![IPL 2025: Munaf Patel Appointed As Delhi Capitals Bowling Coach](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/12/munaf.jpg.webp?itok=7YsSPSEe)
ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యాజమాన్యం ఇవాళ (నవంబర్ 12) అధికారికంగా ప్రకటించింది. మునాఫ్ వచ్చే సీజన్ నుంచి హెడ్ కోచ్ హేమంగ్ బదాని, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ రావుతో కలిసి పని చేస్తాడు. మునాఫ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా జేమ్స్ హోప్స్ పని చేశాడు.
ఢిల్లీ యాజమాన్యం ఇటీవలే రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తొలగించింది. పాంటింగ్‌తో పాటు హోప్స్ తదితరులు తమ పదవులు కోల్పోయారు. పాంటింగ్, సౌరవ్ గంగూలీ స్థానాల్లో హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా బాధ్యతలు చేపట్టారు. సపోర్టింగ్ స్టాఫ్‌కు ఎంపిక చేసుకునే బాధ్యతను ఢిల్లీ యాజమాన్యం హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌కే వదిలేసింది. ఈ క్రమంలో బదాని, వేణు మునాఫ్‌ను బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసుకున్నారు.
41 ఏళ్ల మునాఫ్ పటేల్ 2013లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. మునాఫ్ 2008-17 మధ్యలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీల తరఫున 63 మ్యాచ్‌లు ఆడి 74 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ టీమిండియా తరఫున 2006-2011 మధ్యలో మూడు ఫార్మాట్లలో కలిపి 86 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 125 వికెట్లు పడగొట్టాడు. మునాఫ్ 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment