ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్‌.. అరుణ్‌ ధుమాల్‌ క్లారిటీ! | IPL To-Take Place 2-Times In-Year-Chairman Arun Dhumal Gives Clarity | Sakshi
Sakshi News home page

ఏడాదికి రెండుసార్లు ఐపీఎల్‌.. అరుణ్‌ ధుమాల్‌ క్లారిటీ!

May 27 2026 11:53 AM | Updated on May 27 2026 12:38 PM

IPL To-Take Place 2-Times In-Year-Chairman Arun Dhumal Gives Clarity

భారత్‌లో అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)ను మరింత విస్తరించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ను రెండుసార్లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి తగిన కార్యచరణను రూపొందిస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు. 

స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ ధుమాల్ మాట్లాడుతూ.. ‘బీసీసీఐ సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లను మార్చి-మే మధ్యలో నిర్వహిస్తోంది. నాలుగు ప్లేఆఫ్ మ్యాచ్‌లు సహా మొత్తం 74 మ్యాచ్‌లు ఉన్న టోర్నమెంట్‌లో విస్తరణ తర్వాత 94 మ్యాచ్‌లు జరిగే అవకాశముంది. దీంతో ఇప్పటివవరకు లీగ్ దశలో 14 మ్యాచ్‌లాడిన జట్లు ఇకపై 18 మ్యాచ్‌లు ఆడనున్నాయి. 

అయితే ఇన్ని మ్యాచ్‌లను ఒకేసారి నిర్వహించడం వల్ల సీజన్ మరింత పొడిగించాల్సి ఉంటుంది. అందువల్ల టోర్నీ మార్చి నుంచి జూన్ వరకు జరిగే అవకాశముంటుంది. అయితే ఎండాకాలం కావడంతో అధిక వేడిమి కారణంగా క్రికెటర్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఐపీఎల్‌ను రెండు విడతల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుందున్న ఆలోచన కూడా మాకు కలిగింది. 

ఈ నేపథ్యంలో మొదటి విడతను ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్యలో, రెండో విడతను సెప్టెంబర్‌-అక్టోబర్ మధ్య జరిగేలా ప్రణాళిక రచించాలని చూస్తున్నాం.  ఐపీఎల్ కేవలం బీసీసీఐని మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని క్రికెట్ బోర్డులను, ఆటగాళ్లను ప్రభావితం చేస్తోంది. అయితే టోర్నమెంట్‌ను మరో విండోకు మార్చవచ్చా లేదా అనే దానిపై అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఒక నిర్ణయానికి వస్తాం. 

అప్పటివరకు ఐపీఎల్ ఇప్పుడున్న ఫార్మాట్‌లోనే జరుగుతుంది.’ అని చెప్పుకొచ్చారు. అయితే అరుణ్ ధుమాల్ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడున్న ఫార్మాట్‌ను కాదని రెండు విడతల్లో ఐపీఎల్ నిర్వహించడమనేది ఒక అనవసరమైన ప్రక్రియ అని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. ఇలా చేయడం వల్ల అంతర్జాతీయ టోర్నీల షెడ్యూల్ కూడా గందరగోళంగా తయార వుతుందని, ఆటగాళ్లు గాయపడే అవకాశాలు మరింత పెరుగుతాయని పెదవి విరుస్తున్నారు. 

ఇక ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరి దశకు చేరుకుంది. మంగళవారం జరిగిన క్వాలిఫయర్‌-1 పోరులో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది.నేడు జరగనున్న ఎలిమినేటర్ పోరులో ఎస్‌ఆర్‌హెచ్‌తో రాజస్తాన్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో గుజరాత్ టైటాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మే 31 (ఆదివారం) జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది.

చదవండి: పాపం సాయి సుద‌ర్శ‌న్‌.. ఐపీఎల్‌ చరిత్రలో వింత ఔట్‌!

Advertisement
 
Advertisement
Advertisement