
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘ కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ పదవి కోసం నామినేషన్లు వేసేందుకు ఈ నెల 18ని తుది గడువుగా విధించింది. అయితే గతంలో ప్రతిష్టంభనకు కారణమైన కీలక నిబంధన విషయంలో స్పష్టత ఇవ్వకుండానే ఐసీసీ దీనిని ప్రకటించడం ఆసక్తికరం. ప్రస్తుతం ఐసీసీలో 17 మంది బోర్డు సభ్యులకు ఓటు హక్కు ఉంది. నిబంధనల ప్రకారం అధ్యక్షుడిగా ఎన్నిక కావాలంటే మూడింట రెండో వంతు మెజార్టీ ఉండాలి. అంటే కనీసం 11 లేదా 12 మంది సభ్యుల మద్దతు అవసరం. కొన్ని దేశాలు మాత్రం సాధారణ మెజార్టీ ప్రకారం... అంటే ఎక్కువ మంది ఎవరికి మద్దతు పలికితే వారిని ఎంపిక చేయాలని కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఏకగ్రీవం సాధ్యం కాకపోతే ఎన్నికను ఎలా నిర్వహిస్తారనేది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment