడు, కుమార్తె ‘కే ట్యాక్స్’పై ఐదు కేసులు కోడెల తనయుడు శివరామ్‌పై కేసు నమోదు కోడెల పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేకపోయాడు -
ఎసెక్స్ లీగ్‌కు విహారి
హటన్ సీసీ జట్టుకు ప్రాతినిధ్యం సాక్షి, హైదరాబాద్: రంజీ క్రికెటర్ గాదె హనుమ విహారి తొలి సారి ఇంగ్లండ్ కౌంటీ లీగ్‌లలో ఆడనున్నాడు. ఎసెక్స్ కౌంటీ పరిధిలోని హటన్ క్రికెట్ క్లబ్‌కు అతను ప్రాతినిధ్యం వహిస్తాడు. మొత్తం 18 వారాల పాటు అతను ఈ లీగ్‌లలో పాల్గొంటాడు. ఇందులో భాగంగా ఫస్ట్ డివిజన్ స్థాయి గల 18 వన్డేల్లో విహారికి ఆడే అవకాశం దక్కుతుంది. ఇంగ్లండ్‌లోని స్వింగ్, సీమ్ వికెట్లపై మ్యాచ్‌లు ఆడటం ద్వారా మంచి అనుభవం దక్కుతుందని, ఇది భవిష్యత్తులో తన కెరీర్‌కు ఉపయోగపడుతుందని విహారి విశ్వాసం వ్యక్తం చేశాడు. శనివారం అతను ఇంగ్లండ్ బయల్దేరి వెళతాడు. 20 ఏళ్ల విహారి... 23 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 51.09 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 19 దేశవాళీ వన్డేల్లో 36.80 సగటుతో 552 పరుగులు సాధించాడు.