ఐపీఎల్ 2022లో అరంగేట్రం చేయనున్న అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ.. జట్టు సారధి ఎంపిక విషయంలో వేగంగా పావులు కదుపుతుంది. హెడ్ కోచ్(ఆశిష్ నెహ్రా), మెంటార్(గ్యారీ కిర్‌స్టెన్) విషయంలో ఓ క్లారిటీకి వచ్చిన ఆ జట్టు.. కెప్టెన్ విషయంలోనూ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ఎంపిక దాదాపు ఖరారైనట్టేనని, అతనిపై రూ.15 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని తొలుత వార్తలు వచ్చినప్పటికీ.. ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో స్తబ్దత నెలకొంది.
తాజాగా, ఆ వార్తలను కొట్టిపారేస్తూ.. ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అయ్యర్‌కి బదులు టీమిండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వాలని అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. హార్ధిక్‌తో పాటు అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్, ముంబై ఇండియన్స్ మాజీ ఆటగాడు ఇషాన్ కిషన్‌ల పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు సదరు ఫ్రాంఛైజీకి చెందిన అధికారి ఒకరు జాతీయ మీడియాతో తెలిపినట్లు సమాచారం. ఇదే జరిగితే కెప్టెన్సీ చేపట్టాలనుకున్న శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి భంగపాటు ఎదురైనట్టే.
కాగా, అహ్మదాబాద్‌తో పాటు మరో ఐపీఎల్ అరంగేట్రం జట్టు లక్నో సైతం కెప్టెన్ ఎంపిక విషయంలో తలపట్టుకుంది. సంజీవ్ గొయెంకా ఆధ్వర్యంలోని ఆ ఫ్రాంఛైజీ.. హెడ్ కోచ్‌గా ఆండీ ఫ్లవర్, మెంటార్‌గా గౌతమ్ గంభీర్‌ను నియమించుకున్నప్పటికీ.. కెప్టెన్ విషయంలో మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే, వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను ఎంపిక(ఫ్రీ టికెట్) చేసుకునేందుకు జనవరి 31 డెడ్‌లైన్ కావడంతో ఇరు ప్రాంఛైజీలు ఆ పనిలో నిమగ్నమై ఉన్నాయి.
చదవండి: IPL 2022: ఆ ముగ్గురు ఎవరో జనవరి 31లోగా తేల్చుకోండి..!
Comments
Please login to add a commentAdd a comment