అహ్మదాబాద్: హోరాహోరీ పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పైచేయి సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక పరుగు తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. ముందుగా బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఏబీ డివిలియర్స్ (42 బంతుల్లో 75 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగగా... రజత్ పటిదార్ (22 బంతుల్లో 31; 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 170 పరుగులు చేయగలిగింది. రిషభ్ పంత్ 58 నాటౌట్), షిమ్రాన్ హెట్‌మైర్ ( 53 నాటౌట్;) అర్ధ సెంచరీలు సాధించినా పరుగు దూరంలో ఆగిపోయి ఓటమి చవిచూశారు.
మ్యాచ్ తర్వాత పంత్ మాట్లాడుతూ.. ‘ ఇలా ఓడిపోవడం నిజంగానే నిరాశపరిచింది.. పరుగు తేడాతో పరాజయం అంటే గెలుపు ముంగిట బోల్తాపడ్టట్లే. ఈ వికెట్‌పై ఆర్సీబీ 10-15 పరుగులు అదనంగా చేసింది. మా జట్టులో హెట్‌మెయిర్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఆడాడు. దాంతోనే టార్గెట్‌కు అతి చేరువగా వచ్చాం. ఆఖరి ఓవర్‌లో మ్యాచ్ ఫినిష్ చేసే క్రమంలో మా ఇద్దరిలో ఎవరికి బ్యాటింగ్ వచ్చినా హిట్టింగ్ చేయాలనే ప్లాన్‌తోనే ఆడాం.
కానీ పరుగు తక్కువ కావడంతో ఓడిపోయాం. మేము అనుకున్నట్లు మా స్పిన్నర్లు రాణించలేదు. దాంతోనే ఆఖరి ఓవర్‌ను స్టోయినిస్ చేత వేయించా. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్‌ల ద్వారా పాజిటివ్ అంశాలను మాత్రమే తీసుకుని ముందుకు సాగుదాం. ప్రతీ మ్యాచ్ నుంచి ఏదొక పాఠం నేర్చుకుంటూ ప్రతీ రోజు మెరుగుపడుతున్నాం’ అని తెలిపాడు. ఆఖరి ఓవర్ స్టోయినిస్ వేసి 23 పరుగులు ఇవ్వడంతో ఆర్సీబీ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఏబీ మూడు సిక్సర్లు, 1 ఫోర్‌తో స్టోయినిస్‌పై విరుచుకుపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment