
IPL 2022: అందరూ ధోని కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటారు.. కానీ నేను మాత్రం..
సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలక ఆటగాడిగా ఉన్న ఆఫ్గనిస్తాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ఐపీఎల్-2022 సీజన్‌లో కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడబోతున్నాడు. రిటెన్షన్ సమయంలో సన్‌రైజర్స్ ఈ స్పిన్నర్‌ను వదిలేయగా అహ్మదాబాద్ ఫ్రాంఛైజీ 15 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. ఇక తమ జట్టుకు గుజరాత్ టైటాన్స్‌గా నామకరణం చేసిన అహ్మదాబాద్ యాజమాన్యం.. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా నియమించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ సారథ్యంలో ఆడటం ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుందన్నాడు. అదే సమయంలో ఎంఎస్ ధోని కెప్టెన్సీపై కూడా కామెంట్ చేశాడు. మార్చి 26 నుంచి ఐపీఎల్ తాజా సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే 10 జట్ల ఆటగాళ్లు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీసులో తలమునకలవుతున్నారు.
ఈ క్రమంలో వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న రషీద్ ఖాన్.. ‘‘ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఆడాలనేది ప్రతి ఒక్క ఆటగాడి కల. అయితే, నేను ఇప్పుడు గుజరాత్‌కు ఆడుతున్నా. నా డ్రీమ్ టీమ్ ఇదే. ఇక్కడ నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి శాయశక్తులా కృషి చేస్తా. గుజరాత్‌కు ఆడటం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా.
హార్దిక్ పాండ్యా తొలిసారిగా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అతడి సారథ్యంలో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నిజానికి అందరూ ధోని కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటారు. అయితే, ముందుగా చెప్పినట్లు నాకు గుజరాత్ టైటాన్స్‌కు ఆడటమే గొప్ప’’ అని చెప్పుకొచ్చాడు.
ఇక ప్రపంచంలోని వివిధ క్రికెట్ జట్ల కెప్టెన్ల నేతృత్వంలో ఆడిన తాను అఫ్గనిస్తాన్‌కు సారథిగా వ్యవహరించిన అనుభవం ఉందన్న రషీద్.. హార్దిక్‌తో తన ఆలోచనలు పంచుకుంటానని స్పోర్ట్స్‌కీడా విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు. కాగా మరో కొత్త ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌జెయింట్స్ మార్చి 28న జరుగబోయే మ్యాచ్‌తో గుజరాత్ ఈ మెగా టోర్నీలో తమ ప్రయాణాన్ని ఆరంభించనుంది.
చదవండి: IPL 2022: ఇకపై అలా కుదరదు.. సింగిల్ తీస్తే కానీ..
■■■■■■■■■□□□ > 🪘🥁 > 💥 ft. Captain Pandya 😍#SeasonOfFirsts #AavaDe #TATAIPL
— Gujarat Titans (@gujarat_titans) March 22, 2022
[🎵: @xrim8] pic.twitter.com/WBzO1Sj26O