virat kohli(Photo: IPL)
Saba Karim Comments On Virat Kohli: ‘‘తమ కెరీర్‌లో మేజర్ టైటిల్ గెలవాలని ప్రతి ఆటగాడు కోరుకుంటాడు. కానీ అందరికీ అది సాధ్యం కాదు. ఉదాహరణకు.. సచిన్ టెండుల్కర్ విషయాన్నే తీసుకోండి. కప్ గెలవడానికి తను ఎన్నో వరల్డ్‌కప్ ఈవెంట్లలో ఆడాడు. కొన్నిసార్లు మనం దేనినైతే సాధించాలని తహతహలాడతామో.. అది మనకు సాధ్యం కాకపోవచ్చు. అదొక గుణపాఠంగా మిగులుతుంది. బహుశా.. విరాట్ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నట్లు అనిపిస్తోంది’’ అని టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీం అన్నాడు. ఐపీఎల్-2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటున్నట్లు విరాట్ కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.
కాగా 2013 నుంచి బెంగళూరు జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కోహ్లి.. ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదన్న సంగతి తెలిసిందే. 2016లో ఫైనల్ చేరినా సన్‌రైజర్స్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఇక ఈ సీజన్ తొలి అంచెలో మంచి ప్రదర్శనే కనబరిచినప్పటికీ.. చివరి ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పడం కాస్త కష్టం. ఈ నేపథ్యంలో కోహ్లి ప్రకటన క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. కొంతమంది అతడికి మద్దతు పలుకుతుండగా.. టోర్నీ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడిస్తే బాగుండని మరికొందరు విమర్శిస్తున్నారు.
ఇక ఈ విషయంపై స్పందించిన సబా కరీం ఖేల్‌నీతి అనే యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘టైటిల్ గెలవాలని కోహ్లి కోరుకున్నాడు. కానీ అది జరుగలేదు. అయితే, కెప్టెన్‌గా కాకుండా బ్యాట్స్‌మెన్‌గా తన సేవలు జట్టుకు ఎక్కువ అవసరమని భావించి ఉండవచ్చు. కనీసం అలాగైనా ట్రోఫీ అందించాలని భావిస్తున్నాడేమో. ఈ నిర్ణయం ప్రకటించే ముందు తను బాగా ఆలోచించుకుని ఉంటాడు.
టీమిండియాకు అన్ని ఫార్మాట్లలో, ఐపీఎల్‌లో ఆర్సీబీకి కెప్టెన్సీ బ్యాటింగ్‌పై ప్రభావం చూపిందనే విషయం అర్థం చేసుకున్నాడు. బ్యాట్‌ను ఝలిపించాలని భావిస్తున్నట్లు ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన కెరీర్‌ను మరింత కాలం పాటు పదిలం చేసుకునే క్రమంలో.. ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 వరల్డ్‌కప్ తర్వాత టీమిండియా పొట్టి ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి వైదొలగుతానని కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే.
చదవండి: T20 World Cup 2021: సెమీస్ చేరే జట్లు ఇవే.. నాలుగో స్థానం కోసం వాటి మధ్య పోటీ!
Comments
Please login to add a commentAdd a comment