Photo Courtesy: IPL
ముంబై: ఓడితే ఐపీఎల్‌లో ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు కోల్పోయే స్థితిలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సత్తా చాటింది. వరుసగా ఐదు పరాజయాల తర్వాత కీలక విజయంతో తమ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో హైదరాబాద్ 3 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది.
‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రాహుల్ త్రిపాఠి (44 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా... ప్రియమ్ గార్గ్ (26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 190 పరుగులు చేసి ఓడిపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (36 బంతుల్లో 48; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), టిమ్ డేవిడ్ (18 బంతుల్లో 46; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు.
కీలక భాగస్వామ్యాలు...
ఓపెనర్ అభిషేక్ శర్మ (9) వైఫల్యం తర్వాత రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు సన్‌రైజర్స్‌కు భారీ స్కోరును అందించాయి. త్రిపాఠి ఈ రెండింటిలోనూ భాగంగా ఉన్నాడు. గార్గ్‌తో రెండో వికెట్‌కు 78 పరుగులు (43 బంతుల్లో), పూరన్‌తో మూడో వికెట్‌కు 76 పరుగులు (42 బంతుల్లో) త్రిపాఠి జోడించాడు. త్రిపాఠి తన ఫామ్‌ను కొనసాగించగా, సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న గార్గ్ కూడా కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు.
బుమ్రా ఓవర్లో వరుస బంతుల్లో త్రిపాఠి 6, 4, 4 బాదగా... 10.1 ఓవర్లలోనే సన్‌రైజర్స్ స్కోరు 100 పరుగులకు చేరింది. పూరన్ కూడా దూకుడు ప్రదర్శించాడు. మెరిడిత్ ఓవర్లో వరుస సిక్సర్లు కొట్టిన అతను, మర్కండే వేసిన తర్వాతి ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. 32 బంతుల్లో త్రిపాఠి అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత మరింత చెలరేగిన త్రిపాఠి... స్యామ్స్ ఓవర్లో ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టాడు. అయితే మూడు పరుగుల వ్యవధిలో పూరన్, త్రిపాఠి, మార్క్‌రమ్ (2) వెనుదిరగడంతో హైదరాబాద్ జోరుకు బ్రేకులు పడ్డాయి.
భారీ ఓపెనింగ్...
ఛేదనలో ముంబైకి మెరుపు ఆరంభం లభించింది. రోహిత్, ఇషాన్ తొలి వికెట్‌కు 66 బంతుల్లోనే 95 పరుగులు జోడించారు. అయితే ఆరు పరుగుల తేడాతో రోహిత్, ఇషాన్‌లను అవుట్ చేసి రైజర్స్ పట్టు బిగించింది. తిలక్ వర్మ (8), స్యామ్స్ (15), స్టబ్స్ (2) విఫలం కావడంతో హైదరాబాద్ గెలుపు సులువే అనిపించింది. ముంబై 35 బంతుల్లో 71 పరుగులు చేయాల్సిన స్థితిలో టిమ్ డేవిడ్ చెలరేగిపోయాడు. నటరాజన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో అతను 4 సిక్సర్లతో బీభత్సం సృష్టించాడు.
అయితే స్ట్రయికింగ్‌ను కాపాడుకునే ప్రయత్నంలో అదే ఓవర్ చివరి బంతికి డేవిడ్ రనౌటవ్వడం ముంబై ఆశలను దెబ్బ తీసింది. 19వ ఓవర్లో ఒక్క పరుగూ ఇవ్వకుండా భువనేశ్వర్ సత్తా చాటాడు. ముంబైకి చివరి ఓవర్లో 19 పరుగులు కావాల్సి ఉండగా, తొలి మ్యాచ్ ఆడుతున్న ఆఫ్గాన్ పేసర్ ఫారుఖీ ఒత్తిడిని అధిగమించి జట్టును గెలిపించాడు.
స్కోరు వివరాలు:
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) మర్కండే (బి) స్యామ్స్ 9; గార్గ్ (సి అండ్ బి) రమణ్‌దీప్ 42; త్రిపాఠి (సి) తిలక్ వర్మ (బి) రమణ్‌దీప్ 76; పూరన్ (సి) మర్కండే (బి) మెరిడిత్ 38; మార్క్‌రమ్ (సి) డేవిడ్ (బి) రమణ్‌దీప్ 2; విలియమ్సన్ (నాటౌట్) 8; సుందర్ (బి) బుమ్రా 9; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1–18, 2–96, 3–172, 4–174, 5–175, 6–193. బౌలింగ్: సామ్స్ 4–0–39–1, మెరిడిత్ 4–0–44– 1, సంజయ్ 2–0–23–0, బుమ్రా 4–0– 32–1, మర్కండే 3–0–31–0, రమణ్‌దీప్ 3–0–20–3.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) (సబ్) సుచిత్ (బి) సుందర్ 48; ఇషాన్ (సి) గార్గ్ (బి) ఉమ్రాన్ 43; స్యామ్స్ (సి) గార్గ్ (బి) ఉమ్రాన్ 15; తిలక్ (సి) విలియమ్సన్ (బి) ఉమ్రాన్ 8; డేవిడ్ (రనౌట్) 46; స్టబ్స్ (రనౌట్) 2; రమణ్‌దీప్ (నాటౌట్) 14; సంజయ్ (సి) (సబ్) సుచిత్ (బి) భువనేశ్వర్ 0; బుమ్రా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 190. వికెట్ల పతనం: 1–95, 2–101, 3–123, 4–127, 5–144, 6–175, 7–175. బౌలింగ్: ఫారుఖీ 4–0–31–0, భువనేశ్వర్ 4–1–26–1, సుందర్ 4–0–36–1, నటరాజన్ 4–0–60–0, ఉమ్రాన్ 3–0–23–3, అభిషేక్ శర్మ 1–0–10–0.
Comments
Please login to add a commentAdd a comment