ఫుట్‌బాల్‌లో జెర్సీ నెంబర్ 10కి యమా క్రేజ్ ఉంది. దిగ్గజం డీగో మారడోనా ఇదే నెంబర్ జెర్సీతో ఆడి అర్జెంటీనాను విశ్వ విజేతగా నిలిపాడు. అలా మారడోనా జెర్సీ నెంబర్ 10కి ఒక లీగసీని సెట్ చేసి పెట్టాడు. ఇప్పుడు ఆ లెగసీని తన శిష్యుడైన లియోనల్ మెస్సీ కంటిన్యూ చేస్తున్నాడు. అయితే జెర్సీ నెంబర్ 10కి అంత క్రేజ్ రావడానికి మారడోనా, మెస్సీలు కాదు.. వీళ్లకంటే ముందే ఆ జెర్సీని ధరించిన మరో అర్జెంటీనా ఆటగాడు ఉన్నాడు. అతనే మారియో కెంపెస్. 1978లో అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ విజేతగా నిలవడంలో కెంపెస్ పాత్ర కీలకం.
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. మెస్సీకి ఇదే చివరి వరల్డ్‌కప్ అని అంతా భావిస్తున్న తరుణంలో అర్జెంటీనాను విజేతగా నిలిపితే చూడాలనుకుంటున్నారు. అయితే మారడోనా, మెస్సీ కంటే ముందే అదే అర్జెంటీనా నుంచి ఒక ఆటగాడు జెర్సీ నెంబర్ 10ని ధరించాడు. ఆ జెర్సీని ధరించడమే కాదు.. అర్జెంటీనాను తొలిసారి ఫిఫా వరల్డ్ చాంపియన్స్‌గా(1978) నిలిపాడు. అతనే మారియో కెంపెస్.
1978 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా విజేతగా నిలిచిందంటే మారియో కెంపెస్ ప్రధాన కారణం. ఆ టోర్నీలో మొత్తం ఆరు గోల్స్ చేసిన మారియో టాప్ స్కోరర్‌గా నిలిచి గోల్డెన్ బూట్, గోల్డెన్ బాల్ అవార్డులను దక్కించుకున్నాడు. ఫుట్‌బాల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా మారియో కెంపెస్ నిలిచాడు. ఇక మారియో కెంపెస్ చేసిన ఆరు గోల్స్‌లో అన్ని జంట గోల్స్ కావడం విశేషం. వీటిలో కీలకమైన సెకండ్ రౌండ్, ఫైనల్స్ మ్యాచ్‌లు ఉన్నాయి.
అప్పటి వరల్డ్‌కప్‌లో నాకౌట్ దశ లేదు. తొలి రౌండ్, రెండో రౌండ్.. ఆ తర్వాత ఫైనల్ నిర్వహించారు. ఇక రెండో రౌండ్‌లో గెలిచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు నేరుగా ఫైనల్లో అడుగుపెడతాయి. తొలి రౌండ్‌లో మారియో కెంపెస్ అంతగా ప్రభావం చూపలేదు. అయితే రెండో రౌండ్ నుంచి మాత్రం అతని మాయాజాలం మొదలైంది. రెండో రౌండ్‌లో పోలాండ్, పెరూతో మ్యాచ్‌ల్లో నాలుగు గోల్స్ చేసిన మారియో జట్టు ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించాడు.
ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లోనూ మారియో కెంపెస్ మరోసారి మెరిశాడు. ఆట 38వ నిమిషంలో డచ్ గోల్ కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ 12 మీటర్ల దూరం నుంచి అద్బుత గోల్ సాధించాడు. ఆ తర్వాత ఆట అదనపు సమయంలో 105 నిమిషంలో మరో గోల్ చూసి జట్టు స్కోరును రెండుకు పెంచాడు. మరోవైపు నెదర్లాండ్స్ ఒక గోల్‌కే పరిమితం కావడంతో అర్జెంటీనా 2-1 తేడాతో మ్యాచ్‌ను గెలిచి తొలిసారి విశ్వవిజేతగా అవతరించింది.
అలా మారియో కెంపెస్ పేరు మార్మోగిపోయింది. అప్పటినుంచే జెర్సీ నెంబర్ 10కి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఇదే జెర్సీని మారడోనా ధరించడం.. 1986లో అర్జెంటీనాను విజేతగా నిలపడం జరిగిపోయాయి. ఇక ఇప్పుడు వీరిద్దరి ట్రెండ్‌ను కొనసాగిసున్న మెస్సీ తన ప్రపంచకప్ కలను తీర్చుకుంటాడో లేదో చూడాలి. ఇక అర్జెంటీనా రౌండ్ ఆఫ్-16లో డిసెంబర్ 4న ఆస్ట్రేలియాతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment