న్యూఢిల్లీ: విదేశీ గడ్డపై ఐపీఎల్–2020ను నిర్వహించేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో ఆటగాళ్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కడం... అక్కడ క్వారంటైన్ కావడం... ఇక మెరుపులు మెరిపించడమే మిగిలున్నాయి. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ భారత్‌లో ఆడే పరిస్థితులు లేకపోవడంతో క్రికెట్ బోర్డు అభ్యర్థనను ప్రభుత్వం మన్నించింది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 20 లక్షలను దాటిన సంగతి తెలిసిందే! విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం మంత్రిత్వ శాఖలు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించిన మీదట శుక్రవారం తమ నిర్ణయాన్ని వెల్లడించినట్లు సమాచారం. యూఏఈ టోర్నీ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు, జీవ రక్షణ వలయం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్‌ఓపీ)లపై ఆయా శాఖలు సంతృప్తి చెందడంతో ఆమోదం లభించింది. అనంతరం యూఏఈలో 13వ సీజన్ నిర్వహణకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.
బుడగే లక్ష్మణ రేఖ
యూఏఈ వెళ్లే ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, ఫ్రాంచైజీ అధికారులు, యజమానులు ఎవరైనా సరే మ్యాచ్ అయిపోయాక విహారం చేద్దామంటే కుదరదు ఈ సారి! ఎందుకంటే ఎవరైనా సరే ఎస్‌ఓపీ ప్రకారమే నడుచుకోవాలి. ‘2020 సీజన్ ఆరోగ్యం–భద్రత ప్రొటోకాల్’ను అనుసరించి జీవ రక్షణ వలయాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాటి బయటికెళ్లొదు. కావాలని గానీ, పొరపాటుగా గానీ బుడగ దాటితే భారీ జరిమానా తప్పదు. ఇది ఎంత ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెళ్లడిస్తారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులకు మినహాయింపు ఉంది. అంటే ఆటగాడు గాయపడితే ఆస్పత్రికి వెళ్లేందుకు, స్కానింగ్ ఇతరత్రా పరీక్షలకు మాత్రమే లక్ష్మణ రేఖ దాటొచ్చు.
ఫ్రాంచైజీకో డాక్టర్
ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతీ ఫ్రాంచైజీ ఈ సారి టీమ్ డాక్టర్‌ను నియమించాలి. ఆ డాక్టరే ఆరోగ్య మార్గదర్శకాల అమలు బాధ్యత నిర్వర్తించాలి. అక్కడికి వెళ్లే ప్రతీ ఒక్కరి ఆరోగ్య–ప్రయాణ వివరాలు (మార్చి నుంచి) సమర్పించాలి. అలాగే పయనమయ్యే రెండు వారాల ముందు ప్రతీ రోజు ఆరోగ్య సమాచారం (ఆన్‌లైన్) సేకరించాలి. ఇవన్నీ జట్టు ఒక చోట చేరేందుకు ముందే పూర్తవ్వాలి. ఈ నెల 20 తర్వాతే యూఏఈకి బయల్దేరాలి. మూడు పొరల మాస్క్ ధరించే తిరగాలి. అక్కడికి వెళ్లాక క్వారంటైన్‌లో ఉండగా వరుసగా మూడుసార్లు చేసే టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టు వస్తేనే బుడగలోకి తీసుకెళ్తారు.
జట్లన్నీ తలోదారి
యూఏఈలో ఎనిమిది ఫ్రాంచైజీలు వేర్వేరుగా బస చేస్తాయి. ఒక్కో జట్టు ఒక్కో హోటల్‌లో అదికూడా సెంట్రలైజ్ ఏసీ కాకుండా ప్రత్యేకంగా ఏసీ ఉన్న గదుల్లోనే గడపాలి. ఫ్రాంచైజీ సమావేశాలు హాలులో కాకుండా బహిరంగ ప్రదేశంలో నిర్వహించుకోవాలి. అయితే ఎక్కడైనా సరే అభిమానులకు దూరంగానే ఉండాలి. ఇప్పటికే ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు నిర్వహించాలని ఐపీఎల్ పాలక మండలి నిర్ణయించింది. కరోనా బారిన పడకుండా స్కేలెన్ హైపర్‌చార్జ్ కరొనా కెనన్ (షైకొకన్) పరికరాలను ఉపయోగిస్తారు. ఇవి గాలిలో ఉండే కరోనా వైరస్‌ను 99.9 శాతం నిర్జీవం చేస్తాయి.
కుటుంబ సభ్యులైనా సరే...
ప్రారంభ దశలో కుటుంబసభ్యులకైతే అనుమతి లేదు. అయితే ఫ్రాంచైజీ యజమానులు, తర్వాత దశలో కుటుంబసభ్యులు బుడగ లోపలే ఉండాలి. ఆటగాళ్లు బయటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు. అతిక్రమించిన వారు మళ్లీ క్వారంటైన్‌కు వెళ్లాల్సిందే. రెండు వరుస పరీక్షల్లో నెగెటివ్‌గా రావాల్సిందే. అప్పుడే తిరిగి బుడగలోకి అనుమతిస్తారు. ఇలాంటి తలనొప్పులు ఎందుకని అనుకుందో ఏమో గానీ చెన్నై ఫ్రాంచైజీ ఈ సీజన్ ఆసాంతం కుటుంబసభ్యులు లేకుండానే యూఏఈ వెళ్లాలని నిర్ణయించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment