breaking news
IPL 2026
-
రాజస్థాన్ రాయల్స్‌కు మరో బిగ్ షాక్
తదుపరి ఐపీఎల్ సీజన్ (2026) ప్రారంభానికి ఇంకా చాలా సమయం ఉన్నా, రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి నుంచే మార్పులు చేర్పుల ప్రక్రియ మొదలుపెట్టింది. తొలుత కెప్టెన్ సంజూ శాంసన్ ఫ్రాంచైజీ వీడతాడని అనుకున్నా.. అతని కంటే ముందే హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. తాజాగా రాయల్స్‌కు మరో కీలక వ్యక్తి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.ఆ ఫ్రాంచైజీ CEO జేక్ లష్ మెక్‌క్రమ్ తన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. వచ్చే నెలలో అతను అధికారికంగా వైదొలగనున్నట్లు తెలుస్తుంది. జోహన్నెస్‌బర్గ్‌లో నిన్న (సెప్టెంబర్ 9) జరిగిన SA20 వేలంలో రాజస్థాన్ రాయల్స్ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన Paarl Royals టేబుల్ వద్ద జేక్ కనిపించలేదు. జేక్ 2021లో కేవలం 28 ఏళ్ల వయసులో రాయల్స్ CEOగా బాధ్యతలు చేపట్టి వార్తల్లో నిలిచాడు. కాగా, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం గత సీజన్ పేలవ ప్రదర్శన అనంతరం ఫ్రాంచైజీలో సమూల ప్రక్షాళన చేపట్టాలని భావిస్తుంది. ఇందులో భాగంగానే కీలక పదవుల్లో వారికి పొమ్మనలేక పొగ పెట్టింది. ఈ క్రమంలో తొలుత ఫ్రాంచైజీ మార్కెటింగ్ హెడ్, ఆతర్వాత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, తాజాగా సీఈఓ నిష్క్రమణ జరిగాయి.త్వరలో కెప్టెన్ సంజూ శాంసన్ కూడా రాయల్స్‌కు గుడ్ బై చెప్పడం దాదాపుగా ఖరారైంది. రాయల్స్ యాజమాన్యం ఇంత మంది తప్పిస్తున్నా, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న కుమార సంగక్కరను మాత్రం కొనసాగించనున్నట్లు తెలుస్తుంది. రాయల్స్ 2025 సీజన్లో 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది.గత సీజన్లో ఆ జట్టు తరఫున అద్బుతమైన ప్రదర్శనలు నమోదైనా ఎందుకో విజయాలు సాధించలేకపోయింది. చాలావరకు గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఆ జట్టు ఒత్తిడిలోనై పరాజయాలపాలైంది. గత సీజన్లో రాయల్స్‌కు వైభవ్ సూర్యవంశీ రూపంలో ఆణిముత్యం దొరికాడు. వైభవ్ గత సీజన్లో ఎలా పేట్రేగిపోయాడో అందరం చూశాం. -
టీ20 వరల్డ్‌కప్-2026 టోర్నీకి డేట్స్ ఫిక్స్..! వివరాలు ఇవే
భారత్, శ్రీలంక వేదికలగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్-2026కు తేదీలను ఐసీసీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది ఈఎస్పీఎన్ రిపోర్ట్ ప్రకారం.. ఈ మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8వరకు జరగనున్నట్లు సమాచారం. ఐపీఎల్-2026కు ముందే ఈ పొట్టి ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్లో మొత్తం 20 జట్లు పాల్గోనున్నాయి. ఈ మార్య్కూ ఈవెంట్‌కు శ్రీలంక, భారత్‌లోని మొత్తం ఐదు స్టేడియాలు ఆతిథ్యమివ్వనున్నాయి. అయితే సదరు రిపోర్ట్ ప్రకారం.. ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను మాత్రం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఇంకా ఫైన్లైజ్ చేయలేదంట.కానీ ఫైనల్ మ్యాచ్‌కు వేదికలగా ఆహ్మదాబాద్, కొలంబోలను పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పాక్ ఫైనల్‌కు చేరుకుంటే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో తుది పోరు జరిగే అవకాశముంది.ఫార్మాట్ ఇదే..ఇక టీ20 వరల్డ్‌కప్-2026 ఫార్మాట్ విషయానికి వస్తే.. గత ఎడిషన్ మాదిరిగానే నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో పాల్గోనే మొత్తం జట్లను నాలుగు గ్రూపులగా విభజిస్తారు. ప్రతీ గ్రూపులో ఐదు జట్లు ఉంటాయి. లీగ్ స్టేజిలో ప్రతీ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడుతోంది.లీగ్ దశ ముగిసే సమయానికి ప్రతీ గ్రూపులో టాప్-2లో నిలిచే జట్లు సూపర్-8కు ఆర్హత సాధిస్తాయి. సూపర్-8 రౌండ్లో టాప్ 4 జట్లు సెమీఫైనల్లో అడుగుపెడతాయి. ఆ తర్వాత సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి.ఈ ప్రపంచకప్‌లో ఓవరాల్‌గా 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ మెగా టోర్నీ కోసం 15 జట్లు తమ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. మిగిలిన ఐదు జట్లు ఆఫ్రికన్, ఆసియా, తూర్పు ఆసియా పసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి ఆర్హత సాధించనున్నాయి.చదవండి: వేలంలో రికార్డులు బద్దలు కొట్టిన డెవాల్డ్ బ్రెవిస్.. కాస్ట్లీ ప్లేయర్‌గా చరిత్ర -
గుజరాత్ టైటాన్స్‌లోకి ఆసీస్ విధ్వంసకర వీరుడు?
గుజరాత్ టైటాన్స్.. తమ ఐపీఎల్ అరంగేట్ర సీజన్లోనే ఛాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది. ఐపీఎల్-2022 టైటిల్‌ను హార్దిక్ పాండ్యా పాండ్యా సారథ్యంలోని గుజరాత్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత సీజన్లోనూ తమ జట్టును రన్నరప్‌గా హార్దిక్ నిలిపాడు.కానీ అనుహ్యంగా ఐపీఎల్-2024కు ముందు ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ నుంచి ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ వెళ్లిపోయాడు. ఆ తర్వాత శుబ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ బాధ్యతలు చేపట్టనప్పటికి జట్టును విజయ పథంలో నడిపించడంలో విఫలమయ్యాడు. ఐపీఎల్-2025లో ప్లే ఆఫ్స్‌లో ఇంటిముఖం పట్టిన గుజరాత్.. అంతకముందు సీజన్లో లీగ్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.హార్దిక్ గుజరాత్‌ను వీడి రెండు సీజన్లు అవుతున్నప్పటి అతడి స్ధానాన్ని సరైన ఆటగాడు ఎవరూ భర్తీ చేయలేకపోయారు. హార్దిక్ బ్యాట్, బంతితో రాణించి గుజరాత్ విజయాల్లో భాగమయ్యేవాడు. అయితే ఈసారి మినీవేలంలో అయినా హార్దిక్ తగ్గ ఆటగాడిని కొనుగోలు చేయాలని గుజరాత్ యాజమాన్యం భావిస్తుందంట.గ్రీన్‌పై కన్ను..?ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరగనుంది. ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్‌పై గుజరాత్ టైటాన్స్ కన్నేసినట్లు తెలుస్తోంంది. గ్రీన్ గాయం కారణంగా గతేడాది ఐపీఎల్ సీజన్‌కు దూరమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకున్న గ్రీన్ వచ్చే ఏడాది సీజన్లో ఆడనున్నాడు.ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో ఆసీస్ తరపున అదరగొడుతున్నాడు. ఈ 26 ఏళ్ల ఆటగాడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని గుజరాత్ యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్న గ్రీన్.. త్వరలోనే బౌలింగ్‌కు చేసేందుకు అందుబాటులో ఉండనున్నాడు. గ్రీన్ ఇప్పటికే ఐపీఎల్లో రెండు సార్లు రూ. 17.50 కోట్లు అమ్ముడుపోయాడు. ముంబై ఇండియన్స్, ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. గత రెండేళ్లలో టీ20ల్లో అతడి స్ట్రైక్ రేట్ 150 కంటే ఎక్కువగా ఉంది. ఐపీఎల్ 2026 వేలంలో అత్యంత డిమాండ్ ఉన్న ఆటగాళ్లలో ఒకడిగా గ్రీన్ ఉన్నాడు. గ్రీన్‌కు ఓ ఐపీఎల్ సెంచరీ కూడా ఉంది. -
ఐపీఎల్ వేలంలో ఆ నలుగురికి భారీ ధర!.. అతడిని ముంబై కొనొచ్చు!
ఐపీఎల్ మినీ వేలం-2026 నేపథ్యంలో టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో ఇంగ్లండ్ ఆటగాళ్లకు మంచి ధర దక్కుతుందని అంచనా వేశాడు. ‘ది హండ్రెడ్’ లీగ్ (The Hundred)లో సత్తా చాటిన ‘ఆ నలుగురు’ అధిక ధరకు అమ్ముడుపోతారంటూ జోస్యం చెప్పాడు.ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడుఅయితే, వాళ్లు ఇంత వరకు ఒక్కసారి కూడా క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడకపోవడం విశేషం. ఇంతకీ ఎవరా నలుగురు?!... తన యూట్యూబ్ షో అశ్ కీ బాత్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. ‘‘ఇంత వరకు ఐపీఎల్లో ఆడని ప్లేయర్..కానీ ఈసారి వేలంలో మాత్రం అధిక ధర పలికే అవకాశం ఉంది. అతడు మరెవరో కాదు జోర్డాన్ కాక్స్ (Jordan Cox).ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున అతడు అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు. 24 ఏళ్ల ఈ యువ ఆటగాడు ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించాడు. ముంబై ఇండియన్స్ అతడపై ఆసక్తి చూపవచ్చు. అతడిని సొంతం చేసుకోవచ్చు కూడా!సోనీ బేకర్ సూపర్ఇక రెండో ఆటగాడు ఎవరంటే.. టీమిండియాతో టెస్టు సిరీస్‌లో జోష్ టంగ్ మెరుగ్గా ఆడాడు. అయితే, మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున అతడు బౌలర్‌గా గొప్పగా రాణించాడు. అదే జట్టు నుంచి మరో ప్లేయర్ కూడా మెరుగ్గా ఆడాడు. అతడే సోనీ బేకర్.అద్భుతమైన ఇన్స్వింగర్లతో ప్రత్యర్థులను భయపెట్టాడు. కొత్త బంతితో మెరుగ్గా రాణించాడు. ఇక రెహాన్ అహ్మద్ .. ఈసారి బౌలింగ్‌తో కన్నా బ్యాటింగ్‌తో వార్తల్లో నిలిచాడు. మూడు, నాలుగు స్థానాల్లో వచ్చి రాణించాడు. లెగ్ స్పిన్నర్‌గానూ సేవలు అందించగలడు’’ అని పేర్కొన్నాడు.నలుగురి ప్రదర్శన ఇలాకాగా ది హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన పేసర్ జోష్ టంగ్.. పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు.. ఓవల్ ఇన్విసిబుల్స్ తరఫున ఆడిన వికెట్ కీపర్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్.. 367 పరుగులు సాధించాడు.ఇక మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు ఆడిన యువ పేసర్ సోనీ బేకర్ తొమ్మిది వికెట్లతో సత్తా చాటగా.. ట్రెంట్ రాకెట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన స్పిన్ ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్.. 189 పరుగులు చేయడంతో పాటు 12 వికెట్లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే.. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్.. ఇటీవలే ఐపీఎల్‌కూ కూడా వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.చదవండి: ‘భారత క్రికెట్ బాగుండాలంటే.. రోహిత్ శర్మ ఇంకో పదేళ్లు ఆడాలి’ -
కేకేఆర్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్..!?
రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ప్రయాణం ముగిసిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2025కు ముందు రాయల్స్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్.. కేవలం ఒక్క సీజన్‌కే తన పదవికి రాజీనామా చేశాడు.అయితే ఫ్రాంచైజీలో అంతర్గత విభేదాల కారణంగా ద్రవిడ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. కానీ రాజస్తాన్ మాత్రం అతడు తప్పుకోవడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ద్రవిడ్ తదుపరి అడుగు ఏంటన్న చర్చ క్రికెట్ వర్గాల్లో నెలకొంది.కేకేఆర్ హెడ్ కోచ్‌గా.. ఐపీఎల్-2026కు ముందు రాహుల్ ద్రవిడ్‌ను తమ జట్టు హెడ్‌కోచ్‌గా నియమించుకోవాలని కోల్‌కతా నైట్‌రైడర్స్ భావిస్తుందంట. ఈ ఏడాది సీజన్ తర్వాత కేకేఆర్ ప్రధాన కోచ్ పదవి నుంచి చంద్రకాంత్ పండిత్ తప్పుకొన్నాడు. ప్రస్తుతం కేకేఆర్ హెడ్‌కోచ్ పదవి ఖాళీగా ఉంది.దీంతో అతడి స్ధానాన్నిఅనుభవజ్ఞుడైన ద్రవిడ్‌తో భర్తీ చేయాలని కోల్‌కతా యాజయాన్యం యోచిస్తున్నట్లు సమాచారం. ది టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ కరేబియన్ దీవుల నుంచి వచ్చిన వెంటనే ద్రవిడ్‌తో సంప్రదింపులు జరపనున్నట్లు తెలుస్తోంది. కానీ ద్రవిడ్ కేకేఆర్ ఆఫర్‌ను అంగీకరిస్తాడో లేదో తెలియదు. ఎందుకంటే గత ఏడు ఎనిమిదేళ్ల నుంచి వివిధ జట్లకు కోచింగ్ ఇస్తూ ద్రవిడ్ బీజీబీజీగా గడిపాడు. అతడు ప్రస్తుతం తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతో భారత హెడ్‌కోచ్ పదవి నుంచి ద్రవిడ్ తప్పుకొన్నాడు. అయితే కేకేఆర్ అతడికి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ ఆఫర్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్..కాగా ఈ ఏడాది సీజన్లో అజింక్య రహానే సారథ్యంలోని కోల్‌కతా జట్టు దారుణ ప్రదర్శన కనబరిచింది. కేకేఆర్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్‌రైడర్స్ నిలిచింది. కెప్టెన్ రహానేపై కూడా వేటు పడే అవకాశముంది.చదవండి: Ashes 2025: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. బుమ్రాను ఫాలో కానున్న కమ్మిన్స్!? -
ఆర్సీబీని భయపెడుతున్న భువనేశ్వర్ కుమార్
వచ్చే ఐపీఎల్ సీజన్‌కు ముందు వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీని భయపెడుతున్నాడు. గత సీజన్లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించిన భువీ.. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తర్‌ప్రదేశ్ టీ20 లీగ్‌లో చెత్త ప్రదర్శనలు చేస్తూ ఆందోళన కలిగిస్తున్నాడు. ఈ లీగ్‌లో లక్నో ఫాల్కన్స్‌కు ఆడుతున్న భువీ.. ఇవాళ (ఆగస్ట్ 27) మీరట్ మెవెరిక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్లో ఏకంగా 29 పరుగులు సమర్పించుకుని ఆర్సీబీ యాజమాన్యాన్ని, ఆ ఫ్రాంచైజీ అభిమానులను ఉలిక్కి పడేలా చేశాడు. భువీపై ఆర్సీబీ వచ్చే సీజన్లో కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో అతడి నుంచి ఇలాంటి చెత్త ప్రదర్శనలు ఆర్సీబీ యాజమాన్యాన్ని తప్పక కలవరపెడతాయి. భువీ చెత్త ప్రదర్శన ఈ ఒక్క ఓవర్‌కే పరిమితం కాలేదు. ఈ సీజన్లో అతనాడిన 5 మ్యాచ్‌ల్లోనూ ఇలాగే ఉంది. 8కిపైగా ఎకానమీతో, కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. మీరట్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ తన తొలి మూడు ఓవర్లు బాగానే వేశాడు. అందులో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు. నాలుగో ఓవర్లోనే భువీని ప్రత్యర్థి బ్యాటర్ రితురాజ్ శర్మ ఆడుకున్నాడు. మొదటి బంతిని సిక్సర్‌గా మలిచిన రితు.. ఆతర్వాత వరుసగా నాలుగు బౌండరీలు కొట్టి, చివరి బంతికి మరో సిక్సర్ బాదాడు. ఈ ఓవర్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టిన రితు 29 పరుగులు పిండుకున్నాడు. మొత్తంగా భువీ ఈ మ్యాచ్‌లో తన కోటా నాలుగు ఓవర్లు వేసి ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. భువీతో పాటు మిగతా లక్నో బౌలర్లందరినీ కూడా చెడుగుడు ఆడుకున్న మీరట్ బ్యాటర్లు తమ జట్టుకు భారీ స్కోర్‌ను అందించారు. స్వస్తిక్ చికారా (55), రితురాజ్ శర్మ (74 నాటౌట్), రింకూ సింగ్ (57), రితిక్ వట్స్ (8 బంతుల్లో 35 నాటౌట్) చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన లక్నో 18.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. జీషన్ అన్సారీ (4-0-23-3), యశ్ గార్గ్ (4-0-25-3), కార్తీక్ త్యాగి (2.2-0-9-2), విజయ్ కుమార్ (3-0-20-2) లక్నోను దెబ్బకొట్టారు. లక్నో ఇన్నింగ్స్‌లో సమీర్ చౌధరీ (46) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
