
PC: IPL Twitter
ఐపీఎల్ ఎంతో మంది కొత్త ఆటగాళ్లను పరిచయం చేసింది.. చేస్తూనే ఉంది. దేశవాలీ క్రికెట్‌లో ఆడినప్పటికి రాని పేరు ఐపీఎల్ ద్వారా సంపాదిస్తున్న ఆటగాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ సీజన్‌లోనూ ఆయుష్ బదోని, శశాంక్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ సహా మరికొంత మంది ఆటగాళ్లు తమ గురించి మాట్లాడుకునే ప్రదర్శనను ఇస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో కుమార్ కార్తికేయ సింగ్ చేరాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.
కార్తికేయ తాను వేసిన తొలి ఓవర్ తొలి బంతికే రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ వికెట్ పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు.కాగా మ్యాచ్‌లో కుమార్ కార్తికేయ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు. అతని మిస్టరీ బౌలింగ్‌పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్‌లు ఆడితే ఒక విజయం, ఎనిమిది పరాజయాలు మూటగట్టుకుంది. ఈ సీజన్‌లో ముంబై గెలిచిన ఏకైక మ్యాచ్ కూడా రాజస్తాన్ రాయల్స్‌పైనే కావడం విశేషం.
తాజాగా కుమార్ కార్తికేయ గురించి అతని కోచ్ సంజయ్ భరద్వాజ్ ఈఎస్‌పీఎన్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇదే సంజయ్ భరద్వాజ్.. టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిన్ననాటి కోచ్ కూడా. ''కుమార్ కార్తికేయ చాలా కష్టాలు అనుభవించి క్రికెటర్ అయ్యాడు. కాన్పూర్‌లో పుట్టి పెరిగిన కార్తికేయ క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీలో అడుగుపెట్టాడు. కార్తికేయ తండ్రి కానిస్టేబుల్ అయినప్పటికి ఎవరి మీద ఆధారపడకూడదరి ఘజియాబాద్‌లో ఒక ఫ్యాక్టరీలో నైట్‌షిఫ్ట్‌లు చేస్తూ ఉదయం 80 కిమీ దూరంలో ఉన్న క్రికెట్ అకాడమీకి వెళ్లేవాడు. ఒక సందర్భంలో క్రికెట్ అకాడమీలో కార్తికేయకు లంచ్ ఇవ్వగా.. అతను కన్నీటి పర్యంతం అయ్యాడు. ఒక సంవత్సరం పాటు కేవలం రాత్రి భోజనం మాత్రమే చేశానని.. లంచ్ అనే పదం విని సంవత్సరం దాటిపోయింది అని ఎమోషనల్ అయ్యాడు.
నా దగ్గర శిక్షణలో అతను చూపించిన ఆసక్తికి ముచ్చటపడి బౌలింగ్‌లో మరింత రాటుదేలాలని నా స్నేహితుడు.. షార్దోల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అజయ్ ద్వివేది వద్దకు పంపించాను. అక్కడ డివిజన్ క్రికెట్ ఆడి రెండు సంవత్సరాల్లో 50కి పైగా వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటిన కార్తికేయ ఆ తర్వాత మధ్యప్రదేశ్ తరపున రంజీ ట్రోపీలో అరంగేట్రం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్రీగా ఉంటే నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. లెఫ్టార్మ్ ఆర్థడాక్స్‌తో పాటు రిస్ట్ స్పిన్ బౌలింగ్‌పై ఎక్కువ కసరత్తు చేశాడు. ఎట్టకేలకు ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగి రాజస్తాన్ కెప్టెన్ శాంసన్‌ను క్యారమ్ బాల్‌తో బోల్తా కొట్టించి వికెట్ పడగొట్టాడు.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే ప్లేఆఫ్ అవకాశాలు కోల్పోయిన ముంబై ఇండియన్స్ శుక్రవారం(మే 6న) టాప్‌ప్లేస్‌లో ఉన్న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
చదవండి: No Ball Controversy: నోబాల్ ఇచ్చుంటే ఎస్‌ఆర్‌హెచ్ గెలిచేదా!
Comments
Please login to add a commentAdd a comment