IPL 2025: ‘విన్‌’రైజర్స్‌ అయ్యేనా! | IPL 2025: Explore all information about Sunrisers Hyderabad 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025: ‘విన్‌’రైజర్స్‌ అయ్యేనా!

Published Tue, Mar 18 2025 4:49 AM | Last Updated on Tue, Mar 18 2025 4:49 AM

IPL 2025: Explore all information about Sunrisers Hyderabad 2025

రెండో టైటిల్‌పై గురి పెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌

దూకుడే మంత్రంగా బరిలోకి ప్యాట్‌ కమిన్స్‌ బృందం

ట్రావిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మ, క్లాసెన్, నితీశ్‌ రెడ్డిపై భారీ ఆశలు

మరో 4 రోజుల్లో ఐపీఎల్‌ 

మొదట ఓ మాదిరి స్కోరు చేయడం... ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌తో దాన్ని కాపాడుకోవడం ఇది ఒకప్పుడు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు తీరు! 
కానీ గతేడాది బౌలింగ్‌ బలాన్ని పక్కన పెట్టిన రైజర్స్‌... బ్యాటింగ్‌తో లీగ్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఒకటికి మూడుసార్లు 250 పైచిలుకు పరుగులు  చేసిన సన్‌రైజర్స్‌... ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా...  పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు పిండుకున్న టీమ్‌గా రికార్డుల్లోకెక్కింది!! 

లీగ్‌ ఆసాంతం రాణించిన బ్యాటర్లు ఆఖర్లో విఫలమవడంతో గత సీజన్‌లో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకున్న హైదరాబాద్‌  ఫ్రాంచైజీ ఈసారి కప్పు కొట్టాలని  కృతనిశ్చయంతో ఉంది. కమిన్స్‌ కెప్టేన్సీకి...  అభిషేక్‌ శర్మ, హెడ్‌ ఆరంభ మెరుపులు... క్లాసన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఫినిషింగ్‌ టచ్‌ తోడైతే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఆపడం ప్రత్యర్థులకు శక్తికి మించిన పనే!!! 
–సాక్షి క్రీడావిభాగం  

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో నాణ్యమైన బౌలింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టు... గతేడాది  అందుకు పూర్తి భిన్నంగా బాదుడే పరమావధిగా విజృంభించి కొత్త గుర్తింపు తెచ్చుకుంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ సాగించిన విధ్వంసకాండ మాటలకు అందనిది. అరాచకం అనే పదానికి అర్థం మార్చుతూ... ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తూ సన్‌రైజర్స్‌ బ్యాటర్లు సాగించిన ఊచకోత గురించి ఎంత చెప్పినా తక్కువే! ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు వంతులు వేసుకొనిమరీ వీరబాదుడు బాదడంతోనే రైజర్స్‌... లీగ్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు తమ పేరిట లిఖించుకుంది. 

ట్రావిస్‌ హెడ్, అభిషేక్‌ శర్మ, హెన్రిచ్‌ క్లాసెన్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి... ఈ ‘రన్‌’ చతుష్టయానికి ఇప్పుడు మరో పిడుగు తోడయ్యాడు. ‘పాకెట్‌ డైనమైట్‌’ ఇషాన్‌ కిషన్‌ ఈ ఏడాది నుంచి రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇప్పటికే హిట్టర్లతో దట్టంగా ఉన్న హైదరాబాద్‌ బ్యాటింగ్‌ లైనప్‌... ఇషాన్‌ రాకతో మరింత రాటుదేలనుంది. వేలంలో అత్యధికంగా 25 మందిని తీసుకునే అవకాశం ఉన్నా... కేవలం 20 మంది ప్లేయర్లనే కొనుగోలు చేసుకున్న రైజర్స్‌... అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల కోసమే భారీగా ఖర్చు పెట్టింది. క్లాసెన్‌కు రూ. 23 కోట్లు, కెప్టేన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు రూ. 18 కోట్లు... అభిషేక్‌ శర్మ, హెడ్‌లకు రూ. 14 కోట్ల చొప్పున  ఇచ్చిన రైజర్స్‌... రూ. 6 కోట్లకు నితీశ్‌ కుమార్‌ రెడ్డిని కొనసాగించింది. 2016లో తొలిసారి టైటిల్‌  సాధించిన ఎస్‌ఆర్‌హెచ్‌... 2018, 2024లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌ దళాన్ని కూడా మరింత పటిష్ట  పరుచుకున్న హైదరాబాద్‌... రెండోసారి కప్పు  చేజక్కించుకోవాలని తహతహలాడుతోంది.  

