వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కులశేఖర్, ఎస్‌హెచ్‌వో శ్రీనివాసరావు, చిత్రంలో ముసుగువేసి ఉన్న వ్యక్తి నిందితుడు నాగరాజు
పట్నంబజారు (గుంటూరు): జల్సాలకు అలవాటుపడ్డ ఓ రంజీ క్రికెట్ ఆటగాడు.. నకిలీ ‘ఆటలు’ ఆడబోయి అడ్డంగా బుక్కయ్యాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్) పేరు చెప్పి ఓ సెల్‌ఫోన్ విక్రయ కంపెనీని మోసం చేయబోయి పోలీసులకు చిక్కాడు. గుంటూరు వెస్ట్ సబ్‌డివిజన్ ఆఫీసర్ జె.కులశేఖర్, అరండల్‌పేట ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు రంజీ క్రికెట్ ప్లేయర్.
ఇటీవల నిందితుడు సీఎం వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వరరెడ్డి పేరుతో గుంటూరు బ్రాడీపేటలోని హ్యాపీ మొబైల్స్ సంస్థ నిర్వాహకులకు ఫోన్ చేసి.. నాగరాజు అనే రంజీ క్రికెటర్ వస్తాడని, అతనికి రూ. 3 లక్షలు ఇవ్వాలని చెప్పాడు. అయితే కేఎన్‌ఆర్‌తో పరిచయం ఉన్న వ్యక్తులు ఆయనకు ఫోన్ చేసి అడగటంతో తాను ఎవరినీ పంపలేదని స్పష్టం చేశారు. దీంతో గుంటూరు హ్యాపీ మొబైల్స్ మేనేజర్ కందుల సతీష్ ఈ నెల 11న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దృష్టి సారించిన పోలీసులు పలు ప్రాంతాల్లో గాలింపు చేపట్టి చివరికి హైదరాబాద్‌లో నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే నాగరాజుపై విశాఖపట్నం, విజయవాడతో పాటు తెలంగాణలో సైతం మరో నాలుగు కేసులు నమోదైనట్లు తేలింది. గతంలో భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు పలువురు ప్రముఖుల పేర్లు వాడుకుని డబ్బులు దండుకున్న ఘటనల్లో నాగరాజు అరెస్టు అయినట్లు వెల్లడైంది.
Comments
Please login to add a commentAdd a comment