ఐపీఎల్‌లో ఇవాళ (ఏప్రిల్ 24) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఢిల్లీ తమ సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్‌ను ఢీకొట్టనుంది. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం గుజరాత్, ఢిల్లీ పాయింట్ల పట్టికలో ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉంటూ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఢిల్లీతో పోలిస్తే గుజరాత్‌కు ప్లే ఆఫ్స్ అవకాశాలు కాస్త మెరుగ్గా ఉన్నాయి. గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి 8 పాయింట్లు కూడగట్టుకుంది. ఢిల్లీ ఎనిమిదిలో మూడు మ్యాచ్‌లు మత్రమే గెలిచి ఆరు పాయింట్లతో గుజరాత్ కంటే వెనుకపడింది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ గెలవాల్సి ఉంది. గుజరాత్‌కు ఓ మ్యాచ్ అటో ఇటో అయినా పర్లేదు కానీ, ఢిల్లీ మాత్రం అన్ని మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. చెరి రెండు మ్యాచ్‌లు గెలిచాయి. ఢిల్లీ గెలుపొందిన రెండు మ్యాచ్‌లు గుజరాత్ హోం గ్రౌండ్ అయిన అహ్మదాబాద్‌లోనే కావడం విశేషం.
బలాబలాల విషయానికొస్తే.. ఈ సీజన్‌లో ఇరు జట్ల ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఢిల్లీతో పోలిస్తే గుజరాత్ ఒకింత మెరుగ్గా కనిపిస్తుంది. తెవాతియా, రషీద్ ఖాన్ కీలక సమయాల్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి గుజరాత్ విజయాల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నారు. నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, సాయి కిషోర్ బంతితో పర్వాలేదనిపిస్తున్నారు. గిల్, మిల్లర్ సామర్థ్యం మేరకు రాణించాల్సి ఉంది.
ఢిల్లీ విషయానికొస్తే.. ఈ జట్టు పేపర్‌పై చాలా బలంగా కనిపిస్తుంది. రియాల్టీలోకి వచ్చేసరికి మాత్రం పూర్తిగా తేలిపోతుంది. వార్నర్ లాంటి సీనియర్ ఫామ్‌లో లేకపోవడం ఢిల్లీకి పెద్ద మైనస్‌గా మారింది. పృథ్వీ షాకు మంచి ఆరంభాలు లభిస్తున్నా అతను వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. చెత్త షాట్లు ఆడి వికెట్ పారేసుకుంటున్నాడు. కొత్త ఆటగాడు జేక్ ఫ్రేసర్, రిషబ్ పంత్ బ్యాటింగ్ మెరుపులు ఢిల్లీకి ఊరట కలిగిస్తున్నాయి.
ఢిల్లీ ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే వీరిద్దరి కాంట్రిబ్యూషన్ చాలా కీలకం. బౌలింగ్ విషయానికొస్తే.. కుల్దీప్, అక్షర్ మినహా ఎవరూ రాణించలేకపోతున్నారు. నోర్జే అయితే ధారాళంగా పరుగులు సమర్పించుకుంటూ ఢిల్లీ ఓటముల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ పర్వాలేదనిపిస్తున్నా వీరి నుంచి పెద్దగా ప్రయోజనం లేకుండా పోతుంది. మొత్తంగా చూస్తే.. ఢిల్లీపై గుజరాత్‌కే విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
తుది జట్లు (అంచనా)..
ఢిల్లీ: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్ట్జే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్
గుజరాత్: వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment