లక్నో సూపర్ జెయింట్స్ జట్టు(PC: IPL/BCCI)
IPL 2023- Lucknow Super Giants: ఐపీఎల్-2023 టోర్నీ ఆరంభానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు ఎదురుదెబ్బ తగిలింది. లక్నో స్టార్ పేసర్ మొహ్సిన్ ఖాన్ జట్టుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఎడమ భుజానికి గాయమైన నేపథ్యంలో మొహ్సిన్ గతేడాది సర్జరీ చేయించుకున్నాడు. చికిత్సలో భాగంగా బ్లడ్ క్లాట్స్ తొలగించినప్పటికీ అతడు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోనట్లు సమాచారం.
ఈ క్రమంలో ఐపీఎల్ 16వ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు మొహ్సిన్ ఖాన్ దూరం కానున్నట్లు ఈఎస్‌పీఎన్ కథనం పేర్కొంది. కాగా అన్‌క్యాప్డ్ పేసర్ మొహ్సిన్ ఖాన్ గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
పొదుపైన బౌలింగ్‌తో
లక్నో తరఫున బరిలోకి దిగిన అతడు తొమ్మిది మ్యాచ్‌లలో 5.97 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్‌లో అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 4/16. కీలక సమయంలో రాణించిన మొహ్సిన్ ఖాన్ జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అరంగేట్ర సీజన్‌లోనే లక్నో ప్లే ఆఫ్స్ చేరడంలో తన వంతు సహాయం అందించాడు.
అయితే, సీజన్ ఆఖర్లో భుజం నొప్పితో జాతీయ క్రికెట్ అకాడమీకి చేరిన మొహ్సిన్ అక్కడే చికిత్స పొందాడు. ఈ క్రమంలో ఐపీఎల్-2023కు సిద్ధమవుతున్న జట్టుతో చేరిన అతడు.. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ఇంతవరకు బౌలింగ్ మాత్రం చేయలేదు.
ఇదిలా ఉంటే ఇప్పటికే మొహ్సిన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు లక్నో జయదేవ్ ఉనాద్కట్‌ను సిద్ధం చేసింది. గతేడాది వేలంలో భాగంగా ఈ సౌరాష్ట్ర పేసర్‌ను దక్కించుకుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌తో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ తమ ప్రయాణం ఆరంభించనుంది.
యూపీ నుంచి వచ్చి..
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌కు చెందిన మొహ్సిన్ ఖాన్ 2019లోనే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అయితే, మూడు సీజన్ల పాటు అతడు బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. ఈక్రమంలో తీవ్ర నిరాశకు గురైనప్పటికీ.. ముంబై వంటి మేటి జట్టులో అంత సులువుగా అవకాశం దక్కదు కాబట్టి తన ఆటను మెరుగుపర్చుకోవడంపైనే దృష్టి పెట్టాడు మొహ్సిన్ ఖాన్.
ఈ నేపథ్యంలో లక్నో రూపంలో అదృష్టం తలుపుతట్టింది. ఈ జట్టులోనూ ఆరంభ మ్యాచ్‌లలో అవకాశం రానప్పటికీ.. ఓపికగా ఎదురుచూశాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయితే, ఇప్పుడు గాయం కారణంగా మరోసారి ఆటకు దూరమయ్యే పరిస్థితి తలెత్తింది.
చదవండి: ఐపీఎల్-2023కు దూరం కానున్న స్టార్ ఆటగాళ్లు వీరే..!
WC Super League Standings: శ్రీలంక ఆశలు ఆవిరి.. టాప్‌కు చేరిన న్యూజిలాండ్
Comments
Please login to add a commentAdd a comment