umran malik(Photo Courtesy: IPL Twitter)
SRH Umran Malik Father Gets Emotional: తమ కుమారుడు ఏదో ఒకరోజు తప్పకుండా టీమిండియా తరఫున ఆడతాడని సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తండ్రి అబ్దుల్ మాలిక్ అన్నారు. మూడేళ్ల నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న తమ కొడుకు.. ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడటం సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. టీవీలో తన ఆట చూసుకుంటూ మురిసిపోతున్నామని పుత్రోత్సాహంతో పొంగిపోయారు. కాగా ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్ నటరాజన్‌కు కరోనా సోకడంతో.. ఉమ్రాన్ మాలిక్‌కు జట్టులో చోటు దక్కిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఐపీఎల్-2021 రెండో అంచెలో ఆడేందుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యంత వేగంగా బంతిని(సుమారు 153 కి.మీ. వేగం) విసిరిన ఉమ్రాన్ మాలిక్... ఇక బుధవారం నాడు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కెరీర్‌లో తన తొలి వికెట్ నమోదు చేశాడు.
ఈ నేపథ్యంలో ఉమ్రాన్ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న అతడి తండ్రి అబ్దుల్ మాలిక్ ఇండియా టుడేతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘మూడేళ్ల వయసు నుంచే నా కుమారుడికి క్రికెట్ అంటే బాగా ఇష్టం. ప్రొఫెషనల్ క్రికెటర్ కావాలన్నది తన కల. సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టులో తను చోటు దక్కించుకోవడం మాకు అమితానందాన్ని ఇచ్చింది. మేమంతా టీవీకే అతుక్కుపోయాం. తెరపై ఉమ్రాన్‌ను చూసి నా భార్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మా కొడుకు చాలా కష్టపడ్డాడు. తను ఏదో ఒకరోజు కచ్చితంగా టీమిండియాకు ఆడతాడనే నమ్మకం ఉంది’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు.
పేద కుటుంబం మాది..
‘‘నేను పళ్లు, కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించుకుంటున్నా. మాది చాలా పేద కుటుంబం. అలాంటిది మా కొడుకు ఐపీఎల్‌లో ఆడటం నిజంగా మాకెంతో గొప్ప విషయం. ఉమ్రాన్ మమ్మల్ని గర్వపడేలా చేశాడు. ఇప్పుడు మా సంతోషానికి హద్దులు లేవు. లెఫ్టినెంట్ గవర్నర్ కూడా మాకు అభినందనలు తెలిపారు. ఆ భగవంతుడి దయతో ఉమ్రాన్ తన కెరీర్‌లో దూసుకుపోవాలి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
చదవండి: Jason Holder: నయా సంచలనం ఉమ్రాన్‌పై హోల్డర్ ప్రశంసలు
Comments
Please login to add a commentAdd a comment