IPL Players Auction 2021: After Going Unsold In Auction Devon Conway Hits 99 Runs - Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌: నాలుగు రోజులు లేటైంది..లేకపోతే కోట్లు పలికేవి!

Published Mon, Feb 22 2021 5:36 PM | Last Updated on Mon, Feb 22 2021 6:16 PM

IPL Players 2021:Conway Hits 99 Not Out After Going Unsold - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల చెన్నైలో ఐపీఎల్‌-2021 వేలం జరిగిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌ వేలంలో పోటీలో ఉండాలంటే షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆయా క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగానే జరుగుతుంది. అదే ఐపీఎల్‌ వేలానికి ముందు ఏ ఆటగాడైనా అద్వితీయ ప్రదర్శన చేస్తే అతనికి కాసుల వర్షం కురిసిన సందర్భాలు ఎన్నో చూశాం. ఈసారి ఐపీఎల్‌ వేలంలో​ కూడా అదే రుజువైంది. కాగా, ఇక్కడ ఒక ఆటగాడికి మంచి చాన్స్‌ మిస్సయ్యిందనే చెప్పాలి. న్యూజిలాండ్‌కు చెందిన ఎడమచేతి వాటం ఆటగాడు డేవాన్‌ కాన్వే రోజుల వ్యవధిలో ఐపీఎల్‌ ఆడే అవకాశాన్ని కోల్పోవడమే కాదు.. కోట్ల రూపాయల్ని సంపాదించే అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాడనే చెప్పాలి.

ఇది విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు  టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌. ఇందుకు కారణం కాన్వే ఒక సూపర్‌ నాక్‌తో ఆసీస్‌ను చిత్తుచేయడమే. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో కాన్వే చెలరేగి ఆడాడు.  59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో​ 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, ఇటీవల ముగిసిన వేలంలో ఈ ఆటగాడు అమ్ముడుపోలేదు. అతని కనీస ధర 50 లక్షల రూపాయలు ఉన్నా ఎవరూ తీసుకోలేదు. అయితే ఆసీస్‌తో ఆడిన ఇన్నింగ్స్‌ ముందే వచ్చుంటే విషయాన్ని అశ్విన్‌ ప్రస్తావించాడు. ‘నాలుగు రోజులు లేటైంది.. కానీ వాటే నాక్‌’ అని ట్వీట్‌ చేశాడు. ఒకవేళ వేలానికి ముందు కాన్వే ఈ తరహా సంచలన ఇన్నింగ్స్‌ ఏమైనా చేసి ఉంటే కోట్లలో అమ్ముడుపోయేవాడు. 

ఐదు ట్వంటీ20ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో విశేషంగా రాణించిన కివీస్‌.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బ్లాక్‌క్యాప్స్‌ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగా, ఆపై ఆసీస్‌ 17.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో కివీస్‌ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. కాగా, కివీస్‌కు శుభారంభం లభించలేదు.  ఓపెనర్లు గప్టిల్‌(0), సీఫెర్ట్‌(1)లు ఇద్దరూ నిరాశపరిచారు.  అనంతరం  కెప్టెన్‌ విలియమ్సన్‌(12) కూడా ఆకట్టుకోలేదు. కానీ తన కెరీర్‌లో ఏడో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న కాన్వే రెచ్చిపోయి ఆడాడు. కివీస్‌ను కష్టాల్లోంచి గట్టెక్కించడమే కాదు.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు.  ఈ మ్యాచ్‌కు ముందు కాన్వే  అత్యధిక టీ20 స్కోరు 65గా ఉంది. 

 ఇక్కడ చదవండి: కివీస్‌ చేతిలో ఆసీస్‌ చిత్తు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement