
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో ఇవాళ (మార్చి 24) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. విశాఖ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కత్తులు దూసుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, ఢిల్లీ 2 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఢిల్లీ ఎల్‌ఎస్‌జీపై సాధించిన రెండు విజయాలు గత సీజన్‌లో వచ్చినవే. నేటి మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖ పిచ్ బ్యాటంగ్‌కు స్వర్గధామమని చెప్పవచ్చు. గత సీజన్‌లో ఇక్కడ జరిగిన ఓ మ్యాచ్‌లో కేకేఆర్ రికార్డు స్థాయిలో 272 పరుగులు చేసింది.
గత సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా ఉన్న పంత్ ఈ సీజన్‌లో లక్నో సారధిగా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్‌లో లక్నో కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ఈ సీజన్‌లో ఢిల్లీ ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. తనను వదిలించుకున్న మాజీ జట్టుపై రాహుల్ ఏ మేరకు సత్తా చాటుతాడన్నది ఆసక్తికరంగా మారింది.
సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందే లక్నోను గాయాల సమస్య వేధిస్తుంది. ఆ జట్టుకు చెందిన ముగ్గురు పేసర్లు (మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్) గాయాలతో బాధపడుతున్నారు. ఓ పేసర్ (మొహిసిన్ ఖాన్) ఏకంగా సీజన్ మొత్తానికే దూరమ్యాడు. మొహిసిన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కొత్తగా జట్టులో చేరాడు.
మరోవైపు ఢిల్లీని కూడా ఓ సమస్య ఇరుకునపెడుతుంది. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ గత సీజన్‌లాగే ఈ సీజన్‌లో కూడా హ్యాండిచ్చాడు. బ్రూక్ లేకపోవడం ఢిల్లీ మిడిలార్డర్ కూర్పును దెబ్బతీస్తుంది. బ్రూక్ లేకపోయినా లక్నోతో పోలిస్తే ఢిల్లీ అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. ఆ జట్టులో విధ్వంకర వీరులతో పాటు ప్రామిసింగ్ ఆల్‌రౌండర్లు, నాణ్యమైన స్పిన్నర్లు, వరల్డ్ క్లాస్ పేసర్లు ఉన్నారు.
లక్నోతో నేటి మ్యాచ్‌లో జేక్ ఫ్రేజర్, డుప్లెసిస్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. జేక్ ఫ్రేజర్ తాజాగా జరిగిన ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో విధ్వంసకర సెంచరీ చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మతో ఢిల్లీ మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, నటరాజన్‌తో బౌలింగ్ విభాగం కూడా బలంగా ఉంది. కరుణ్ నాయర్, మోహిత్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్లుగా ఉండవచ్చు.
లక్నో విషయానికొస్తే.. అర్శిన్ కులకర్ణి, మిచెల్ మార్ష్ ఈ జట్టు ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. లక్నో మిడిలార్డర్ మెరుపు వీరులతో నిండి ఉంది. వన్‌డౌన్‌లో పంత్, నాలుగో స్థానంలో పూరన్, ఐదో స్థానంలో బదోని, ఆరో ప్లేస్‌తో మిల్లర్, ఏడో స్థానంలో అబ్దుల్ సమద్ బరిలోకి దిగవచ్చు. ఆల్‌రౌండర్ కోటాలో శార్దూల్.. బౌలర్లుగా రాజవర్దన్ హంగార్గేకర్, రవి బిష్ణోయ్, షమార్ జోసఫ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఆకాశ్ సింగ్, షాబాజ్ అహ్మద్, మణిమారన్ సిద్దార్థ్ ఇంపాక్ట్ ప్లేయర్లుగా బరిలోకి దిగవచ్చు.
పూర్తి జట్లు..
లక్నో సూపర్ జెయింట్స్: అర్షిన్ కులకర్ణి, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆర్ఎస్ హంగర్గేకర్, రవి బిష్ణోయ్, షమర్ జోసెఫ్, ఆకాష్ దీప్, షాబాజ్ అహ్మద్, మణిమారన్ సిద్దార్థ్, ఆకాశ్ మహారాజ్ సింగ్, ఎయిడెన్ మార్క్రమ్, అవేష్ ఖాన్, హిమ్మత్ సింగ్, మాథ్యూ బ్రీట్జ్కే, ఆర్యన్ జుయల్, యువరాజ్ చౌదరి, మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్ రాఠీ
ఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, టి నటరాజన్, కరుణ్ నాయర్, మొహిత్ శర్మ, దుష్మంత చమీరా, అజయ్ జాదవ్ మండల్, దర్శన్ నల్కండే, సమీర్ రిజ్వీ, డోనోవన్ ఫెరీరా, త్రిపురాన విజయ్, మన్వంత్ కుమార్ ఎల్, విప్రజ్ నిగమ్, మాధవ్ తివారీ
Comments
Please login to add a commentAdd a comment