సైప్రస్, నెదర్లాండ్స్, బెల్జియం... మూడు వేర్వేరు దేశాల వేదికలు... మూడు చోట్లా జాతీయ రికార్డులు... 16 రోజుల వ్యవధిలో 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత అథ్లెట్ జ్యోతి యర్రాజి సాధించిన ఘనత ఇది. దాదాపు ఏడాది క్రితం మోకాలి గాయంతో బాధపడుతూ కనీసం ఒక హర్డిల్‌ను కూడా దాటలేని పరిస్థితుల్లో ఆందోళన చెందిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, ఇప్పుడు రికార్డులను తిరగరాస్తోంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన జ్యోతి ఇప్పుడు భారత అథ్లెటిక్స్‌లో కొత్త సంచలనం. సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన ఆమె తాజా ప్రదర్శనతో అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ విజయాలే లక్ష్యంగా శ్రమిస్తోంది.
–సాక్షి క్రీడా విభాగం
13.23 సెకన్లు... 13.11 సెకన్లు... 13.04 సెకన్లు... మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో ఇటీవల జ్యోతి వేగం ఇది! ఇరవై ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన తర్వాత ఆమె అంతటితో ఆగిపోలేదు. మరింత వేగంగా, మరింత బలంగా దూసుకుపోయింది. మరో రెండుసార్లు చెలరేగి తన రికార్డును తానే సవరించుకుంది. ‘పరుగులో వేగం మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం ఏకాగ్రత, మానసిక దృఢత్వం కూడా జ్యోతి విజయాలకు కారణం.
యూరోప్‌లో రేసు ప్రారంభానికి వాడే స్టార్టర్ గన్‌లు కొంత భిన్నంగా ఉంటాయి. సైప్రస్ రేస్‌లో ఆమెకు గన్ శబ్దం సరిగా వినిపించలేదు. దాంతో ఆరంభం ఆలస్యమైంది. అయినా సరే ఏకైక లక్ష్యంతో దూసుకుపోయి రికార్డు సాధించగలిగింది. మున్ముందూ ఆమె మరిన్ని ఘనతలు సాధిస్తుంది’ అని కోచ్ జేమ్స్ హిలియర్ జ్యోతి గురించి చేసిన వ్యాఖ్య ఆమె ఆట ఏమిటో చెబుతుంది. గాయం కారణంగా దాదాపు సంవత్సరం పాటు ఆటకు దూరంగా ఉన్నా, మళ్లీ ట్రాక్‌పైకి వచ్చి జ్యోతి సత్తా చాటగలిగింది.
పరుగుపై ఆసక్తితో...
జ్యోతి స్వస్థలం వైజాగ్. తండ్రి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పుడు స్కూల్ స్థాయిలో పరుగు పందాల్లో పాల్గొన్న ఆసక్తే ఆమెను ఇప్పుడు ప్రొఫెషనల్ అథ్లెట్‌గా మార్చింది. జూనియర్ స్థాయిలో తన అథ్లెటిక్ నైపుణ్యంతో ఆకట్టుకున్న జ్యోతి ఆటకు మరింత పదును పెట్టేందుకు సరైన వేదిక లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సెలక్షన్ ట్రయల్స్‌లో పాల్గొని అర్హత సాధించడంతో గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో ఆమె శిక్షణ మొదలైంది.
తొలిసారి అథ్లెట్స్ ‘స్పైక్స్’ను అక్కడే వేసుకునే అవకాశం లభించిన జ్యోతి... భారత కోచ్ నాగపురి రమేశ్ పర్యవేక్షణలో దాదాపు నాలుగేళ్ల పాటు సాధన చేసి హర్డిల్స్‌లో రాటుదేలింది. 2019 ఆగస్టులో లక్నోలో జరిగిన ఇంటర్ స్టేట్ చాంపియన్‌షిప్ జ్యోతి కెరీర్‌లో తొలి సీనియర్ టోర్నీ. మొదటి ప్రయత్నంలోనే 13.91 సెకన్ల టైమింగ్‌తో హర్డిల్స్ విజేతగా నిలవడంతో ఆమె అందరి దృష్టిలో పడింది. జాతీయ స్థాయి విజయాల కారణంగా పటియాలా ‘సాయ్’ కేంద్రంలో భారత క్యాంప్‌లో జ్యోతికి అవకాశం లభించింది.
రెండు సార్లు రికార్డు కొట్టినా...
కెరీర్‌లో దూసుకుపోయే అవకాశం లభిస్తున్న తరుణంలో ‘కరోనా’ దెబ్బ జ్యోతిపై కూడా పడింది. ‘సాయ్’ కేంద్రాన్ని మూసివేయాల్సి రావడంతో సాధనకు ఆటంకం కలిగింది. కొంత కాలం ప్రాక్టీస్ కూడా ఆగిపోయింది. అయితే కీలక సమయంలో ఆమెకు మరో రూపంలో శిక్షణకు అవకాశం లభించింది. భువనేశ్వర్‌లో ఒడిషా ప్రభుత్వంతో కలిసి రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ‘హై పెర్ఫార్మెన్ సెంటర్’లో జ్యోతికి అవకాశం లభించింది.
దీనిని ఆమె సమర్థంగా వాడుకుంది. అక్కడి హెడ్ కోచ్ జేమ్స్ హిలియర్ పర్యవేక్షణలో జ్యోతి పరుగు మరింత మెరుగైంది. ట్రాక్‌పైకి వచ్చి రెండు సార్లు జాతీయ రికార్డు టైమింగ్‌లు (13.03 సెకన్లు, 13.08 సెకన్లు) నమోదు చేసినా... సాంకేతిక కారణాల వల్ల వాటికి భారత అథ్లెటిక్స్ సమాఖ్య గుర్తించలేదు. అయితే ఆమె నిరాశ చెందలేదు. ‘ట్రైనింగ్ కమ్ కాంపిటీషన్’ కోసం యూరోప్ వెళ్లిన 22 ఏళ్ల జ్యోతి ఏకంగా మూడు సార్లు రికార్డు బద్దలు కొట్టి తానేమిటో చూపించింది.
జాతీయ రికార్డు టైమింగ్‌ను దృష్టిలో ఉంచుకొని నేనెప్పుడూ పరుగెత్తలేదు. పరుగు మొదలెట్టాక అమిత వేగంగా లక్ష్యాన్ని చేరడమే నా పని. అందుకే రెండుసార్లు రికార్డు నమోదు కాకపోవడం బ్యాడ్‌లక్‌గా భావించానే తప్ప బాధపడలేదు. ఇప్పుడు కెరీర్‌లో మంచి దశలో ఉన్నాను. అయితే ప్రతిష్టాత్మక ఈవెంట్లలో భారత్ తరఫున ఇంకా పతకాలు సాధించలేదు. ప్రస్తుతం ఆ సవాల్ నా ముందుంది. రాబోయే కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడలకు ఇప్పటికే అర్హత సాధించాను కాబట్టి వాటిలో పతకాలు సాధించడంపైనే దృష్టి పెట్టి ప్రాక్టీస్ చేస్తున్నా. ఒలింపిక్ అర్హత టైమింగ్ 12.90 సెకన్లు. నేను నా ఆటను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది. 12.60 సెకన్ల టైమింగ్ సాధించడమే నా లక్ష్యం.
–‘సాక్షి’తో జ్యోతి యర్రాజి
Comments
Please login to add a commentAdd a comment