IPL 2022: టైటాన్స్‌ జోరుకు రైజర్స్‌ బ్రేక్‌ | IPL 2022: Sunrisers Hyderabad beat Gujarat Titans by eight wickets | Sakshi
Sakshi News home page

IPL 2022: టైటాన్స్‌ జోరుకు రైజర్స్‌ బ్రేక్‌

Published Tue, Apr 12 2022 4:31 AM | Last Updated on Tue, Apr 12 2022 7:47 AM

IPL 2022: Sunrisers Hyderabad beat Gujarat Titans by eight wickets - Sakshi

ముంబై: గత మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శనతో చెన్నైని ఓడించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అదే జోరును కొనసాగిస్తూ మరో విజయాన్ని అందుకుంది. తొలి మూడు మ్యాచ్‌లలో గెలిచి అజేయంగా నిలిచిన గుజరాత్‌ టైటాన్స్‌ను దెబ్బ తీసి మరో రెండు కీలక పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. సోమవారం జరిగిన పోరులో సన్‌రైజర్స్‌ 8 వికెట్ల తేడాతో టైటాన్స్‌పై విజయం సాధించింది. సీజన్‌లో కొత్త జట్టయిన గుజరాత్‌కు ఇదే తొలి ఓటమి.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (42 బంతుల్లో 50 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేయగా, అభినవ్‌ మనోహర్‌ (21 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. అనంతరం హైదరాబాద్‌ 19.1 ఓవర్లలో 2 వికెట్లకు 168 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ (46 బంతుల్లో 57; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీ సాధించగా, అభిషేక్‌ శర్మ (32 బంతుల్లో 42; 6 ఫోర్లు),  పూరన్‌ (18 బంతు ల్లో 34 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశారు.   

కీలక భాగస్వామ్యం...
భువీ వేసిన తొలి ఓవర్లోనే 17 పరుగులు రాబట్టి టైటాన్స్‌ శుభారంభం చేసింది. ఐపీఎల్‌ చరిత్రలో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో సన్‌రైజర్స్‌ ఇన్ని పరుగులివ్వడం ఇదే మొదటిసారి. అయితే భువీ తన రెండో ఓవర్లో ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌ (7)ను అవుట్‌ చేసి లెక్క సరిచేశాడు. సాయి సుదర్శన్‌ (11), మాథ్యూ వేడ్‌ (19), మిల్లర్‌ (12) ఎక్కువసేపు నిలవలేకపోగా,  కెప్టెన్‌ హార్దిక్, మనోహర్‌ కలిసి జట్టును ఆదుకున్నారు. ఈ క్రమంలో కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు నాలుగో వికెట్‌కు 32 బంతుల్లో 50 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యంతో 35 పరుగులు మనోహర్‌వే ఉన్నాయి. అతను ఇచ్చిన రెండు క్యాచ్‌లను మార్క్‌రమ్, త్రిపాఠి వదిలేయడం కూడా గుజరాత్‌కు కలిసొచ్చింది. చివరి ఓవర్లో తెవాటియా (6), రషీద్‌ (0) రూపంలో టైటాన్స్‌ రెండు వికెట్లు కోల్పోగా, 42 బంతుల్లో హార్దిక్‌ అర్ధ సెంచరీ పూర్తయింది.   

రాణించిన ఓపెనర్లు...
గత మ్యాచ్‌లాగే ఈసారి కూడా రైజర్స్‌కు ఓపెనర్లు శుభారంభం అందించారు. షమీ ఓవర్లో విలియమ్సన్‌ వరుసగా 4, 6 కొట్టగా... ఫెర్గూసన్‌ ఓవర్లో అభిషేక్‌ నాలుగు ఫోర్లు కొట్టడం విశేషం. తొలి వికెట్‌కు వీరిద్దరు 53 బంతుల్లో 64 పరుగులు జోడించారు. హార్దిక్‌ ఓవర్లో రెండు వరుస సిక్సర్లతో విలియమ్సన్‌ దూకుడు పెంచగా, గాయంతో రాహుల్‌ త్రిపాఠి (17 రిటైర్డ్‌హర్ట్‌) మధ్యలోనే తప్పుకున్నాడు. 42 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న హైదరాబాద్‌ కెప్టెన్, విజయానికి మరో 34 పరుగుల దూరంలో వెనుదిరిగాడు. అయితే పూరన్, మార్క్‌రమ్‌ (12 నాటౌట్‌) కలిసి మరో 5 బంతులు మిగిలి ఉండగానే జట్టును గెలిపించారు.

స్కోరు వివరాలు  
గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌: వేడ్‌ (ఎల్బీ) (బి) ఉమ్రాన్‌ 19; గిల్‌ (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్‌ 7; సుదర్శన్‌ (సి) విలియమ్సన్‌ (బి) నటరాజన్‌ 11; హార్దిక్‌ (నాటౌట్‌) 50; మిల్లర్‌ (సి) అభిషేక్‌ (బి) జాన్సెన్‌ 12; మనోహర్‌ (సి) త్రిపాఠి (బి) భువనేశ్వర్‌ 35; తెవాటియా (రనౌట్‌) 6; రషీద్‌ (బి) నటరాజన్‌ 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 162. వికెట్ల పతనం: 1–24, 2–47, 3–64, 4–104, 5–154, 6–161, 7–162. బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–37–2, జాన్సెన్‌ 4–0– 27–1, సుందర్‌ 3–0–14–0, నటరాజన్‌ 4–0–34 –2, ఉమ్రాన్‌ 4–0–39–1, మార్క్‌రమ్‌ 1–0–9–0.  

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: అభిషేక్‌ శర్మ (సి) సుదర్శన్‌ (బి) రషీద్‌ 42; విలియమ్సన్‌ (సి) తెవాటియా (బి) హార్దిక్‌ 57; రాహుల్‌ త్రిపాఠి (రిటైర్డ్‌హర్ట్‌) 17; పూరన్‌ (నాటౌట్‌) 34; మార్క్‌రమ్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.1 ఓవర్లలో 2 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–64, 1–104 (రిటైర్డ్‌హర్ట్‌), 2–129. బౌలింగ్‌: షమీ 4–0–32–0, హార్దిక్‌ 4–0–27–1, ఫెర్గూసన్‌ 4–0–46–0, రషీద్‌ 4–0–28–1, నల్కండే 2.1–0–22–0, తెవాటియా 1–0–10–0.

సన్‌రైజర్స్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 22 అదనపు పరుగులు (ఎక్స్‌ట్రాలు) సమర్పించుకుంది. ఇందులో 20 వైడ్‌లు ఉన్నాయి! ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒకసారి బెంగళూరు ఇంతకంటే ఎక్కువ వైడ్‌లు (21–ఇదే సీజన్‌లో పంజాబ్‌పై) ఇచ్చింది.

ఐపీఎల్‌లో నేడు
చెన్నై సూపర్‌ కింగ్స్‌ X బెంగళూరు
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement