ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్ ప్రారంభానికి ముందు రోజు ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ధోని స్థానంలో కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ఎంపిక చేసింది. ధోని ఇష్టపూర్వకంగానే కెప్టెన్సీ నుంచి వైదొలిగినట్లు సమాచారం.
కాగా, కెప్టెన్సీ నుంచి తప్పుకునే విషయాన్ని ధోని కొద్ది రోజుల ముందే పరోక్షంగా వెల్లడించాడు. 2024 సీజన్‌లో తనను కొత్త పాత్రలో చూడబోతున్నారంటూ లీకులు ఇచ్చాడు. అంతిమంగా ధోని చెప్పిందే నిజమైంది. అతని స్థానంలో యువ నాయకుడు రుతురాజ్ సీఎస్‌కేను ముందుండి నడిపించనున్నాడు.
ఇదిలా ఉంటే, క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో రేపు రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా..?
కెప్టెన్సీని స్వచ్ఛందంగా రుతురాజ్‌కు బదిలీ చేసిన ధోని.. రేపటి నుంచి ప్రారంభంకాబోయే సీజన్‌లో సాధారణ ఆటగాడిగా అయినా కొనసాగుతాడా లేదా అని అభిమానులు చర్చించుకుంటున్నారు. సీజన్ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే.. తమ సొంత మైదానమైన చెపాక్‌లో ఆర్సీబీతో తలపడనుంది.
విశ్లేషకుల అభిప్రాయం మేరకు.. దిగ్గజ ధోని తన ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలికేందుకు ఇంతకంటే అనువైన సందర్భమేముంటుంది. సొంత మైదానం.. ఛాలెంజింగ్ ప్రత్యర్ధి.. రేపటి మ్యాచ్‌లో ధోని బరిలోకి దిగి తన క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశముంది. రిటైరయ్యాక ధోని సీఎస్‌కే మెంటార్‌గా కొనసాగవచ్చు.
2019 నుంచి సీఎస్‌కేతోనే..
సీఎస్‌కే నూతన కెప్టెన్ రుతురాజ్ 2019 నుంచి ఈ ఫ్రాంచైజీతోనే ఉన్నాడు. రుతు సీఎస్‌కే తరఫున 52 మ్యాచ్‌లు ఆడి 135.5 స్ట్రయిక్‌రేట్‌తో సెంచరీ, 14 హాఫ్ సెంచరీల సాయంతో 1797 పరుగులు చేశాడు.
2021లో రుతురాజ్ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోగా.. ఆ సీజన్‌లో సీఎస్‌కే నాలుగో సారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచింది. 27 ఏళ్ల రతురాజ్ టీమిండియా తరఫున 6 వన్డేలు, 19 టీ20లు ఆడి సెంచరీ, 4 హాఫ్ సెంచరీల సాయంతో 615 పరుగులు చేశాడు. రుతురాజ్ మహారాష్ట్రలోని పూణేలో జన్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment