దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19 నుంచి యూఏఈలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని జట్లు అక్కడికి చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఈ సందర్భంగా టీమిండియా మాజీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఐపీఎల్ 2020కి సంబంధించిన పనులను పర్యవేక్షించడానికి యూఏఈకి వెళ్లాడు. దాదాపు 6 నెలల కరోనా విరామం తర్వాత విదేశానికి పయనమైనట్లు సౌరవ్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో విమానంలో తాను ప్రయాణిస్తున్న ఫోటోలను గంగూలీ బుధవారం ఇన్‌స్టాలో షేర్ చేశాడు. (చదవండి : బయటపడ్డ జాతీయ క్రీడా సంస్థ డొల్లతనం)
'6 నెలల కాలంలో తొలిసారి విమాన ప్రయాణం చేస్తున్నా.. జీవనశైలి పూర్తిగా మారిపోయింది.. ఇంతకముందలా మాత్రం లేదు.. ఫేసుకు మాస్కుతో పాటు ఇతర అన్ని జాగ్రత్తలు తీసుకొని విమానం ఎక్కాను. ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలనే మీతో షేర్ చేసుకుంటున్నా' అంటూ తెలిపాడు. ఇప్పటికే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సహా ఇతర అధికారులు దుబాయ్‌లోనే ఉండి లీగ్‌కు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు.
కాసుల పంట కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఈసారి కరోనా దెబ్బ గట్టిగానే తగిలింది. అయినా సరే క్రికెట్‌ను విపరీతంగా అభిమానించే భారత అభిమానులను దృష్టిలో పెట్టుకొని యూఏఈలో ఐపీఎల్ నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. కరోనా కష్టకాలంలో ఈసారి ఐపీఎల్ సీజన్ ఎంత సక్సెస్ ఎంత అవుతుందో చూడాలి. బయో బబుల్ సెక్యూర్ విధానంలో ఆడుతుండడం ఆటగాళ్లందరికి సవాల్‌గా మారింది. అన్ని జాగ్రత్తలను తీసుకొని బరిలోకి దిగుతున్న ఐపీఎల్ జట్లు లీగ్‌కు సన్నద్దమయ్యాయి.
చెన్నై జట్టులో కరోనా కలకలం రేపినా.. ఇప్పటికైతే పరిస్థితులు అనుకూలంగానే ఉన్నా.. రేపు ఐపీఎల్ ప్రారంభమైన తర్వతా ఆటగాళ్లు కరోనా బారిన పడితే పరిస్థితి ఏంటనే భయం వెంటాడుతుంది. మ్యాచ్‌లకు కూడా 30 శాతం మంది ప్రేక్షకులకు అనుమతి ఉన్నా.. ఎంతమంది వస్తారనేది చూడాలి. అయితే ఆరు నెలలుగా సరైన క్రికెట్ వినోదం లేక నిరాశలో ఉన్న భారత అభిమానులకు మాత్రం పెద్ద పండగే అని చెప్పొచ్చు. టీవీల ద్వారా వచ్చే రేటింగ్ ఐపీఎల్ సీజన్‌ను విజయవంతం చేస్తుందని బీసీసీఐ ఆశిస్తుంది. సెప్టెంబర్ 19న చెన్నై, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్‌తో మొదలవుతున్న ఐపీఎల్ 13వ సీజన్ నవంబర్ 10 వరకు 53 రోజుల పాటు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment