పొలార్డ్‌ను అవుట్ చేశాక కృనాల్ ఆనందం; కేఎల్ రాహుల్ సెంచరీ అభివాదం
ముంబై: ఐపీఎల్‌లో అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ గెలవడం మరిచిందా! లేక ఓడటమే వారికి అలవాటయిందా! ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ ముంబై చుట్టూనే జరుగుతున్నా ముంబై ఆటలు మాత్రం సాగడం లేదు. ఇప్పుడు వరుసగా ఎనిమిదో ఓటమితో ఈ సీజన్‌లో ముంబైకి ముందుకెళ్లే అవకాశమే లేదు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 36 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓడింది.
మొదట లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ కేఎల్ రాహుల్ (62 బంతుల్లో 103 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతక్కొట్టాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. కృనాల్ పాండ్యా 3 వికెట్లు పడగొట్టాడు.
రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్
రాహుల్ రెండో ఓవర్ నుంచి తనశైలి ఆటకు శ్రీకారం చుట్టాడు. హృతిక్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన అతను... సామ్స్ మూడో ఓవర్లో 2 వరుస ఫోర్లు బాదాడు. స్కోరు జోరు మొదలైన సమయంలోనే డికాక్ (10) వికెట్‌ను కోల్పోయింది. అంతకుముందు బంతికే అతను అవుటవ్వాల్సింది. మిడ్‌వికెట్ మీదుగా భారీషాట్‌ను కొట్టగా బౌండరీ వద్ద తిలక్ వర్మ జారవిడువడంతో సిక్సర్‌గా వెళ్లింది. మనీశ్ పాండే వచ్చాడు కానీ ఆట మాత్రం గతి తప్పింది. 8 ఓవర్లు పూర్తయినా జట్టు స్కోరు 45/1! యాభై పరుగులైనా చేయలేదు. 10వ ఓవర్లో పాండే సిక్సర్, రాహుల్ 2 ఫోర్లు కొట్టడంతో 17 పరుగులొచ్చాయి. మరుసటి ఓవర్లోనే రాహుల్ 37 బంతుల్లో (6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
టపటపా వికెట్లతో కుదేలైనా...
11 ఓవర్లు ముగిసేసరికి 82/1 స్కోరుతో పటిష్టంగా కనిపించిన లక్నో అనూహ్యంగా తడబడింది. బౌలింగ్‌కు దిగిన పొలార్డ్ తన వరుస ఓవర్లలో మనీశ్ పాండే (22 బంతుల్లో 22; 1 సిక్స్), కృనాల్ పాండ్యా (1)లను పెవిలియన్ చేర్చాడు. ఈ రెండు ఓవర్ల మధ్యలో సామ్స్... స్టొయినిస్ (0)ను డకౌట్ చేశాడు. దీపక్ హుడా (10) ఎక్కువసేపు నిలువలేదు. స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోవడంతో బ్యాటింగ్ భారమంతా మళ్లీ కెప్టెన్ రాహుల్‌పైనే పడింది.
ఉనాద్కట్ 18వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో రాహుల్ జట్టు స్కోరును 150 పరుగులు దాటించాడు. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతిని సిక్సర్‌గా మలచి రాహుల్ 61 బంతుల్లో (12 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ సీజన్‌లో లక్నో సారథికిది రెండో శతకం. తొలి సెంచరీ కూడా ముంబైపైనే సాధించాడు.
చేతులెత్తేసిన బ్యాటర్స్
200 పైచిలుకు స్కోర్లనే ధనాదంచేస్తున్న సీజన్ ఇది. ముంబై ముందున్న 169 పరుగుల లక్ష్యం ఏమంత కష్టమైంది కాదు. కానీ బ్యాటర్స్ నిర్లక్ష్యం ముంబైని నిలువునా ముంచింది. ఓపెనింగ్‌లో (రోహిత్) శర్మ, మిడిలార్డర్‌లో (తిలక్) వర్మ (27 బంతుల్లో 38; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మిగతాదంతా ఖర్మ అన్నట్లు సాగింది ముంబై బ్యాటింగ్. పవర్ ప్లేలో (43/0) బాగా ఆడిన జట్టు... ఇంకో 14 ఓవర్లలో 89 పరుగులే చేయగలిగింది.
పొలార్డ్ (19) రెండంకెల స్కోరు! మిగతా బ్యాటర్స్ ఇషాన్ (8), బ్రెవిస్ (3), సూర్యకుమార్ (7), సామ్స్ (3), ఉనాద్కట్ (1)లు పది పరుగులైనా చేస్తే ఒట్టు. అంత చెత్తగా ముంబై ఆట సాగింది. లక్నో బౌలర్లలో కృనాల్‌తో పాటు మోసిన్ (1/27), హోల్డర్ (1/36), బిష్ణోయ్ (1/28), బదోని (1/6) మూకుమ్మడిగా దెబ్బతీశారు.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) రోహిత్ (బి) బుమ్రా 10; రాహుల్ (నాటౌట్) 103; పాండే (సి) మెరిడిత్ (బి) పొలార్డ్ 22; స్టొయినిస్ (సి) తిలక్ (బి) సామ్స్ 0; కృనాల్ (సి) హృతిక్ (బి) పొలార్డ్ 1; హుడా (సి) బ్రెవిస్ (బి) మెరిడిత్ 10; బదోని (సి) పొలార్డ్ (బి) మెరిడిత్ 14; హోల్డర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168.
వికెట్ల పతనం: 1–27, 2–85, 3–102, 4–103, 5–121, 6–168.
బౌలింగ్: సామ్స్ 4–0–40–1, హృతిక్ 2–0–11–0, బుమ్రా 4–0–31–1, మెరిడిత్ 4–0–40–2, ఉనాద్కట్ 4–0–36–0, పొలార్డ్ 2–0–8–2.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: ఇషాన్ (సి) హోల్డర్ (బి) బిష్ణోయ్ 8; రోహిత్ శర్మ (సి) సబ్–గౌతమ్ (బి) కృనాల్ 39; బ్రెవిస్ (సి) చమీర (బి) మోసిన్ 3; సూర్యకుమార్ (సి) రాహుల్ (బి) బదోని 7; తిలక్ (సి) బిష్ణోయ్ (బి) హోల్డర్ 38; పొలార్డ్ (సి) హుడా (బి) కృనాల్ 19; సామ్స్ (సి) బిష్ణోయ్ (బి) కృనాల్ 3; ఉనాద్కట్ (రనౌట్) 1; హృతిక్ (నాటౌట్) 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 132.
వికెట్ల పతనం: 1–49, 2–54, 3–58, 4–67, 5–124, 6–131, 7–132, 8–132.
బౌలింగ్: మోసిన్ 4–0–27–1, చమీర 4–0–14–0, హోల్డర్ 4–0–36–1, కృనాల్ 4–0–19–3, రవి బిష్ణోయ్ 3–0–28–1, ఆయుశ్ బదోని 1–0–6–1.
ఐపీఎల్‌లో నేడు
పంజాబ్ కింగ్స్ X చెన్నై సూపర్ కింగ్స్
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం.
That's that from Match 37 and @LucknowIPL take this home with a 36-run win over #MumbaiIndians
— IndianPremierLeague (@IPL) April 24, 2022
Scorecard - https://t.co/O75DgQTVj0 #LSGvMI #TATAIPL pic.twitter.com/9aLniT8oHi
Comments
Please login to add a commentAdd a comment