మనీశ్ పాండే, విరాట్ కోహ్లి
దుబాయ్: అనుకున్నట్లే ఐపీఎల్ హంగామా మొదలైంది. కరోనా నేపథ్యంలో నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ సాఫీగా ఫ్రాంచైజీలన్నీ ఆటలో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల ఆటను చూసి సంతోషించిన హైదరాబాద్ అభిమానులు ఇక తమ సొంత జట్టును మైదానంలో చూసుకునేందుకు సిద్ధమయ్యారు. స్టార్లతో కూడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో సోమవారం జరుగనున్న మ్యాచ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఈ సీజన్ ఐపీఎల్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇరు జట్లకూ ఇదే తొలి మ్యాచ్ కావడం... విధ్వంసం సృష్టించే ఆటగాళ్లకు కొదవలేకపోవడంతో అభిమానులకు అసలైన ఐపీఎల్ మజా అందనుంది.
రైజింగ్‌కు సిద్ధం...
బ్యాట్స్‌మెన్ జోరు కొనసాగే ఐపీఎల్‌లో... బౌలర్ల ఉనికి కనబడే జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్. చాప కింద నీరులా ఎస్‌ఆర్‌హెచ్ లీగ్‌లో తన పని తను చేసుకుపోతుంటుంది. తక్కువ లక్ష్యాలు కాపాడుకోవడం ఎస్‌ఆర్‌హెచ్‌కు బంతితో పెట్టిన విద్య. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ రూపంలో జట్టును నడిపించే అద్భుతమైన నాయకులున్నారు. ఓపెనర్‌గా, కెప్టెన్‌గా, అత్యధిక పరుగుల వీరుడిగా లీగ్‌లో వార్నర్‌ను మించిన వారు లేరు. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ఎంత ప్రమాదకారో అందరికీ తెలిసిందే. ఈ జంట గత సీజన్‌లో బెంగళూరుపైనే రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. వీరితో పాటు మనీశ్ పాండే, మిచెల్ మార్‡్ష, ఫాబియాన్ అలెన్ సత్తా చాటితే భారీ స్కోరు ఖాయం. ఇక వైవిధ్యమైన బౌలింగ్ సన్‌రైజర్స్ సొంతం. అఫ్గాన్ బౌలర్లు రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీలతో పాటు భువనేశ్వర్, షాబాజ్ నదీమ్ తమ స్థాయికి తగినట్లు రాణిస్తే ఎంతటి బ్యాట్స్‌మెన్ అయినా సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరగడం ఖాయం.
అమితోత్సాహంలో కోహ్లి సేన...
దుబాయ్ చేరినప్పటి నుంచి కచ్చితమైన ప్రణాళిక ప్రకారం సన్నద్ధమవుతోన్న జట్టు ఆర్‌సీబీ. మిగతా జట్లు క్వారంటైన్ కాలంలో ఏదో ఒక రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటుంటే ఆర్‌సీబీ శిబిరం మాత్రం ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంది. తొలి మ్యాచ్ విజయంతో ఈ ఆనందాన్ని పదిలం చేసుకోవాలని కెపె్టన్ కోహ్లి భావిస్తున్నాడు. ఈ సీజన్‌లో తమ జట్టు రాత మార్చాలనే దృఢ సంకల్పంతో ఉన్నాడు. అంతా తానై నడిపించే కోహ్లికి ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు ఆరోన్ ఫించ్ తోడయ్యాడు. యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌పై అంచనాలు భారీగానే ఉన్నాయి. (పంజాబ్ సూపర్ ఫ్లాప్...)
వీరికి తోడు ‘మిస్టర్ 360’ ప్లేయర్ ఏబీ డివిలియర్స్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్ బ్యాట్ ఝళిపిస్తే చూస్తుండగానే భారీ స్కోరు నమోదు కావడం ఖాయం. బౌలింగ్‌లో ఎప్పటిలాగే స్పిన్నర్ యజువేంద్ర చహల్ కీలకం కానున్నాడు. వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, ఆడమ్ జంపా, మొయిన్ అలీ స్పిన్ బాధ్యతల్ని మోయనున్నారు. అయితే డెత్ ఓవర్లలో తేలిపోయే బలహీనతను అధిగమించకపోతే ఆర్‌సీబీ ఎంత పోరాడినా వృథాయే. జట్టు నిండా స్టార్లతో కూడిన ఆర్‌సీబీకి ఆవగింజంత అదృష్టం తోడైతే టైటిల్ సాధించడం కష్టమేమీ కాదు.
Comments
Please login to add a commentAdd a comment