IPL 2023: Virender Sehwag Drops A Massive Advice For Tilak Varma - Sakshi
Sakshi News home page

IPL 2023: సూర్యను చూసి నేర్చుకో.. నాకు దాదా ఆరోజు అలా చెప్పాడు.. తిలక్‌ నువ్వు కూడా!

Published Sun, May 28 2023 12:36 PM | Last Updated on Sun, May 28 2023 1:43 PM

IPL 2023 Sehwag Enormous Ganguly Advice For Tilak Varma He Reminds Me - Sakshi

తిలక్‌ వర్మ (PC: IPL)

IPL 2023- Tilak Varma: ఐపీఎల్‌-2022 సీజన్‌తో క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అడుగుపెట్టాడు తెలుగు తేజం తిలక్‌ వర్మ. ముంబై ఇండియన్స్‌ తరఫున అరంగేట్రం చేసిన అతడు తొలి సీజన్‌లోనే అదరగొట్టాడు. 14 మ్యాచ్‌లు ఆడి 397 పరుగులతో ముంబై తరఫున రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఈ హైదరాబాదీ బ్యాటర్‌పై అంచనాలు పెరిగిపోయాయి.

ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా
అందుకు తగ్గట్లుగానే ఐపీఎల్‌-2023 ఆరంభంలో ఆకట్టుకున్న తిలక్‌ వర్మ.. గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరం కావాల్సి వచ్చింది. ఫిట్‌నెస్‌ సమస్యల కారణంగా తిలక్‌ అందుబాటులో లేకపోవడం జట్టుపై ప్రభావం చూపింది. 

కీలక మ్యాచ్‌లో దుమ్ములేపాడు
అయితే, కీలక మ్యాచ్‌ క్వాలిఫయర్‌-2 నేపథ్యంలో జట్టులోకి తిరిగి వచ్చిన తిలక్‌ వర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కీలక మ్యాచ్‌లో 234 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ తడబడిన వేళ తిలక్‌ తుపాన్ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతడు.. 14 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు సాధించాడు.

కానీ అప్పటికే
కానీ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో తిలక్‌ వెనుదిరగడంతో ముంబై కథ ముగిసిపోయింది. 171 పరుగులకే ఆలౌట్‌ అయిన రోహిత్‌ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2023లో మొత్తంగా 11 మ్యాచ్‌లు ఆడిన తిలక్‌ 343 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 84 నాటౌట్‌.

ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌.. హైదరాబాదీ క్రికెటర్‌ తిలక్‌ వర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ యువ బ్యాటర్‌ ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాల్సి ఉందంటూ పలు సూచనలు, సలహాలు ఇచ్చాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌ షోలో మాట్లాడుతూ.. ‘‘తిలక్‌ వర్మ ప్రధానంగా రెండు అంశాలపై దృష్టి పెట్టాలి.

సూర్యను చూసి నేర్చుకోవాలి 
తన నైపుణ్యాలకు మరింత పదునుపెట్టాలి. అదే విధంగా మైండ్‌సెట్‌లోనూ మార్పు రావాలి. ముఖ్యంగా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వహించాలి. ఈ విషయంలో సూర్యకుమార్‌​ యాదవ్‌ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది.  తను కాస్త విరామం దొరికినా వైవిధ్యమైన షాట్లు ప్రాక్టీసు చేస్తూ నైపుణ్యాలు మెరుగుపరచుకుంటూ ఉంటాడు.

నాకు దాదా ఇచ్చిన సలహా
తిలక్‌ వర్మ తన బలహీనతలపై కూడా దృష్టి సారించి వాటిని అధిగమించేలా నిరంతరం శ్రమించాలి. నేను 1999లో తొలిసారి టీమిండియాకు ఆడినపుడు షోయబ్‌ అక్తర్‌ నన్ను అవుట్‌ చేశాడు. నేను నా బ్యాట్‌తో బంతిని టచ్‌ చేసే లోపే.. బాల్‌ నా ప్యాడ్లను తాకింది. అప్పుడు దాదా (సౌరవ్‌ గంగూలీ) నాకో సలహా ఇచ్చాడు.

తిలక్‌ కూడా నాలాగే
ఫాస్ట్‌బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చెయ్‌. అప్పుడే నువ్వు మైదానంలో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలవు. అప్పట్లో నేను మిడిలార్డర్‌లో ఆడేవాడిని. ఎక్కువగా స్పిన్‌ బౌలర్లను ఎదుర్కొనే వాడిని. తర్వాత ఫాస్ట్‌బౌలర్ల బౌలింగ్‌లో ఎలా ఆడాలో పూర్తిగా అవగాహన వచ్చింది.

నాలాగే తిలక​ వర్మ కూడా తన బలహీనతలు ఏమిటో తెలుసుకుని.. వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగాలి’’ అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు. తిలక్‌ వర్మకు మంచి భవిష్యత్తు ఉందని.. అయితే, చిన్న చిన్న లోపాలు సరిచేసుకోవడంపై దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత కూడా ఉందని వీరూ భాయ్‌.. తిలక్‌కు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. 

చదవండి: WTC Final: రుతురాజ్‌ అవుట్‌.. యశస్వి జైశ్వాల్‌కు బంపరాఫర్‌! ద్రవిడ్‌ విజ్తప్తి మేరకు..
వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదలకు ముహూర్తం ఫిక్స్‌.. జై షా కీలక ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement