
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్ 11) బిగ్ ఫైట్ జరుగనుంది. ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ సొంత మైదానమైన వాంఖడేలో ఆర్సీబీతో తలపడనుంది. ఇరు జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పేపర్‌పై ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నప్పటికీ ఈ సీజన్‌లో రెండు జట్ల ప్రదర్శన పేలవంగా ఉంది. పాయింట్ల పట్టికలో ముంబై ఎనిమిది, ఆర్సీబీ తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. ముంబై ఈ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడగా.. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో గెలిచింది. ఆర్సీబీ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జట్టు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక విజయం సాధించింది.
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 18, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఓవరాల్‌గా ఆర్సీబీపై ముంబై ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ గత ఐదు మ్యాచ్‌ల్లో పరిస్థితి వేరేలా ఉంది. ఈ రెండు చివరిగా తలపడిన ఐదు సందర్భాల్లో నాలుగు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధించింది. కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో ముంబై గెలుపొందింది.
బలాబలాలను పరిశీలిస్తే.. ప్రస్తుత సీజన్‌లో ఆర్సీబీ కంటే ముంబై పరిస్థితే మెరుగ్గా కనిపిస్తుంది. ఈ జట్టులో ఆటగాళ్లు కనీసం గెలుపు కోసం ప్రయత్నమైనా చేస్తున్నారు. ఆర్సీబీ మాత్రం విరాట్ కోహ్లి ఒక్కడిపైనే ఆధారపడి ఉంది. జట్టులో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్, గ్రీన్ లాంటి విదేశీ స్టార్లు ఉన్నా వీరు ఒక్క మ్యాచ్‌లో కూడా స్థాయి తగ్గ ప్రదర్శన చేయలేదు.
బౌలింగ్ విషయానికొస్తే.. ఆర్సీబీ బౌలింగ్ విభాగం పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. జట్టులో చెప్పుకోదగ్గ బౌలర్ ఒక్కరు కూడా లేరు. పొడిచేస్తాడనున్న అల్జరీ జోసఫ్ తుస్సుమనిపిస్తుండగా.. సిరాజ్ సాధారణ బౌలర్ కంటే దారుణంగా తయారయ్యాడు.
ముంబై పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈ జట్టులోని ప్రతి ఆటగాడు తమపాత్రకు న్యాయం చేస్తున్నారు. కలిసికట్టుగా ఆడలేక ఆ జట్టు వరుస ఓటములు ఎదుర్కొంది కానీ.. వ్యక్తిగత ప్రదర్శనల వరకైతే ఒకే అని చెప్పవచ్చు. రోహిత్, ఇషాన్, సూర్యకుమార్, హార్దిక్, తిలక్ వర్మ, బుమ్రా.. ఇలా సగం టీమిండియా ముంబైలోనే ఉంది. టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్ లాంటి విదేశీ మెరుపులు ఉండనే ఉన్నాయి. స్పీడ్ గన్ గెరాల్డ్ కొయెట్జీ మాంచి టచ్‌లో ఉన్నాడు. ఇన్ని అనుకూలతల నడుమ నేటి మ్యాచ్‌లో ఆర్సీబీపై ముంబైదే పైచేయి అయ్యే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా).. నేటి మ్యాచ్‌లో ఇరు జట్లు రెండు మార్పులు చేసే అవకాశం ఉంది. ఆర్సీబీ విల్ జాక్స్‌ను, ముంబై లూక్ వుడ్‌ను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, పీయూష్ చావ్లా, లూక్ వుడ్, గెరాల్డ్ కోయెట్జీ, జస్ప్రీత్ బుమ్రా
ఆర్సీబీ: డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్ (వికెట్‌కీపర్), విల్ జాక్స్, మయాంక్ దాగర్, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్
Comments
Please login to add a commentAdd a comment