నారీమణుల ఆధ్వర్యంలోనే టి20 ప్రపంచకప్ నిర్వహణ
టాస్ నుంచి రిఫరీ నిర్ణయాల దాకా వనితలకే అధికారం
రిఫరీల బృందంలో ఆంధ్ర మహిళ జీఎస్ లక్ష్మి
నారీ లోకం ప్రపంచకప్ కార్యసిద్ధికి సర్వసైన్యంతో నడుంబిగిస్తోంది. ఆ మెగా ఈవెంట్‌ను అంతా అతివలే చక్కబెట్టేందుకు సిద్ధమయ్యారు. టాస్ వేయడం, బ్రాడ్‌కాస్టర్ మైక్‌తో కెప్టెన్ నిర్ణయమెంటో తెలుసుకోవడం, వ్యాఖ్యతలు, ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్, మ్యాచ్ రిఫరీ ఇలా ఆది అంతం అంతా మహిళలే చూసుకుంటారు. యూఏఈలో ఇంకొన్ని రోజుల్లోనే జరిగే మహిళల టి20 ప్రపంచకప్ అంతా అతివల మయం కానుంది.
దుబాయ్: ఒక క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు 11+11 మంది ప్లేయర్లు సరిపోతారు. కానీ ఆటకు ముందు, ఆట నిర్వహణ, ఆట తర్వాత ‘ప్రత్యక్ష ప్రసారాని’కి కంటబడని పనెంతో ఉంటుంది. దీన్ని పదులు, వందల సంఖ్యలో సిబ్బంది కంటికి రెప్పలా కనిపెట్టుకొని మరీ పనిచేస్తారు. టాస్ ప్రతినిధి, పిచ్ వద్ద బ్రాడ్‌కాస్టర్ తొలి వ్యాఖ్యానం, టీవీ వ్యాఖ్యాతల వాక్చాతుర్యం, అంపైర్లు బంతిని పట్టుకొని మైదానంలోకి దిగడం.
తర్వాత ఫీల్డింగ్ జట్టు గుండ్రంగా ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకొని చేసే ప్రతిజ్ఞ... అనంతరం మెల్లిగా ఓపెనర్ల ఆగమనం, సెకన్ల కౌంట్‌డౌన్‌తో మ్యాచ్ షురూ! మధ్యలో విరామం... గ్రౌండ్‌సిబ్బంది పిచ్‌ను చదును చేయడం, ఆకస్మికంగా వర్షం పడితే కవర్లు పట్టుకొని పదుల సంఖ్యలో మైదానాన్ని కవర్ చేయడం, మ్యాచ్ రిఫరీ పర్యవేక్షణ ఇలా ఓ పెద్ద బృందమే మ్యాచ్‌ను మనముందుకు తెస్తుంది.
క్రికెట్ అంటే ఫోర్, సిక్సర్, అవుట్, డకౌట్, ఎల్బీడబ్ల్యూ మాత్రమే కాదు... అంతకుమించిన శ్రమ, ప్రణాళికాబద్ధమైన నిర్వహణ ఉంటాయి. ఇదివరకే గత టి20 ప్రపంచకప్ బాధ్యతల్ని మహిళల బృందమే నిర్వహించడంతో ఇకపై కూడా అదే ఆనవాయితీని కొనసాగించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. మొత్తం మీద ఐసీసీ అతివలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వడమే కాదు... గురుతర బాధ్యతలను కూడా పెట్టింది. తద్వారా ప్రపంచానికి ప్రపంచకప్‌తో నారీశక్తిని చాటే అవకాశమిచ్చింది.
అంపైర్ల జాబితాలో వృందా రాఠి
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) యూఏఈలో జరిగే మెగా ఈవెంట్ కోసం 13 మంది సభ్యులు గల అధికారిణిల బృందాన్ని ఎంపిక చేసింది. ఇందులో ముగ్గురు మ్యాచ్ రిఫరీలుండగా, 10 మంది అంపైర్లున్నారు.
భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు రిఫరీగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవమున్న ఆంధ్రప్రదేశ్ మ్యాచ్ రిఫరీ మెగా ఈవెంట్ కోసం ఎంపిక చేసిన ముగ్గురు రిఫరీల్లో చోటు దక్కడం గొప్ప విశేషం. ఈ బృందంలో జెరెలిన్ మైకేల్ పెరీరా (శ్రీలంక), షాండ్రే ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా) ఇతర సభ్యులుగా ఉన్నారు. మరో భారత అధికారిణి వృందా రాఠికి పదిమంది సభ్యులు గల ఐసీసీ ఎమిరేట్స్ అంపైర్ల బృందంలో స్థానం లభించింది.
ముక్కోణపు, ద్వైపాక్షిక సిరీస్‌లో మ్యాచ్ అధికారులు చూపిన నైపుణ్యం, కనబరిచిన ప్రదర్శన ఆధారంగా అర్హతగల అధికారులనే ప్రపంచకప్ నిర్వహణ బృందానికి ఎంపిక చేశాం. వాళ్లంతా తమ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తారు. వాళ్లందరికీ ఈ సందర్భంగా బెస్ట్ ఆఫ్ లక్ తెలుపుతున్నాను’ అని ఐసీసీ సీనియర్ మేనేజర్ (అంపైర్లు–రిఫరీలు) సియాన్ ఈసే తెలిపారు.
మొత్తం పది జట్లు పోటీపడే ఈ మెగా టోరీ్నలో 23 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. అక్టోబర్ 3న బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌ల మధ్య షార్జాలో జరిగే పోరుతో టోర్నీ షురూ అవుతుంది.ప్ర«దాన టోర్నీకి ముందు ప్రతీ జట్టు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ నెల 28 నుంచి సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయి.
అంపైర్ల బృందం: లౌరెన్ అగెన్‌బ్యాగ్ (దక్షిణాఫ్రికా), కిమ్ కాటన్ (న్యూజిలాండ్), సారా దంబయెవానా (జింబాబ్వే), అనా హారిస్ (ఇంగ్లండ్), నిమాలి పెరీరా (శ్రీలంక), క్లెయిర్ పొలోసాక్ (ఆ్రస్టేలియా), వృందా రాఠి (భారత్), స్యు రెడ్‌ఫెర్న్ (ఇంగ్లండ్), ఎలోయిస్ షెరిడాన్ (ఆ్రస్టేలియా), జాక్వెలిన్ విలియమ్స్ (వెస్టిండీస్). మ్యాచ్ రిఫరీలు: జీఎస్ లక్ష్మి (భారత్), జెరెలిన్ మైకేల్ పెరీరా (శ్రీలంక), షాండ్రే ఫ్రిట్జ్ (దక్షిణాఫ్రికా).
Comments
Please login to add a commentAdd a comment