ఆర్సీబీ కోచ్ లేదంటే మెంటార్‌గా వస్తా: ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB de Villiers)కు ఉన్న ఫ్యాన్‌ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌తోనూ అభిమానులను అలరించాడు.ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డివిలియర్స్.. 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)లో చేరాడు. రిటైర్మెంట్ వరకు అదే జట్టుతో కొనసాగిన ఏబీడీకి ఆర్సీబీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. కోహ్లితో కలిసి సంబరాలుఐపీఎల్-2025 ఫైనల్లో ఆర్సీబీ గెలవగానే యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌తో కలిసి డివిలియర్స్ కూడా విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీకి మద్దతుగా వచ్చి.. ఆర్సీబీ పదిహేడేళ్ల సుదీర్ఘకల నెరవేరగానే డివిలియర్స్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికీ డివిలియర్స్ తమ జట్టులో భాగంగానే భావిస్తారు. అతడు తిరిగి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిలాషను తెలుపుతూ ఉంటారు. ఇక ఇందుకు సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. డివిలియర్స్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు.కోచ్ లేదంటే మెంటార్‌గా..అయితే, ఆటగాడిగా రీఎంట్రీ కాకుండా.. కోచ్ లేదంటే మెంటార్ పాత్రలో ఆర్సీబీలో చేరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. ‘‘భవిష్యత్తులో నేను మళ్లీ ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే, సీజన్ ఆసాంతం ప్రొఫెషనల్ విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా లేను.మనసంతా ఆర్సీబీతోనేఆరోజులు ముగిసిపోయాయి. ఏదేమైనా నా మనసు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంఛైజీ నాకు కోచ్ లేదా మెంటార్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో ఐపీఎల్లో పునరాగమనం చేస్తే కచ్చితంగా ఆర్సీబీతోనే ఉంటాను’’ అని డివిలియర్స్ వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు.పరుగుల వీరుడుకాగా సౌతాఫ్రికా తరఫున 2004- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు డివిలియర్స్. తన కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 8765, 9577, 1672 పరుగులు సాధించాడు.ఇక ఐపీఎల్లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు సాధించాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. 2021లో ఆర్సీబీ తరఫున కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరులో డివిలియర్స్ చివరగా తన ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వారే: ఛతేశ్వర్ పుజారా -
IPL 2026: సీఎస్కేలోకి పృథ్వీ షా..? వీడియో చూసి ఫిక్స్ అయిపోయిన అభిమానులు
ముంబై యువ ఓపెనర్ పృథ్వీ షా గత కొంతకాలంగా బ్యాడ్ రీజన్స్ వల్ల వార్తల్లో నిలిచాడు. ఫామ్ లేమి, వివాదాలు, ఫిట్నెస్ సమస్యల కారణంగా ముంబై దేశవాలీ జట్లలో స్థానం కోల్పోయాడు. ఐపీఎల్ 2025 వేలంలోనూ అమ్ముడుపోలేదు.టీమిండియా తరఫున అరంగేట్రం టెస్ట్‌లోనే సెంచరీ చేసి, భవిష్యత్ తారగా కీర్తించబడిన షా.. స్టేటస్ ఇచ్చిన కిక్కు తలకెక్కడంతో కొద్ది రోజుల్లోనే అదఃపాతాళానికి పడిపోయాడు.ఈ క్రమంలో తొలుత ముంబై రంజీ జట్టులో చోటు కోల్పోయాడు. ఆతర్వాత విజయ్ హజారే ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. ముంబై విజేతగా నిలిచిన ముస్తాక్ అలీ టోర్నీలో భాగమైనా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు.ముంబై తరఫున అవకాశాలు రావని భావించిన షా.. ఇటీవలే మహారాష్ట్రకు మకాం మార్చాడు. బుచ్చిబాబు టోర్నీలో అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసి సత్తా చాటాడు. కొత్త ప్రయాణాన్ని సెంచరీతో ప్రారంభించడంతో పృథ్వీ షా 2.0 వర్షన్ అని జనం అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే, బుచ్చిబాబు టోర్నీని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. పృథ్వీ షా చెన్నై వేదికగా ఛత్తీస్‌ఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. ఈ సెంచరీ తర్వాత చాలామంది అభిమానుల్లాగే ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్కే కూడా షాను ప్రశంసించింది. First 💯 for Maharashtra in Chennai✅Shaw makes it special 💛#WhistlePodu #BuchiBabu pic.twitter.com/o5zGZA2MlU— Chennai Super Kings (@ChennaiIPL) August 21, 2025తమ అధికారిక సోషల్‌మీడియా ఖాతాలో షా మాట్లాడుతున్న ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో షా చెన్నైతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటాడు. అతనికి చెన్నై అంటే చాలా ప్రత్యేకమని చెబుతాడు.ఈ వీడియోలో షా మాట్లాడిన తీరు, సీఎస్కే యాజమాన్యం అతనికి ప్రత్యేకంగా ఇచ్చిన ఎలివేషన్ చూస్తే వారి మధ్య ఏదో జరిగిందన్న విషయం స్పష్టమవుతుంది. సాధారణంగా సీఎస్కే యాజమాన్యం ఎప్పుడూ, తమ వాడు కాని ఏ ఆటగాడికి ఇంత హైప్ ఇవ్వదు. ఇవ్వలేదు. అలాంటిది సీఎస్కే షాను ప్రత్యేకించి ప్రమోట్ చేయడం చూస్తే, వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం వీరి మధ్య డీల్ కుదిరిందా అని అనిపించకమానదు. సీఎస్కే హ్యాండిల్లో షా వీడియో చూసిన తర్వాత అభిమానులు ఈ విషయాన్ని నిర్దారించుకున్నారు. ఒకవేళ ఇదే జరిగితే షా వచ్చే ఐపీఎల్ సీజన్లో ఆయుశ్ మాత్రేతో కలిసి సీఎస్కే ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. -
విధ్వంసకర శతకం.. కేకేఆర్ యాజమాన్యానికి సవాల్ విసిరిన రమన్‌దీప్ సింగ్
కేకేఆర్ ఆల్‌రౌండర్ రమన్‌దీప్ సింగ్ బుచ్చిబాబు టోర్నీలో చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో పంజాబ్‌కు ఆడుతున్న అతను.. హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకొని, 101 బంతుల్లో 111 పరుగులు చేసి ఔటయ్యాడు.రమన్‌దీప్ శతక్కొట్టడంతో ఈ మ్యాచ్‌లో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో రమన్‌దీప్ వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. పరిమిత ఓవర్ల ఆటగాడిగా ముద్రపడిన రమన్‌దీప్.. మల్టీ డే ఫార్మాట్లోనూ సత్తా చాటి ఆ ముద్రను చెరిపేసుకున్నాడు.భారత క్రికెట్లో అరుదుగా కనిపించే సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్లలో రమన్‌దీప్ ఒకడు. పవర్ హిట్టింగ్‌కు పేరుగాంచిన ఇతను భారత్ తరఫున 2 టీ20లు ఆడాడు. దేశవాలీ క్రికెట్లో మెరుపులు కారణంగా రమన్‌దీప్‌కు ఐపీఎల్ అవకాశం దక్కింది. ఇతన్ని కేకేఆర్ యాజమాన్యం గత సీజన్‌కు ముందు రూ. 4 కోట్లకు రీటైన్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే రమన్‌దీప్ యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. బ్యాట్‌తో, బంతితో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. ఈ విషయంలో రమన్‌దీప్‌ను నిందించడం కంటే మేనేజ్మెంటే అతన్ని సరిగ్గా వినియోగించుకోలేదని చెప్పాలి. అవకాశం ఇచ్చిన అరకొర మ్యాచ్‌ల్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు పంపింది. బౌలింగ్‌లో అస్సలు వినియోగించుకోలేదు. తాజా ప్రదర్శనతో రమన్‌దీప్ కేకేఆర్ యాజమాన్యానికి సవాల్ విసిరాడు. తన సేవలను సరిగ్గా వినియోగించుకోవాలని పరోక్ష హెచ్చరిక చేశాడు.ఇదిలా ఉంటే, బుచ్చిబాబు టోర్నీలో టీమిండియా ఆటగాళ్ల హవా కొనసాగుతుంది. నిన్న ముంబై తరఫున సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో చెలరేగగా.. ఇవాళ మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా, పంజాబ్ తరఫున రమన్‌దీప్ సింగ్ సెంచరీలతో కదంతొక్కారు. -
వేలానికి సంజూ శాంసన్..?
