రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు | Ranji cricketer fake games | Sakshi
Sakshi News home page

రంజీ క్రికెటర్‌ నకిలీ ఆటలు

Published Wed, Jul 31 2019 3:52 AM | Last Updated on Wed, Jul 31 2019 5:03 AM

Ranji cricketer fake games - Sakshi

వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ, వెనుకవరుసలో నిందితుడు

నెల్లూరు (క్రైమ్‌): రంజీ క్రికెటర్‌ జల్సాలకు, వ్యసనాలకు బానిసై మోసాలబాట పట్టాడు. ప్రముఖులు, మంత్రుల పీఏల పేరుతో రాష్ట్రంలోని పలు కార్పొరేట్‌ సంస్థల నిర్వాహకులకు ఫోన్లు చేసి డబ్బులు వసూళ్లుకు పాల్పడి పలుసార్లు పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పీఏ కె.నాగేశ్వరరెడ్డి (కేఎన్‌ఆర్‌) పేరు చెప్పి ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌ను మోసగించబోయి పోలీసులకు చిక్కాడు. నెల్లూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో మంగళవారం రూరల్‌ డీఎస్పీ కె.వి.రాఘవరెడ్డి నిందితుని వివరాలను విలేకరులకు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు కుటుంబం విశాఖపట్నంలోని మధురవాడలో స్థిరపడ్డారు. ఎంబీఏ వరకు చదివిన నాగరాజు 2014–16 కాలంలో రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా ఉండేవాడు. స్పాన్సర్ల నుంచి అధిక మొత్తంలో నగదు రావడంతో మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు బానిసయ్యాడు. అనంతరం నాగరాజుకు క్రికెట్‌ మ్యాచ్‌ల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో ఆర్థికంగా చితికిపోయాడు.

ఈజీగా మనీ సంపాదించేందుకు మార్గాలు వెతికాడు. మంత్రుల పీఏలు, ప్రముఖుల పీఏలు, రాష్ట్ర అధికారుల పర్సనల్‌ సెక్రటరీగా పలు కార్పొరేట్‌ సంస్థలకు తానే ఫోను చేసేవాడు. రంజీ ప్లేయర్‌ నాగరాజుకు రూ.3 లక్షలు స్పాన్సర్‌ చేయాలనీ, భవిష్యత్‌లో అతని వల్ల మీకు ఉపయోగం ఉంటుందనీ, మీ సంస్థ లోగోను అతని బ్యాట్‌పై వేసుకుని ప్రచారం కల్పిస్తాడని నమ్మించేవాడు. ఇలా ఇప్పటికే పలువుర్ని మోసగించాడు. ఈనెల 23న నెల్లూరులోని సింహపురి ఆస్పత్రి నిర్వాహకులకు సీఎం పీఏ కేఎన్‌ఆర్‌ పేరిట ఫోను చేశాడు. క్రికెట్‌ ప్లేయర్‌ నాగరాజుకు రూ.3 లక్షలు స్పాన్సర్‌ చేయాలనీ, ఏడాదిపాటు అతను ఆడే బ్యాట్‌పై హాస్పిటల్‌ లోగోను ముద్రించి ప్రచారం చేస్తాడని సూచించాడు. దీనిపై అనుమానం రావడంతో ఆస్పత్రి ఎండీ రవీంద్రరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగరాజు సోమవారం రాత్రి నగదు తీసుకునేందుకు సింహపురి హాస్పిటల్‌ వద్దకు వస్తుండగా ఎస్‌ఐ సాంబశివరావు అతన్ని అరెస్ట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement