ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం | IPL 2024: Glenn Maxwell Might Miss RCB Next Match Vs SRH Due To Thumb Injury | Sakshi
Sakshi News home page

IPL 2024: వరుస ఓటమలు ఎదుర్కొంటున్న ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ.. విధ్వంసకర వీరుడికి గాయం

Published Fri, Apr 12 2024 12:46 PM | Last Updated on Fri, Apr 12 2024 3:42 PM

IPL 2024: Glenn Maxwell Might Miss RCB Next Match Vs SRH Due To Thumb Injury - Sakshi

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో వరుస ఓటమలు ఎదుర్కొంటూ పాయింట్ల పట్టికలో అట్టడుగు (తొమ్మిది) స్థానంలో ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు గాయమైనట్లు తెలుస్తుంది. ముంబై ఇండియన్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 11) జరిగిన మ్యాచ్‌ సందర్భంగా మ్యాక్సీ ఎడమ చేతి బొటన వేలికి గాయమైనట్లు సమాచారం.

ఆర్సీబీ తదుపరి ఆడబోయే మ్యాచ్‌లో (సన్‌రైజర్స్‌తో) మ్యాక్స్‌వెల్‌ ఆడటం అనుమానమేనని ఆర్సీబీ వర్గాలు చెబుతున్నాయి. మ్యాక్స్‌వెల్‌ లేకపోతే వరుస ఓటమలు ఎదుర్కొంటున్న ఆర్సీబీ కష్టాలు మరింత ఎక్కువవుతాయి. ఈ సీజన్‌లో ఆర్సీబీ ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం ఒ‍కే ఒక విజయం సాధించింది. ఆర్సీబీ తరఫున విరాట్‌ ఒక్కడే బాగా ఆడుతున్నాడు.

జట్టులో మిగతా బ్యాట్లంతా కలిపి విరాట్‌ చేసినన్ని పరుగులు చేయలేదు. దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్దమవుతుంది. ఆర్సీబీ బౌలింగ్‌ టీమ్‌ విషయానికొస్తే.. ఐపీఎల్‌ చరిత్రలోనే ఇది అత్యంత చెత్త బౌలింగ్‌ టీమ్‌గా కనిపిస్తుంది. 

కాగా, ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో అతను ఆరు మ్యాచ్‌లు ఆడి కేవలం 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో మూడు డకౌట్లు కూడా ఉన్నాయి. 

ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. డుప్లెసిస్‌ (40 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రజత్‌ పాటిదార్‌ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), దినేశ్‌ కార్తీక్‌ (53 నాటౌట్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. బుమ్రా ఐదు వికెట్ల ప్రదర్శనతో (4-0-21-5) చెలరేగాడు.

అనంతరం 197 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై.. ఇషాన్‌ కిషన్‌ (39 బంతుల్లో 69; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 38; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (19 బంతుల్లో 52; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్‌ పాండ్యా (6 బంతుల్లో 21 నాటౌట్‌; 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో 15.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఆర్సీబీ బౌలర్లు మరోసారి చెత్త ప్రదర్శన చేసి గెలిచే మ్యాచ్‌ను ఓడేలా చేశారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement