Photo Courtesy: SRH
హైదరాబాద్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు శ్రీవత్స్ గోస్వామి పెద్ద మనసు చాటుకున్నాడు. కరోనా కట్టడికై భారత్ సాగిస్తున్న పోరులో భాగంగా తన వంతు సాయం చేశాడు. దేశంలో ఆక్సిజన్ కొరతతో కోవిడ్ బాధితులు అల్లాడుతున్న వేళ ప్రాణవాయువు సరఫరాకై రూ. 90 వేలు విరాళమిచ్చాడు. ఈ విషయాన్ని డొనాటేకర్ట్ అనే చారిటి ఆర్గనైజేషన్ ట్విటర్ వేదికగా వెల్లడించింది. అత్యవసర సమయంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపింది. ఇందుకు స్పందించిన శ్రీవత్స్.. కష్ట సమయంలో అందరూ ఏకతాటిపై నిలబడాలని, వీలైనంత మేర సాయం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ తన వంతు సాయంగా 50 వేల డాలర్లను పీఎం కేర్స్‌ఫండ్‌కు అందజేసిన విషయం తెలిసిందే. అదే విధంగా, ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ సైతం1 బిట్‌కాయిన్‌ను విరాళంగా అందించనున్నట్లు తెలిపాడు. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్‌వేవ్‌తో భారత్ అల్లాడుతున్న వేళ సాయం చేసేందుకు ముందుకు వచ్చిన తొలి స్వదేశీ క్రికెటర్‌గా శ్రీవత్స్ నిలిచాడు. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘వెల్‌డన్ శ్రీ భాయ్.. మా మనస్సుల్లో నీ స్థానం చెరిగిపోదు. కనీసం నువ్వైనా ముందుకు వచ్చావు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన శ్రీవత్స్ ఈ సీజన్‌లో ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ఇక 2008 నాటి అండర్-19 వరల్డ్ కప్ భారత జట్టులో భాగమైన అతడు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ విషయానికొస్తే.. గతంలో ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్తాన్ రాయల్స్(2012)కు ప్రాతినిథ్యం వహించిన అతడిని సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. ఐపీఎల్-2020లో సీజన్‌లో రెండు మ్యాచ్‌లు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరడంతో ఈసారి బెంచ్‌కే పరిమితం అయ్యాడు. ఇక బుధవారం నాటి మ్యాచ్‌లో చెన్నై చేతిలో హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
చదవండి: బ్రెట్ లీ ఔదార్యం.. 1 బిట్‌కాయిన్ విరాళం
కరోనా నుంచి కోలుకున్న ధోని తల్లిదండ్రులు
Happy to help 🙏 please donate and reach out :) we are in this together https://t.co/cKs9EZbnxM
— Shreevats goswami (@shreevats1) April 28, 2021
Comments
Please login to add a commentAdd a comment