రాజస్థాన్ రాయల్స్ సారధి సంజూ శాంసన్ ఫ్రాంచైజీ మారే అంశం ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నడుస్తుంది. సంజూకు రాయల్స్‌లో కొనసాగే ఉద్దేశం లేదని ప్రచారం జరుగుతున్న వేల.. ఐపీఎల్ ట్రేడింగ్ విండో తెరుచుకుంది. ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకునేందుకు సీఎస్కే, కేకేఆర్ పోటీపడుతున్నట్లు సమాచారం.అయితే సంజూ విషయంలో రాయల్స్ డిమాండ్లకు ఆ ఫ్రాంచైజీలు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. క్యాష్ డీల్ వరకు ఓకే కానీ, తమ ఆటగాళ్లను వదులుకునే ప్రసక్తే లేదని సదరు ఫ్రాంచైజీలు చెప్పినట్లు సమాచారం.సంజూను సీఎస్కే కోరుకున్నట్లైతే ప్రతిగా నగదుతో పాటు ఇద్దరు ఆటగాళ్లను రాయల్స్ డిమాండ్ చేసిందట. రవీంద్ర జడేజా, శివమ్ దూబేలను తమకు ఇవ్వాలని రాయల్స్ కోరినట్లు సమాచారం. కేకేఆర్ విషయానికొస్తే.. ఈ ఫ్రాంచైజీ సంజూను ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే బదులుగా అంగ్క్రిష్ రఘువంశీ, రమన్‌దీప్ సింగ్‌లను ఇవ్వాలని రాయల్స్ డిమాండ్ చేసిందట.సంజూ ట్రేడింగ్ విషయంలో రాయల్స్ డిమాండ్లను ఇరు ఫ్రాంచైజీలు తిరస్కరించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో రాయల్స్ సంజూను వేలానికి వదిలేస్తుందని మరో ప్రచారం మొదలైంది. ఇదే జరిగితే సంజూ కోసం సీఎస్కే, కేకేఆర్‌తో పాటు మరిన్ని ఫ్రాంచైజీలు పోటీపడవచ్చు.ఇది ఓ రకంగా సంజూకు లాభదాయకమే అని చెప్పాలి. ప్రస్తుతమున్న ధరతో (రూ. 18 కోట్లు) పోలిస్తే అతనికి మరింత ధర లభించే అవకాశముంటుంది. అయితే సంజూ లాంటి ఆటగాడిని వేలం వరకు పోనివ్వకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎస్కే, కేకేఆర్ లాంటి ఫ్రాంచైజీలకు సంజూ లాంటి ఆటగాడి అవసరం చాలా ఉందని, ఈ ఫ్రాంచైజీలు రాయల్స్‌తో సయోధ్యకు రావచ్చని అంచనా వేస్తున్నారు.ట్రేడింగ్ ద్వారా సంజూ ఎపిసోడ్‌కు పుల్‌స్టాప్ పడితే ఓకే కానీ, వేలం వరకు వెళ్లాల్సి వస్తే మాత్రం ఏమైనా జరగవచ్చు. సంజూకు పంత్‌కు మించిన ధర కంటే ఎక్కువ లభించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగని అంత మొత్తం లభిస్తుందని కూడా చెప్పలేని పరిస్థితి. పర్సుల విషయంలో ఫ్రాంచైజీలకు పరిమితులు ఉన్నాయి.కాగా, జోస్ బట్లర్ విషయంలో సంజూ శాంసన్‌కు, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యానికి గ్యాప్ ఏర్పడినట్లు తెలుస్తుంది. తాను వద్దని చెప్పినా రాయల్స్ బట్లర్‌ను వేలానికి వదిలేసిందని సంజూ అలకపూనాడని ప్రచారం జరుగుతుంది. అంతే కాక జట్టులో తన ప్రాధాన్యత కూడా తగ్గిందని సంజూ భావిస్తున్నట్లు సమాచారం. ధృవ్ జురెల్ (వికెట్‌కీపింగ్), వైభవ్ సూర్యవంశీ (ఓపెనర్) రూపంలో తన స్థానానికి ప్రమాదం పొంచి ఉందని సంజూ భావిస్తుండవచ్చు.ఇలాంటి ఎన్ని ప్రచారాలు సాగినా సంజూ ఐపీఎల్ భవితవ్యంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
సంజూ రాయల్స్ నుంచి వైదొలగాలనుకోవడానికి అతడే ప్రధాన కారణం..?
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్‌కు సంబంధించిన చర్చలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. అసలు కారణాలు తెలియరానప్పటికీ సంజూ రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలనుకుంటున్న విషయం స్పష్టమైపోయింది. రాయల్స్ సైతం సంజూ అభిమతాన్ని గౌరవమిస్తూ, అతన్ని వదిలేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎస్కేతో ట్రేడ్ డీల్ గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.సంజూకు బదులుగా రాయల్స్ సీఎస్కే నుంచి ఇద్దరిని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎస్కే యాజమాన్యం ఇందుకు సమ్మతిస్తున్నట్లు లేదు. సంజూను తాము తీసుకుంటే కేవలం క్యాష్ డీల్ మాత్రమే ఉంటుందని, తమ ఆటగాళ్లను ఎవరినీ వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదని సీఎస్కే స్పష్టం చేసినట్లు సమాచారం.ఈ ప్రచారాల నడుమ సంజూ రాయల్స్‌ను వీడాలనుకోవడానికి కారణమిదే అంటూ ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. సంజూ రాయల్స్‌ను వద్దనుకోవడానికి జోస్ బట్లర్ ప్రధాన కారణమన్నది ఆ వార్త సారాంశం. రాయల్స్ యాజమాన్యం 2025 మెగా వేలానికి ముందు బట్లర్‌ను రీటైన్ చేసుకోలేదు. ఇది సంజూకు అస్సలు మింగుడు పడలేదంట. జోస్ 2018-2024 వరకు రాయల్స్ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించినప్పటికీ అతన్ని రీటైన్ చేసుకోకపోవడం సంజూకు అస్సలు నచ్చలేదట. ఈ కారణంగానే అతను మేనేజ్మెంట్తో విభేదించినట్లు సమాచారం. సంజూ రాయల్స్‌ను వద్దనుకోవడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మొదటిది.. గత సీజన్లో అతని గైర్హాజరీలో (గాయం కారణంగా) వైభవ్ సూర్యవంశీ ఓపెనర్‌గా పాతుకుపోవడం. రెండవది.. యాజమాన్యం అతని ప్రత్యామ్నాయంగా ధృవ్ జురెల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ కారణాల వల్ల సంజూకు రాయల్స్ యాజమాన్యానికి గ్యాప్ పెరిగిందని తెలుస్తుంది.తన మాట చెల్లని చోట, తన స్థానం యాజమాన్యానికి భారమైన చోట ఉండటం ఇష్టం లేకనే సంజూ రాయల్స్‌ను వీడాలని అనుకున్నాడని పలు నివేదికలు చెబుతున్నాయి. 2013లో రాయల్స్‌లో జాయిన్ అయిన సంజూ.. 2021 సీజన్ నంచి ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సంజూ నేతృత్వంలో రాయల్స్ 2022 సీజన్లో రన్నరప్‌గా నిలిచింది. సంజూ, జోస్ బట్లర్ కలిసి రాయల్స్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు.ఇంత చేసినా తన మాట చెల్లకుండా బట్లర్‌ను వదిలేయడం సంజూను చాలా బాధించినట్లు తెలుస్తుంది. బట్లర్‌ను కాదని రాయల్స్ యాజమాన్యం తనతో సహా యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, జురెల్, హెట్‌మైర్, సందీప్ శర్మను అట్టిపెట్టుకుంది. రాయల్స్ వద్దనుకున్నా బట్లర్‌ను గుజరాత్ టైటాన్స్ వేలంలో రూ. 15.75 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. -
సంజూకు బదులు జడ్డూ, రుతురాజ్.. సీఎస్కే నిర్ణయం ఇదే..!
ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో సంజూ శాంసన్ ట్రేడ్ డీల్‌కు సంబంధించిన అంశం హాట్‌హాట్‌గా నడుస్తుంది. సంజూ రాజస్థాన్ రాయల్స్‌ను వీడటం దాదాపుగా ఖాయమైన నేపథ్యంలో సీఎస్కే అతన్ని ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంటుందని ప్రచారం జరుగుతుంది. ట్రేడ్ డీల్‌లో భాగంగా రాయల్స్ సంజూకు బదులు సీఎస్కేకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లను అడిగినట్లు సమాచారం. కొంత నగదుతో పాటు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ లేదా శివమ్ దూబేలలో ఎవరో ఒకరిని డిమాండ్ చేసిందని తెలుస్తుంది. అయితే ఈ డీల్‌కు సీఎస్కే యాజమాన్యం ససేమిరా అనిందని క్రిక్‌బజ్ పేర్కొంది.సంజూకు బదులు నగదు డీల్ జరుగుతుందే కానీ, తమ ఆటగాళ్లలో ఏ ఒక్కరిని వదులుకునేది లేదని సీఎస్కే రాయల్స్‌కు స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఒకవేళ రాయల్స్, సీఎస్కే మధ్య డీల్ కుదరకపోతే సంజూను ట్రేడ్ డీల్ ద్వారా దక్కించుకునేందుకు వేరే ఫ్రాంచైజీలు కూడా పోటీపడవచ్చు. ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపకపోతే సంజూ ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం 2027 సీజన్ వరకు రాయల్స్‌తోనే కొనసాగాల్సి వస్తుంది.సీఎస్కేకు వెళ్లాలన్నది సంజూ వ్యక్తిగత ఆప్షన్‌గా తెలుస్తుంది. రాయల్స్‌లో ఇమడలేకపోవడంతో అతను సీఎస్కే వైపు చూస్తున్నట్లు సమాచారం. ఫ్రాంచైజీ మారాలనుకున్న విషయాన్ని సంజూ చాలా గోప్యంగా ఉంచుతూనే లోలోపల పావులు కదుపుతున్నట్లు వినికిడి. మొత్తానికి సంజూ తమతో అసౌకర్యంగా ఉన్నాడన్న విషయాన్ని రాయల్స్ యాజమాన్యం గ్రహించింది. సంజూ నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవించే అవకాశం ఉంది. ఏ ఫ్రాంచైజీతో ట్రేడ్ డీల్ కుదరకపోతే సంజూను వేలానికి వదిలేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అదే జరిగితే సంజూకు రికార్డు ధర లభించే అవకాశం ఉంటుంది. సీఎస్కేతో పాటు కేకేఆర్, గుజరాత్ ఫ్రాంచైజీలు సంజూ కోసం ఎగబడవచ్చు. -
ఐపీఎల్-2025లో అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే! టీమిండియా లెజెండ్‌పై వేటు?
ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ సపోర్ట్ స్టాప్‌లో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆ జట్టు మెంటార్, టీమిండియా పేస్ బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్‌పై వేటు వేసేందుకు లక్నో యాజమాన్యం సిద్దమైనట్లు తెలుస్తోంది.గత ఐపీఎల్ సీజన్లో లక్నో దారుణ ప్రదర్శన కనబరిచింది. వరుసగా రెండో సీజన్లోనూ ప్లే ఆఫ్స్‌కు చేరడంలో లక్నో విఫలమైంది. 14 మ్యాచ్‌లలో కేవలం ఆరింట మాత్రమే విజయం సాధించిన సూపర్ జెయింట్స్.. పాయింట్ల పట్టికలో ఏడో స్ధానంతో సరిపెట్టుకుంది.కాగా ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు గౌతమ్ గంభీర్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీతో జత కట్టిన తర్వాత లక్నో కోచింగ్ స్టాప్‌లో జహీర్ చేరాడు. ఆ ఏడాది సీజన్‌నూ లక్నో ఏడో స్ధానంతో ముగించింది. జహీర్ మెంటార్‌గా ఉంటూనే లక్నో బౌలింగ్ కోచ్ బాధ్యతలు కూడా నిర్వర్తించాడు.అయితే జాక్ మెంటార్షిప్ పట్ల లక్నో మెన్జ్మెంట్ ఆసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అతడికి వీడ్కోలు పలికి మరొకరిని నియమించాలని సూపర్ జైంట్స్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఇప్పటికే లక్నో కొత్త బౌలింగ్ కోచ్ అరుణ్ భరత్ ఎంపికయ్యాడు. త్వరలో కొత్త మెంటార్‌ను కూడా లక్నో నియమించనుంది. అంతేకాకుండా ఆర్పీస్జీ గ్రూపు ఆద్వర్యంలో ఉన్న అన్ని జట్లను పర్యవేక్షించేందుకు కొత్త క్రికెట్ డైరెక్టర్‌ను కూడా నియమించేందుకు సంజీవ్ గోయోంకా సిద్దమైనట్లు తెలుస్తోంది.మరోవైపు భారీ అంచనాలు పెట్టుకున్న లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ సైతం రాణించలేకపోయాడు. ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ మినహా మిగితా మ్యాచ్‌లలో పంత్ విఫలమయ్యాడు. కాగా పంత్‌ను రూ. 27 కోట్ల రికార్డు ధరకు లక్నో ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.చదవండి: AUS vs SA: చరిత్ర సృష్టించిన బ్రెవిస్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు -
IPL 2026: ‘ఈసారి వేలంలో అతడికే అత్యధిక ధర’
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 మినీ వేలం గురించి టీమిండియా దిగ్గజ స్పిన్నర్, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో భారత ప్లేయర్ల కంటే విదేశీ క్రికెటర్ల వైపే ఫ్రాంఛైజీలు మొగ్గుచూపుతాయని అంచనా వేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈసారి ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు.ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై (CSK), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు చెత్త ప్రదర్శన కనబరిచాయి. ఐదుసార్లు చాంపియన్‌గా ఘనమైన రికార్డు ఉన్న చెన్నై జట్టు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కేకేఆర్ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.వారిని వదిలేసేందుకు సిద్ధంఈ నేపథ్యంలో కెప్టెన్ అజింక్య రహానే సహా వెంకటేశ్ అయ్యర్ వంటి వారిని వదిలించుకునేందుకు కేకేఆర్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. సీఎస్కే సైతం రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వేలను విడిచిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇక అశ్విన్ సైతం సీఎస్కేను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.ఇలాంటి తరుణంలో అశ్విన్ ఐపీఎల్-2026 మినీ వేలం గురించి మాట్లాడాడు. ‘‘ఈసారి మినీ వేలం జరుగబోతోంది. కాబట్టి ఇందులో భారత ఆటగాళ్లను మనం చూడలేమని చెప్పవచ్చు. కచ్చితంగా ఈసారి రేసులోకి కొత్త ఆటగాళ్లు వస్తారు.అంతేకాదు.. ఈసారి ఖరీదైన ఆటగాళ్లుగా విదేశీ ప్లేయర్లు నిలుస్తారు. ఏదేమైనా.. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే భారత్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్‌ను విడుదల చేసింది అంటే.. అంతకంటే రిస్క్ మరొకటి ఉండదని చెప్పవచ్చు.నా అభిప్రాయం ప్రకారం.. ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధర పలుకుతారు. ఈ ఏడాది పంజాబ్ కింగ్స్‌లోకి రీప్లేస్మెంట్ ఆటగాడిగా వచ్చిన మిచెల్ ఓవెన్.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ వేలంకి వస్తారు. వీరికి భారీ ధర దక్కడం ఖాయం.ముఖ్యంగా విదేశీ ఆల్రౌండర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మినీ ఆక్షన్‌లో అన్ని జట్లు రూ. 25. 30 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంది’’ అని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే👉రిషభ్ పంత్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 27 కోట్లు- 2025 వేలం👉శ్రేయస్ అయ్యర్- పంజాబ్ కింగ్స్- రూ. 26.75 కోట్లు- 2025 వేలం👉వెంకటేశ్ అయ్యర్- కోల్‌కతా నైట్ రైడర్స్- రూ. 23.75 కోట్లు- 2025 వేలం👉మిచెల్ స్టార్క్- కోల్‌కతా నైట్ రైడర్స్- రూ. 24.75 కోట్లు- 2024 వేలం👉ప్యాట్ కమిన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్- రూ. 20.50 కోట్లు- 2024 వేలం👉సామ్ కరాన్- పంజాబ్ కింగ్స్- రూ. 18.50 కోట్లు- 2023 వేలం👉కామెరాన్ గ్రీన్- ముంబై ఇండియన్స్- రూ. 17.50 కోట్లు- 2023 వేలం👉బెన్ స్టోక్స్- చెన్నై సూపర్ కింగ్స్- రూ. 16.25 కోట్లు- 2023 వేలం👉క్రిస్ మోరిస్- రాజస్తాన్ రాయల్స్- రూ. 16.25 కోట్లు- 2021 వేలం👉యువరాజ్ సింగ్- ఢిల్లీ డేర్‌డెవిల్స్- రూ. 16 కోట్లు- 2015 వేలం👉నికోలస్ పూరన్- లక్నో సూపర్ జెయింట్స్- రూ. 16 కోట్లు- 2023 వేలం.చదవండి: జేడన్ సీల్స్.. బ్యాటింగ్ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు -
IPL : తలైవర్ ఫ్యాన్ Thala గూటికి..
-
రాజస్తాన్ రాయల్స్‌తో నా జర్నీ ఒక అద్భుతం.. వారికి థ్యాంక్స్: శాంసన్
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ గురుంచి పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2026 సీజన్‌కు ముందు శాంసన్ రాజస్తాన్ రాయల్స్‌ను వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.2013లో రాజస్తాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన సంజూ.. 2021లో ఆ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 30 ఏళ్ల సంజూ రాయల్స్ తరపున 11 సీజన్ల పాటు ఆడాడు. అయితే గత సీజన్లో సంజూ గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితమయ్యాడు. దీంతో పలు మ్యాచ్‌లకు రియాన్ పరాగ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సమయంలో జట్టు యాజమాన్యంతో సంజూకు విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. జట్టు కూర్పు, ఓపెనింగ్ స్థానం విషయంలో సంజూ ఆంసృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ తాజాగా రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానెల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."రాజస్తాన్ రాయల్స్‌కు నాకు ప్రపంచం లాంటింది. కేరళలోని ఒక గ్రామం నుంచి నాకు నా టాలెంట్‌ను నిరూపించుకునేందుకు రాజస్తాన్ అవకాశమిచ్చింది. రాహుల్ ద్రవిడ్ సార్, మనోజ్ బదలే సారు నాకు ఎంతో మద్దతుగా నిలిచారు. రాయల్స్ ఫ్రాంచైజీ వల్లే క్రికెట్ ప్రపంచానికి నేను పరిచయమయ్యాను. అంతేకాకుండా నాపై ఎంతో నమ్మకంతో కెప్టెన్సీ కూడా అప్పగించారు. రాయల్స్‌తో ఈ ప్రయాణం నిజంగా ఒక అద్బుతం. రాజస్తాన్ వంటి ఫ్రాంచైజీలో ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞుడను. ఇంతకు మించి నేను చెప్పలేను అని సంజూ శాంసన్ పేర్కొన్నాడు.చదవండి: SA Vs AUS 1st T20I: టిమ్ డేవిడ్ విధ్వంసం.. దెబ్బకు 16 ఏళ్ల వార్నర్ రికార్డు బ్రేక్ -
సీఎస్కేకు సంజూ శాంసన్.. రాజస్తాన్ కెప్టెన్‌గా అశ్విన్?
ఐపీఎల్-2026కు ముందు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్ రాజస్తాన్ రాయల్స్‌కు వీడ్కోలు పలకనున్నాడా? అంటే అవునానే సమాధానమే ఎక్కువవగా వినిపిస్తోంది. శాంసన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలోకి వెళ్లనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్‌ను రాయల్ యాజమాన్యం విడిచిపెట్టేందుకు సిద్దంగా లేనప్పటికి.. సంజూ మాత్రం ఎలాగైనా బయటకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2021లో రాజస్తాన్ కెప్టెన్‌గా ఎంపికైన శాంసన్.. ఐదు సీజన్ల పాటు జట్టును బాగానే నడిపించాడు.ఐపీఎల్-2022లో రాయల్స్‌ను ఫైనల్‌కు చేర్చిన సంజూ.. ఆ తర్వాత 2024 సీజన్లో రాజస్తాన్ ఫ్లే ఆఫ్స్‌కు చేరుకుంది. ఈ ట్రేడింగ్ రూమర్స్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిరిగి రాజస్తాన్ జట్టులోకి వస్తాడని, అంతేకాకుండా ఆ టీమ్ కెప్టెన్‌గా ఎంపికవుతాడని చోప్రా జోస్యం చెప్పాడు."రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ సీఎస్కేకి ట్రేడ్ అయ్యే అవకాశముంది. ఒకవేళ అతడు చెన్నై జట్టులోకి వచ్చిన కెప్టెన్సీ పగ్గాలు అయితే అప్పగించరు. ఎందుకంటే రుతురాజ్ గైక్వాడ్‌ను కొన్ని సీజన్ల పాటు కెప్టెన్‌గా సీఎస్కే కొనసాగించవచ్చు.ఇదే క్రమంలో అశ్విన్ తిరిగి రాజస్తాన్ రాయల్స్‌కు వెళ్లవచ్చు. అంతేకాకుండా ఆ జట్టు పగ్గాలను అప్పగించిన ఆశ్చర్యపోనక్కర్లేదు. సంజూ బయటకు వెళ్లిపోతే రాజస్తాన్ కెప్టెన్‌గా ఎవరు అవుతారన్నది ప్రస్తుతం నేను ఆలోచిస్తున్నాను.ధ్రువ్ జురెల్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకునేందుకు సిద్దంగా లేడు. అందుకు ఇంకా సమయం పడుతుంది. యశస్వి జైశ్వాల్ కెప్టెన్ అవ్వాలనే కోరిక అయితే ఉంది. కానీ అతడిపై కెప్టెన్సీ భారాన్ని రాజస్తాన్ మోపుతుందని నేను అనుకోవడం లేదు. రియాన్ పరాగ్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. అతడు గత సీజన్లో పర్వాలేదన్పించాడు.సంజూ సీఎస్కేకు వెళ్తే వారికి ఫ్యూచర్ వికెట్ కీపింగ్‌కు ఎటువంటి ఢోకా ఉండదు. కాబట్టి ఎంఎస్ ధోని తనకు నచ్చినది చేయగలడు. అదేవిధంగా ఆర్ఆర్కు ఆఫ్ స్పిన్నర్ కూడా అవసరం. గత సీజన్లో వనిందుకు హసరంగా, మహీష్ తీక్షణ అంత మెరుగ్గా రాణించలేకపోయారు. కాబట్టి అశ్విన్‌ను తీసుకుంటే వారికి ఆఫ్ స్పిన్నర్‌తో పాటు కెప్టెన్సీ అప్షన్ కూడా లభిస్తోంది. -
IPL 2026: నన్ను విడిచిపెట్టండి.. వెళ్లిపోతా!.. సీఎస్కేకు గుడ్‌బై?
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే ట్రేడింగ్ రూపంలో జట్లలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు సంజూ శాంసన్ (Sanju Samson). రాజస్తాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా రాణించిన ఈ కేరళ బ్యాటర్.. వచ్చే ఎడిషన్‌లో ఈ ఫ్రాంఛైజీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.తాను ఫిట్‌గా ఉన్నా రియాన్ పరాగ్ (Riyan Parag)కు కెప్టెన్సీ ఇవ్వడం, మెగా వేలంలో జోస్ బట్లర్‌ను విడిచిపెట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో సంజూ.. రాయల్స్‌ను వీడేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.సీఎస్కేకు అశ్విన్ గుడ్‌బై?ఈ క్రమంలో తెరమీదకు వచ్చిన మరో ఆసక్తికర వార్త ఇందుకు బలం చేకూరుస్తోంది. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin).. తనను విడిచిపెట్టమని సీఎస్కేను కోరాడని దాని సారాంశం. దీనిని బట్టి సీఎస్కే అశూను రాయల్స్‌కు ఇచ్చి.. వారి నుంచి సంజూను ట్రేడ్ చేసుకోనుందనే ప్రచారం ఊపందుకుంది.కాగా 2009లో అశ్విన్ సీఎస్కేతోనే తన ఐపీఎల్ కెరీర్ ఆరంభించాడు. ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ (ఇప్పుడు మనుగడలో లేదు), పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. ఇక 2022లో రాజస్తాన్ రాయల్స్‌లో చేరిన అశ్విన్.. గతేడాది వరకు అక్కడే విజయవంతంగా కొనసాగాడు.రూ. 9.75 కోట్లకు కొనుగోలుఅయితే, ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు రాయల్స్ అతడిని విడుదల చేయగా.. సీఎస్కే రూ. 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ.. ఈ సీజన్లో అశ్విన్‌కు తొమ్మిది మ్యాచ్‌లలో ఆడే అవకాశం మాత్రమే దక్కింది. అయితే, అందులోనూ అతడు నిలకడగా రాణించలేకపోయాడు. కేవలం ఏడు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వేరే జట్టుకు మారతాడా?యువ ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇచ్చే క్రమంలో మేనేజ్మెంట్ అశూను పలు మ్యాచ్‌లలో బెంచ్‌కే పరిమితం చేసింది. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ఈ రైటార్మ్ ఆఫ్‌బ్రేక్ స్పిన్నర్ సీఎస్కేను వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, రాయల్స్ అతడిని తిరిగి తీసుకుంటుందా? లేదంటే వేరే జట్టుకు మారతాడా? అనేది త్వరలోనే తెలుస్తుంది. కాగా ఐపీఎల్లో అశ్విన్ మొత్తంగా 220 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు కూల్చాడు.ఇక గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నపుడే అశూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. టీమిండియా తరఫున 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ చెన్నై ప్లేయర్.. టెస్టుల్లో 537, వన్డేల్లో 156, టీ20లలో 72 వికెట్లు కూల్చాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 3503, 707, 184 పరుగులు సాధించాడు.చదవండి: అతడొక ఆల్ ఫార్మాట్ ప్లేయర్.. ఆసియాకప్‌లో ఆడాల్సిందే: గంగూలీ -
సంజూ శాంసన్‌కు మీకిస్తే బదులుగా ఇద్దరిని ఇవ్వండి.. రాయల్స్ డిమాండ్..!
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలని అనుకుంటున్నట్లు సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఈ ప్రచారం నిజమేనని తాజాగా పరిణామాలు సూచిస్తున్నాయి.ఏ ఫ్రాంచైజీ అయినా సంజూను ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని అనుకున్నట్లైతే బదులుగా ఇద్దరు ఆటగాళ్లతో పాటు నగదును కూడా ఇవ్వాలని రాయల్స్ మేనేజ్మెంట్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.ఈ విషయం ప్రచారంలోకి వచ్చిన తర్వాత రాయల్స్ యాజమాన్యం సంజూను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. వాస్తవానికి ఈ డీల్‌ను రాయల్స్ యాజమాన్యం సంజూపై అమితాసక్తి ప్రదర్శిస్తున్న సీఎస్కే కోసం తీసుకొచ్చిందట.సంజూను వారికిస్తే బదులుగా ఓ విదేశీ ప్లేయర్‌ను, ఓ దేశీయ ఆటగాడిని ఇవ్వాలని ప్రతిపాదన పెట్టిందట. ఈ డీల్‌పై సీఎస్కే సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాయల్స్ యాజమ్యానం ఎవరిని కోరుకుంటుందనే దానిపై ఆ ఫ్రాంచైజీ తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది.ఈ ప్రక్రియ పూర్తివడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సంజూకు రాయల్స్‌తో 2027 సీజన్ వరకు ఒప్పందం ఉంది. వారు రిలీజ్ చేస్తే తప్ప అతను వేరే ఫ్రాంచైజీకి వెళ్లలేడు.వాస్తవానికి సంజూకు యాజమాన్యంతో చాలా మంది సంబంధాలు ఉన్నాయి. పైగా కోచ్ ద్రవిడ్‌కు సంజూ ప్రియ శిష్యుడు. మరి ఏ విషయంలో వీరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయో తెలియడం లేదు.2025 సీజన్‌కు ముందు మార్పులు చేర్పుల విషయంలో యాజమాన్యానికి-సంజూకు మధ్య గ్యాప్ ఏర్పడినట్లు వినికిడి. ఆ గ్యాప్ సీజన్ పూర్తయ్యే సరికి తారాస్థాయికి చేరింది. మొత్తానికి సంజూ రాయల్స్‌ను వీడాలని గట్టిగా అనుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్కే అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది.గత ఐపీఎల్ సీజన్ ముగిసాక సీఎస్కే సీఈవో, ఆ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ సంజూను అమెరికాలో కలిసారని సమాచారం. వారి మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగి సంజూ సీఎస్కేకు వస్తే, సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడా లేక రుతురాజ్‌ను తప్పించి అతనికి కెప్టెన్సీ అప్పగిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.రుతురాజ్ ఇప్పుడిప్పుడే ధోని అండర్లో కెప్టెన్‌గా ఓనమాలు దిద్దుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో సంజూ కోసం అతన్ని కెప్టెన్సీ త్యాగం చేయమని సీఎస్కే మేనేజ్మెంట్ ఆడగకపోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.2013లో రాయల్స్‌తోనే ఐపీఎల్ జర్నీ ప్రారంభించిన సంజూ.. మధ్యలో రెండేళ్లు మినహా ఐపీఎల్ కెరీర్ మొత్తం ఆ ఫ్రాంచైజీతోనే కొనసాగాడు. 2019, 2020 సీజన్లలో అదిరిపోయే ప్రదర్శనలు చేసిన అతను.. 2021 సీజన్లో రాయల్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సంజూ నేతృత్వంలో ఆ జట్టు 2022 సీజన్ ఫైనల్స్‌కు చేరింది. -
సీఎస్కేలోకి బెన్ డకెట్..!
వచ్చే ఐపీఎల్ సీజన్ (2026) కోసం ఫైవ్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. గడిచిన సీజన్లో ఆ జట్టు పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో (14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు) నిలిచింది. ఈ కారణంగానే సీఎస్కే యాజమాన్యం భారీ ప్రక్షాళన చేపట్టే అవకాశం ఉంది.ఈ క్రమంలో సీఎస్కే ఓ కీలక ఆటగాడిగాని జట్టులో చేర్చుకోవచ్చని తెలుస్తుంది. ఇంగ్లండ్ బజ్‌బాల్ టెక్నిక్‌లో భాగమైన బెన్ డకెట్పై సీఎస్కే కన్నేసినట్లు తెలుస్తుంది. డకెట్‌ను జట్టులో చేర్చకోవడం వల్ల సీఎస్కే అనేక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది.గత సీజన్లో సీఎస్కేకు సరైన ఓపెనింగ్ బ్యాటర్ లేక పవర్‌ప్లేల్లో తేలిపోయింది. ఆ జట్టుకు ఒక్క మ్యాచ్‌లో కూడా మెరుపు ఆరంభం లభించలేదు. సీఎస్కే గత సీజన్ మొత్తం ఓపెనర్లతో ప్రయోగాలు చేసింది. రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, డెవాన్ కాన్వే, షేక్ రషీద్, ఆయుశ్ మాత్రేతో రకరకాల కాంబినేషన్లతో ప్రయోగాలు చేసిన సత్ఫలితాలు రాలేదు. డకెట్ ఆ జట్ట పవర్‌ప్లే కష్టాలకు సరైన పరిష్కారం కావచ్చు. డకెట్‌కు పవర్‌ప్లేల్లో మంచి రికార్డు ఉంది. దూకుడైన ఆటతీరుతో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లకు మెరుపు ఆరంభాలను అందించాడు. టీ20ల్లో డకెట్‌కు 140కు పైగా స్ట్రయిక్‌రేట్ ఉంది. పవర్ప్లేల్లోనే కాకుండా క్రీజ్‌లో కుదురుకుంటే ఇన్నింగ్స్ మొత్తం దడదడలాడించేస్తాడు డకెట్.గత సీజన్లో సీఎస్కే ఎదుర్కొన్న మరో కీలకమైన సమస్య స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం. ఈ సమస్యకు కూడా డకెట్ సరైన పరిష్కారం కావచ్చు. డకెట్‌కు స్పిన్నర్లపైన మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతడికున్న అద్బుతమైన టెక్నిక్‌తో స్పిన్నర్లకు ఎడాపెడా వాయించేస్తాడు. స్పిన్నర్లపై అతని స్వీప్ షాట్లు, ముఖ్యంగా రివర్స్ స్వీప్‌లు అమితంగా ఆకట్టుకుంటాయి. పై కారణాలకు పరిష్కారం దిశగా సీఎస్కే వచ్చే సీజన్ కోసం డకెట్‌ను తప్పక కొనుగోలు చేస్తుందని టాక్ నడుస్తుంది. ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోయే 30 ఏళ్ల డకెట్ ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటుతున్నాడు. మెరుపు బ్యాటింగ్‌తో అతడు ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌కు తురుపుముక్కగా ఉన్నాడు. -
గైక్వాడ్‌పై వేటు.. సీఎస్కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను?
ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ పేసర్ టి నటరాజన్ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడనున్నాడా? అంటే అవునానే అంటున్నారు క్రికెట్ నిపుణులు. వచ్చే ఏడాది సీజన్ ముందు నటరాజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి సీఎస్కే ట్రేడ్ చేసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ తమిళనాడు ఫాస్ట్ బౌలర్ సీఎస్కే క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతుండడం ట్రేడ్ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. సీఎస్కే ట్రైనింగ్ జెర్సీని నటరాజన్ ధరించి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఐపీఎల్-2025 వేలంలో నటరాజన్‌ను రూ. 10.75 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.దీంతో అతడికి కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. మిచెల్ స్టార్క్, చమీరా, ముఖేష్ కుమార్ వంటి స్టార్ పేసర్లు ఉండడంతో అతడు ఎక్కువ భాగం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని ఢిల్లీ కూడా వదులుకోవడానికి సిద్దంగా ఉంది.2017లో అరంగేట్రం..ఈ తమిళనాడు పేసర్ 2017లో పంజాబ్ కింగ్స్ తరపున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తన అరంగేట్ర సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా 2018, 2019 సీజన్లకు నట్టు దూరమయ్యాడు. తిరిగి మళ్లీ ఐపీఎల్-2020 ఎస్ఆర్హెచ్తో జతకట్టాడు. ఆరెంజ్ ఆర్మీతో ఐదేళ్ల పాటు తన ప్రయణాన్ని కొనసాగించాడు.అయితే గత సీజన్ మెగా వేలానికి ముందు అతడిని సన్‌రైజర్స్ విడిచిపెట్టింది. దీంతో అతడు ఢిల్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకు 63 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన నటరాజన్.. 67 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. నటరాజన్ గత నాలుగేళ్లగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. టీమిండియా తరపున 7 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. గాయాల కారణంగా అతడు భారత జట్టులో చోటు కోల్పోవల్సి వచ్చింది.కేఎల్ రాహుల్‌పై కన్ను..?అదేవిధంగా మరో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై కూడా సీఎస్కే కన్నేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు రాహుల్‌ను సీఎస్కే ట్రేడ్ చేసుకోవాలని భావిస్తుందంట. రుతురాజ్‌పై వేటు వేసి రాహుల్‌కు తమ జట్టు పగ్గాలను అప్పగించాలని సీఎస్కే యాజమాన్యం యోచిస్తున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి.కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రాహుల్ రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో ఢిల్లీ తరపున లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: అతడొక లెజెండ్.. కానీ అలా ప్రవర్తిస్తాడని అనుకోలేదు: భారత స్టార్ బౌలర్ -
IPL 2026: రహానేపై వేటు.. కేకేఆర్ కెప్టెన్‌గా టీమిండియా ఓపెనర్!