నాలుగో ఆటగాడు ఎవరో? 
కెప్టేన్‌ కమిన్స్‌తో పాటు క్లాసెన్, హెడ్‌ తుది జట్టులో ఉండటం ఖాయమే కాగా... గతేడాది నాలుగో విదేశీ ప్లేయర్‌గా మార్క్‌రమ్‌ను ఎంచుకుంది. అయితే ఈసారి మాత్రం ఆడమ్‌ జాంపా, ముల్డర్, కమిందు మెండిస్‌ రూపంలో పరిమిత వనరులే ఉన్నాయి. దీంతో హెడ్‌ కోచ్‌ డానియల్‌ వెటోరీ... ఆసీస్‌ స్పిన్నర్‌ జాంపా వైపే మొగ్గుచూపే అవకాశాలున్నాయి. అయితే రాహుల్‌ త్రిపాఠి, అబ్దుల్‌ సమద్, షాబాజ్‌ అహ్మద్‌ వంటి దేశీయ ఆటగాళ్లు ఈసారి అందుబాటులో లేకపోవడం రైజర్స్‌కు ప్రతిబంధకంగా మారింది. అభినవ్‌ మనోహర్, అనికేత్‌ వర్మ, అథర్వ తైడె, సచిన్‌ బేబీకి తుది జట్టులో అవకాశం దక్కుతుందో లేదో వేచి చూడాలి.

 గత సీజన్‌లో తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఐదింట నెగ్గి ఆరంభంలోనే ఆధిపత్యం కనబర్చిన హైదరాబాద్‌ జట్టు... పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు  చేరింది. క్వాలిఫయర్‌–1లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓడిన  రైజర్స్‌... క్వాలిఫయర్‌–2లో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలిచినా... ఫైనల్లో మరోసారి కోల్‌కతా చేతిలోనే ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. తమదైన రోజులో అరవీర భయంకరంగా రెచ్చిపోయి రికార్డులు తిరగరాసే రైజర్స్‌... టాపార్డర్‌ విఫలమైతే మాత్రం తేలిపోతోందని గత సీజన్‌తోనే అర్థమైంది. దీంతో ఈసారి ఎలాంటి ప్రణాళికతో ముందడుగు వేస్తుందో చూడాలి.  

షమీ రాకతో రాత మారేనా! 
సుదీర్ఘ కాలంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలింగ్‌ తురుపుముక్కగా ఉన్న భువనేశ్వర్‌ కుమార్‌తో పాటు యార్కర్‌ కింగ్‌ నటరాజన్‌ను వదిలేసుకున్న జట్టు... గతేడాది వేలంలో టీమిండియా సీనియర్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ, హర్షల్‌ పటేల్‌లను ఎంపిక చేసుకుంది. కమిన్స్, జైదేవ్‌ ఉనాద్కట్‌లకు ఈ ఇద్దరూ తోడవడంతో మన బౌలింగ్‌ మరింత రాటుదేలనుంది. 

అవకాశం వస్తే పేస్‌ బౌలింగ్‌ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆంధ్ర ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఉండనే ఉన్నాడు. ఆడమ్‌ జాంపా, రాహుల్‌ చహర్‌ స్పిన్‌ బాధ్యతలు మోయనున్నారు. అయితే తుది 11 మందితో కూడిన జట్టులో అనికేత్‌ వర్మ,  అభినవ్‌ మనోహర్, సచిన్‌ బేబీలలో ఇద్దరికి అవకాశం దక్కొచ్చు. రైజర్స్‌ తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న వీరు కూడా మేనేజ్‌మెంట్‌ అంచనాలను అందుకుంటే జట్టుకు తిరుగుండదు. 

పవర్‌ప్లేలో జట్టుకు వికెట్లు అందించాల్సిన బాధ్యత మాత్రం షమీపైనే  ఉంది. 2022, 2023 సీజన్‌లలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన షమీ... గాయం నుంచి తిరిగి వచ్చిన అనంతరం అదే తీవ్రత కొనసాగిస్తే జట్టుకు అదనపు బలం చేకూరినట్లే. గాయం కారణంగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి దూరమైన ఆ్రస్టేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ సుదీర్ఘ విరామం తర్వాత టి20 ఫార్మాట్‌లో బరిలోకి దిగనున్నాడు. అతడు జట్టును ఎలా నడిపిస్తాడనేది కీలకం. గాయంతో జట్టుకు దూరమైన కార్స్‌ స్థానంలో దక్షిణాఫ్రికా ప్లేయర్‌ ముల్డర్‌ను రైజర్స్‌ ఎంపిక చేసుకుంది. 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు: కమిన్స్‌ (కెప్టేన్‌), ట్రావిస్‌ హెడ్, హెన్రిచ్‌ క్లాసెన్, అభిషేక్‌ శర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఇషాన్‌ కిషన్, అథర్వ తైడె, అభినవ్‌ మనోహర్, అనికేత్‌ వర్మ, సచిన్‌ బేబీ, హర్షల్‌ పటేల్, కమిందు మెండిస్, ముల్డర్, షమీ, రాహుల్‌ చాహర్, ఆడమ్‌ జాంపా, సిమర్‌జీత్‌ సింగ్, జీషాన్‌ అన్సారీ, జైదేవ్‌ ఉనాద్కట్, ఇషాన్‌ మలింగ. 
అంచనా: గతేడాది కళ్లుచెదిరే ఆటతీరుతో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌... ఈసారి కూడా హిట్టర్లు దంచికొడితే ప్లే ఆఫ్స్‌ చేరడం దాదాపు ఖాయమే!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement