బీసీసీఐ తదుపరి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ త్వరలోనే బాధ్యతలు తీసుకోనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాస్‌గా ఉన్న సౌరవ్ గంగూలీ మరోమారు అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు ఆసక్తిగా ఉన్నప్పటికి బోర్డు మాత్రం దాదాను కాదని బిన్నీకే అవకాశం ఇవ్వాలని భావించింది. ఈ మేరకు రోజర్ బిన్నీ నామినేషన్ పేపర్లను దాఖలు చేయనున్నాడు. అక్టోబర్ 18న ముంబైలో జరగనున్న ఏజీఎం మీటింగ్ అనంతరం బిన్నీ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశముంది.
రోజర్ బిన్నీ అనగానే మనకు మొదటగా గుర్తుకు వచ్చేది 1983 ప్రపంచకప్. 1983 ప్రపంచకప్‌ను కపిల్ డెవిల్స్ నెగ్గిన సంగతి తెలిసిందే. అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా అంచనాలకు మించి రాణించి విశ్వవిజేతగా అవతరించింది. ఈ విజయంలో బౌలర్‌గా రోజర్ బిన్నీ పాత్ర కీలకం. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన బిన్నీ ఆ ప్రపంచకప్‌లో 18 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు.
ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా 1985లో వరల్డ్ సిరీస్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లోనూ రోజర్ బిన్నీ మరోమారు అదరగొట్టాడు. ఆ సిరీస్‌లో 17 వికెట్లు తీసి పాపులర్ క్రికెటర్‌గా మారిపోయాడు. ఒక ఆంగ్లో ఇండియన్‌గా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. టీమిండియా తరపున బిన్నీ 27 టెస్టుల్లో 47 వికెట్లు, 72 వన్డేల్లో 77 వికెట్లు తీశాడు.ఇక దేశవాలీ క్రికెట్‌లో కర్నాటకకు ప్రాతినిధ్యం వహించాడు.
కొడుకు స్టువర్ట్ బిన్నీతో రోజర్ బిన్నీ
అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు?
67 ఏళ్ల వయసులో 36వ బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీనే ఎందుకు ఏంచుకుందనే సందేహాలు చాలా మందిలో కలిగాయి. కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కెఎస్‌సిఎ)లో సెక్రటరీ సంతోష్ మీనన్‌కు బదులుగా బిసిసిఐ ఎజిఎమ్‌లో బిన్నీని ప్రతినిధిగా నియమించారు. అప్పుడే బిన్నీకి బీసీసీలో కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు కనిపించాయి.
పైగా రోజర్ బిన్నీకి క్లీన్ ఇమేజ్ ఉంది.అతని కుమారుడు స్టువర్ట్ బిన్నీ టీమిండియాకు ఆడుతున్న సమయంలోనే రోజర్ బిన్నీ సెలెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశాడు. అంతేకాదు రోజర్ బిన్నీ మంచి కోచ్ కూడా. 2000 అండర్-19 ప్రపంచకప్‌ను నెగ్గిన టీమిండియా కోచ్‌గా రోజర్ బిన్నీనే ఉన్నాడు. యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ లాంటి ఆటగాళ్లను వెలుగులోకి తెచ్చింది కూడా ఇతనే. ఆ తర్వాత బెంగాల్ రంజీ జట్టు కోచ్‌గా రోజర్ బిన్నీ సేవలందించారు.
► బీసీసీఐ అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ ముందు పెద్ద సవాళ్లే ఉన్నాయి. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఐపీఎల్ 2023తో పాటు దేశవాలీ టోర్నీలు నిర్వహించడం బిన్నీ ముందున్న పెద్ద లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment