Photo Courtesy: IPL Twitter
న్యూఢిల్లీ: ‘‘యాజమాన్య నిర్ణయాన్ని డేవిడ్ ప్రశ్నించాడో లేదో నాకు తెలియదు. అయితే, మనీష్ పాండే విషయంలో మాత్రం తాను ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని చెప్పాడు. కొన్నిసార్లు మేనేజ్‌మెంట్‌కు ఇలాంటి మాటలు రుచించకపోవచ్చు. ఒక కెప్టెన్‌గా కొన్ని తప్పనిసరి బాధ్యతలు ఉంటాయి. ఎవరు తుదిజట్టులో ఉంటారు, ఎవరిని పక్కన పెట్టాలి అన్న అంశాలపై స్పష్టత ఉండాలి. అయితే, ఒక్కోసారి పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు. మొత్తానికి తెరవెనుక ఏదో జరుగుతోంది’’ అంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ బౌలర్ డెయిల్ స్టెయిన్ సందేహం వ్యక్తం చేశాడు. ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం వ్యవహారశైలి చూస్తుంటే డేవిడ్ వార్నర్ ఇక ఆ జట్టుకు ఆడే పరిస్థితి కనబడటం లేదని పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్‌లో మంచి రికార్డు ఉన్న డేవిడ్ వార్నర్‌ను తొలుత కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్‌రైజర్స్, ఆదివారం నాటి మ్యాచ్‌లో అతడికి తుది జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. దీంతో, వార్నర్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జట్టుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్‌ను ఇంతలా అవమానించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. క్రీడా వర్గాల్లోనూ ఈ విషయంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో డెయిల్ స్టెయిన్ మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
2013-15 సీజన్లలో హైదారాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన అతడు.. ‘‘నాకు తెలిసి డేవిడ్ వార్నర్‌ను ఇకపై సన్‌రైజర్స్ జెర్సీలో చూడలేమేమో’’ అని పేర్కొన్నాడు. కాగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. 55 పరుగుల తేడాతో ఓటమి చెంది ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వార్నర్‌ను కాదని నబీని జట్టులోకి తీసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారంటూ మరోసారి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment