
కుల్దీప్ యాదవ్(PC: IPL/BCCI)
IPL 2022: కుల్దీప్ క్రీడా స్ఫూర్తి.. ఈ అవార్డు అతడితో పంచుకోవాలకుంటున్నా.. క్రెడిట్ అంతా రిషభ్‌దే!
IPL 2022 DC Vs PBKS- A Touch of Class: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ కుల్దీప్ యాదవ్ క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు. తనకు లభించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సహచర ఆటగాడితో పంచుకున్నాడు. ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించి సంగతి తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఢిల్లీ బౌలర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, ముస్తాఫిజుర్ చుక్కలు చూపించారు. ఏ దశలోనూ బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశారు.
ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. ఓపెనర్లు పృథ్వీ షా(20 బంతుల్లో 41 పరుగులు), డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 60 పరుగులు, నాటౌట్) విజృంభించడంతో 9 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.
ఇక ఈ విజయంలో తన వంతు పాత్ర పోషించిన చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డును అక్షర్‌తో కలిసి పంచుకోవాలనుకుంటున్నాను. మిడిల్ ఓవర్లలో నిజంగా తను చాలా బాగా బౌలింగ్ చేశాడు. ఇక కగిసో రబడ గురించి నాకు బాగా తెలుసు. తను క్రీజులో ఉన్నపుడు ఎక్కువగా కదలడు. అందుకే అతడికి చైనామన్, గూగ్లీ వేయాలని నిర్ణయించుకున్నా. నాథన్ ఎల్లిస్ వికెట్ విషయానికొస్తే.. రౌండ్ ది వికెట్ వేయాలన్న రిషభ్ సూచనను పాటించా.
ఈ సీజన్‌లో ఢిల్లీకి ఆడటం ద్వారా నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతోంది. ఇక్కడ నా పాత్ర, విలువ ఏమిటో అర్థమైంది. చాలా కాలం తర్వాత ఆటను మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. ఈ క్రెడిట్ మొత్తం రిషభ్‌కే దక్కుతుంది. అతడు నాకు మద్దతుగా నిలుస్తున్నాడు. నాపై నమ్మకం ఉంచి నాలో ఆత్మవిశ్వాసం పెంచుతున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్.. పంజాబ్ బ్యాటర్లు లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ వికెట్లు పడగొట్టగా.. కగిసో రబడ, నాథన్ ఎల్లిస్ వికెట్లను కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ స్కోర్లు:
పంజాబ్-115 (20)
ఢిల్లీ- 119/1 (10.3)
చదవండి: IPL 2022 DC Vs PBKS: ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ అరుదైన రికార్డు.. తొలి జట్టుగా!
A touch of class from @imkuldeep18! 👍 👍#TATAIPL | #DCvPBKS | @akshar2026 pic.twitter.com/tgF3M4wOYo
— IndianPremierLeague (@IPL) April 20, 2022