టీమిండియా స్టార్ బ్యాటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. ఐపీఎల్-2026కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీ రాహుల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నది ఆ వార్త సారాంశం. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కర్ణాటక ఆటగాడిని రూ.14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ సొంతం చేసుకుంది. రాహుల్ తన ధరకు తగ్గ న్యాయం చేశాడు. గత సీజన్లో 13 మ్యాచ్‌లు ఆడి 539 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.కేకేఆర్ అట్టర్ ప్లాప్..అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచింది. అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్ 14 మ్యాచ్‌లు ఆడి కేవలం ఐదింట మాత్రమే విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్ధానంలో నైట్‌రైడర్స్ నిలిచింది.ఈ క్రమంలోనే రాహుల్‌ను ఎలాగైనా ట్రేడ్ చేసుకుని తమ జట్టు పగ్గాలను అప్పగించాలని కేకేఆర్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేకేఆర్ ప్రస్తుత జట్టులో భారత వికెట్ కీపర్ ఒక్కరు కూడా లేరు. జట్టులోని ఇద్దరు కీపర్లు(క్వింటన్ డికాక్, రహ్మానుల్లా గుర్భాజ్) విదేశాలకు చెందినవారే.అయినా వీరిద్దరూ తమ స్ధాయికి తగ్గప్రదర్శన చేయడంలో విఫలమయ్యారు. అందుకే రాహుల్‌ను తీసుకుంటే కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా ఉపయోగపడతాడని కేకేఆర్ యోచిస్తోంది. కానీ రాహుల్ వంటి అద్బుతమైన ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ ఒప్పుకొంటుందో లేది వేచి చూడాలి. మరోవైపు చంద్రకాంత్ పండిత్ కేకేఆర్ హెడ్‌కోచ్‌కు రాజీనామా చేశాడు. అతడి స్ధానంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను ప్రధాన కోచ్‌గా నియమించేందుకు కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఐపీఎల్-2026 మినీ వేలం ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అవకాశముంది.చదవండి: టీమిండియా అద్భుత పోరాటం.. కానీ ఓ చెత్త రికార్డు.. ప్రపంచంలోని తొలి జట్టుగా.. -
IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం
2026 ఐపీఎల్ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ఇప్పటి నుంచే వ్యూహరచన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌ను నియమించుకుంది. కేకేఆర్ నుంచి తాజాగా బయటికి వచ్చిన భరత్ అరుణ్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకుంది.అరుణ్ కేకేఆర్ 2024 సీజన్లో విజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ సీజన్లో కేకేఆర్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో ఛాంపియన్‌గా నిలిచింది. అరుణ్ అంతకుముందు టీమిండియా తరఫున కూడా అద్భుతాలు చేశాడు. 2014-2021 వరకు భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా పని చేసి ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు.అరుణ్ 2022లో కేకేఆర్‌తో జతకట్టి నాలుగు సీజన్ల పాటు ఆ జట్టుతో కొనసాగాడు. తాజాగా కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవి నుంచి వైదొలగడంతో అరుణ్ కూడా బయటికి వచ్చేశాడు. లక్నో బౌలింగ్ కోచ్‌గా అరుణ్ ఏడాది మొత్తం అందుబాటులో ఉండాల్సి ఉంటుంది. మధ్యలో వేరే ఏ ఒప్పందాలు చేసుకోకూడదు. దీనికి సమ్మతించే అరుణ్ సంజీవ్ గెయెంకా జట్టుతో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.వాస్తవానికి ఇప్పటివరకు లక్నోకు స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్ లేడు. స్పిన్ బౌలింగ్ కన్సల్టెంట్ ప్రవీణ్ తాంబేతో పని కానిచ్చేస్తుంది. తాజాగా అరుణ్‌ను స్పెషలిస్ట్ బౌలింగ్ కోచ్‌గా నియమించుకోవడంతో లక్నో బౌలింగ్ విభాగం బలపడే అవకాశం ఉంది. ఆ ఫ్రాంచైజీకి టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ మెంటార్‌గా ఉన్నాడు. గత సీజన్లో అతనే బౌలింగ్ కోచ్ బాధ్యతలను మోశాడు.2022 సీజన్లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన లక్నో తొలి రెండు సీజన్లు మూడో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరగా.. గత రెండు సీజన్లలో పేలవ ప్రదర్శనతో ఏడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు గత సీజన్లోనే కేఎల్ రాహుల్‌ను మార్చి రిషబ్ పంత్‌ను కొత్త కెప్టెన్‌గా తెచ్చుకుంది. పంత్‌కు లక్నో యాజమాన్యం రికార్డు స్థాయిలో 27 కోట్లు చెల్లించి ఒప్పందం చేసుకుంది.గత సీజన్లో ఇతర జట్లతో పోలిస్తే లక్నో బౌలింగ్ విభాగం చాలా బలహీనంగా కనిపించింది. ఆ జట్టులో ఆవేశ్ ఖాన్, ఆకాశ్‌దీప్, మొహిసిన్ ఖాన్, షమార్ జోసఫ్, ప్రిన్స్ యాదవ్, ఆకాశ్ సింగ్, మయాంక్ యాదవ్ పేసర్లుగా ఉండగా.. మణిమారన్ సిద్దార్థ్, దిగ్వేశ్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్ స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఉన్నారు. -
IPL 2026: కేకేఆర్ హెడ్‌కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్!?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) జట్టుకు కొత్త హెడ్‌కోచ్ రాబోతున్నాడు. ఇందుకోసం యాజమాన్యం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కేకేఆర్ ప్రధాన కోచ్‌గా పనిచేసిన చంద్రకాంత్ పండిత్ శిక్షణ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.ఆయన సేవలు వెలకట్టలేనివిరెండేళ్లుగా కేకేఆర్‌తో ప్రయాణం చేసిన చంద్రకాంత్... ఇకపై కొనసాగబోవడం లేదని ఫ్రాంచైజీ యాజమాన్యం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘కేకేఆర్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కొత్త అవకాశాలను అన్వేషించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్రాంచైజీ హెడ్ కోచ్‌గా కొనసాగాలనుకోవడం లేదు. రెండేళ్లుగా జట్టుకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. 2024లో కోల్‌కతా చాంపియన్‌గా నిలవడంలో చంద్రకాంత్ కీలక పాత్ర పోషించారు.క్రమశిక్షణ, అంకితభావంతో బలమైన జట్టును రూపొందించారు. జట్టుపై ఆయన ప్రభావం ఎంతగానో ఉంది. భవిష్యత్తులోనూ ఆయన విజయవంతం కావాలని ఆశిస్తున్నాం’ అని ఫ్రాంచైజీ ప్రకటనలో పేర్కొంది.గతేడాది టైటిల్.. ఈసారి పేలవ ప్రదర్శనకాగా కోచింగ్‌లో అపార అనుభవం ఉన్న చంద్రకాంత్ శిక్షణలో కేకేఆర్ జట్టు 2024లో మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకుంది. అయితే ఈ ఏడాది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా... స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. లీగ్ దశలో పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం ఐదింట మాత్రమే నెగ్గి పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.ఇక ఐపీఎల్లో కేకేఆర్‌కు ఇదే పేలవ ప్రదర్శన కాగా... ఈ సీజన్లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ‘ప్లే ఆఫ్స్’ రేసుకు దూరమై నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ జట్టును వీడటం గమనార్హం.కాగా దేశవాళీల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్ పండిత్... 2023 ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందు కేకేఆర్ జట్టుతో చేరారు. కాగా ఆ ఏడాది ఏడో స్థానంలో నిలిచిన కోల్‌కతా... తర్వాతి సంవత్సరం ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. 2024లో ఐపీఎల్ ట్రోఫీతో పాటు లీగ్ చరిత్రలో అత్యధిక పాయింట్లు, అత్యుత్తమ రన్‌రేట్ సైతం కేకేఆర్ నమోదు చేసుకుంది. హెడ్‌కోచ్‌గా ఇయాన్ మోర్గాన్?ఇక చంద్రకాంత్ పండిట్ నిష్క్రమణ నేపథ్యంలో కేకేఆర్ తమ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను హెడ్‌కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. 2020, 2021 సీజన్లలో మోర్గాన్ కేకేఆర్ సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో కోల్‌కతా జట్టు 24 మ్యాచ్‌లకు గానూ పదకొండు గెలిచింది.ఇదిలా ఉంటే.. చంద్రకాంత్ పండిట్‌తో పాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కూడా కేకేఆర్‌ను వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే అతడు చెన్నై సూపర్ కింగ్స్‌తో జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అయితే, గతేడాది జట్టును చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్.. తాజాగా హెడ్‌కోచ్‌కు కూడా ఉద్వాసన పలికింది. ఇక శ్రేయస్‌ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయగా.. ఐపీఎల్-2025లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. కేకేఆర్ అజింక్య రహానేను తమ కెప్టెన్‌గా నియమించుకోగా పేలవ ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్స్ చేరకుండా నిష్క్రమించింది.ఐపీఎల్-2025లో కేకేఆర్ కోచింగ్ సిబ్బంది వీరే👉మెంటార్: డ్వేన్ బ్రావో👉హెడ్‌కోచ్: చంద్రకాంత్ పండిత్👉బౌలింగ్ కోచ్: భరత్ అరుణ్👉స్పిన్ బౌలింగ్ కోచ్: కార్ల్ క్రోవ్👉ఫిజియోథెరపిస్ట్: ప్రశాంత్ పంచాడ👉స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్: క్రిస్ డొనాల్డ్సన్👉టీమ్ మేనేజర్: అడ్రియాన్ వాన్ బెంట్లీ.చదవండి: WCL 2025: స్టువర్ట్ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా