IPL 2024: చెత్త రికార్డు మూటగట్టు​కున్న పంజాబ్‌ | IPL 2024, PBKS vs RR: Punjab Kings Lost Most Matches At Home And Neutral Venues In IPL History | Sakshi
Sakshi News home page

IPL 2024 PBKS VS RR: చెత్త రికార్డు మూటగట్టు​కున్న పంజాబ్‌

Published Sun, Apr 14 2024 1:00 PM | Last Updated on Sun, Apr 14 2024 1:22 PM

IPL 2024 PBKS VS RR: Punjab Kings Lost Most Matches At Home And Neutral Venues In IPL History - Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 13) రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 3 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. పంజాబ్‌ వరుసగా రెండో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో ఓటమి చవి చూసింది. దీనికి ముందు సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పంజాబ్‌ చివరి బంతి వరకు పోరాడి ఓడింది. ఈ సీజన్‌లో పంజాబ్‌ మ్యాచ్‌ ఫలితాలన్ని చివరి ఓవర్‌లో వచ్చినవే కావడం విశేషం. ఢిల్లీ, గుజరాత్‌లపై చివరి ఓవర్‌లో గెలిచిన పంజాబ్‌.. ఆర్సీబీ, సన్‌రైజర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ చేతిలో చివరి ఓవర్‌లో ఓటమిపాలైంది. తాజాగా ఓటమితో పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకుంది. 

హోం గ్రౌండ్‌లో అత్యధిక పరాజయాలు ఎదుర్కొన్న జట్టుగా ఢిల్లీ పేరిట ఉండిన చెత్త రికార్డును అధిగమించింది. హోం గ్రౌండ్‌లో ఢిల్లీ 72 పరాజయాలు ఎదుర్కోగా.. పంజాబ్‌ తాజా ఓటమితో కలుపుకుని మొత్తం 73 మ్యాచ్‌ల్లో ఓడింది. ఈ జాబితాలో ఆర్సీబీ (67 పరాజయాలు) మూడో స్థానంలో ఉంది. 

రాయల్స్‌తో మ్యాచ్‌ విషయానికొస్తే.. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు​ కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. ఆఖర్లో అశుతోష్‌ శర్మ (16 బంతుల్లో 31; ఫోర్‌, 3 సిక్సర్లు) బ్యాట్‌ను ఝులిపించడంతో పంజాబ్‌ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది. రాయల్స్‌ బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో పంజాబ్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. 

అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో రాయల్స్‌ కూడా తడబడింది. హెట్‌మైర్‌ చివరి ఓవర్‌లో రెండు సిక్సర్లు బాది రాయల్స్‌ను గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ మరో బంతి మిగిలుండగా విజయతీరాలకు చేరింది. రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు లేవు. 39 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్‌ టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్‌ బౌలర్లలో రబాడ (4-0-18-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement