ఐపీఎల్ 2022 మెగా వేలంలో వయసు మీద పడ్డ వెటరన్ ప్లేయర్లపై ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి కనబర్చని సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వైట్ బాల్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, ఇంగ్లండ్ వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌తో పాటు సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్, పుజారా, అమిత్ మిశ్రా, ఆదిల్ రషీద్, ఇమ్రాన్ తాహిర్, షకీబ్ అల్ హసన్.. ఇలా చాలా మంది వెటరన్ స్టార్లను దాదాపు అన్ని ఫ్రాంచైజీలు చూసిచూడనట్లు వ్యవహరించాయి.
వేలం అనంతరం వీరిలో కొందరు ఆటగాళ్లను ఎంపిక చేసుకోకపోవడంపై పలు ఫ్రాంచైజీలు వివరణ కూడా ఇచ్చాయి. తాజాగా, స్టార్ ఆల్‌రౌండర్, బంగ్లా ఆటగాడు షకీబ్ అల్ హసన్ మెగా వేలంలో అమ్ముడుపోకపోవడంపై అతడి భార్య ఉమ్మే అహ్మద్ శిశిర్ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా షకీబ్ అన్ సోల్డ్‌గా మిగిలిపోవడానికి గల కారణాలను వివరించింది. మెగా వేలానికి ముందు కొన్ని ఫ్రాంచైజీలు షకీబ్‌ను సంప్రదించాయని, సీజన్ మొత్తానికి అతను అందుబాటులో ఉంటాడా.. లేదా.. అని ఆరా తీశాయని, శ్రీలంకతో సిరీస్ ఉన్నందున షకీబ్ వారికి నో చెప్పాడని, ఈ కారణంగానే అతన్ని ఏ జట్టూ తీసుకోలేదని శిశిర్ వివరణ ఇచ్చింది.
వేలంలో అమ్ముడుపోకపోవడం పెద్ద పొరపాటేం కాదని, షకీబ్‌కి ఇంకొన్నాళ్లు క్రికెట్ ఆడే సత్తా ఉందని భర్తను వెనకేసుకొచ్చింది. షకీబ్ ఐపీఎల్ ఆడాలనుకుంటే శ్రీలంక సిరీస్ నుంచి తప్పుకునైనా ఆ పని చేయవచ్చని, కాని అతను డబ్బుల కంటే దేశానికి ఆడటాన్నే గౌరవంగా భావిస్తాడని శిశిర్ తన భర్తను ఆకాశానికెత్తింది. కాగా, శిశిర్ తన పోస్ట్‌లో శ్రీలంక సిరీస్ అని రాసుకొచ్చినప్పటికీ, వాస్తవానికి బంగ్లాదేశ్ మార్చి చివరన దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. మార్చి 18న మొదలయ్యే ఈ పర్యటనలో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇదిలా ఉంటే, 2021 ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఆడిన షకీబ్.. ఆశించిన మేరకు రాణించలేకపోయాడు. దీంతో అతడిపై ఈ ఏడాది మెగా వేలంలో ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు.
చదవండి: IND Vs WI: టీ20 సిరీస్‌కు ముందు అభిమానులకు బ్యాడ్‌న్యూస్..
Comments
Please login to add a commentAdd a comment